టీడీపీ కంచుకోట‌లో క్యాండెట్ మారితే క‌ష్ట‌మేనా…!

విజ‌య‌న‌గ‌రం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఇంకా చెప్పాలంటే సీనియ‌ర్ నేత ప‌తివాడ నారాయ‌ణ‌స్వామి అడ్డాగా ఉన్న‌ నెల్లిమ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం టీడీపీ టికెట్ ఎరిక‌న్న‌ది ఇంకా తేల‌డం లేదు. [more]

Update: 2019-02-08 04:30 GMT

విజ‌య‌న‌గ‌రం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఇంకా చెప్పాలంటే సీనియ‌ర్ నేత ప‌తివాడ నారాయ‌ణ‌స్వామి అడ్డాగా ఉన్న‌ నెల్లిమ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం టీడీపీ టికెట్ ఎరిక‌న్న‌ది ఇంకా తేల‌డం లేదు. నాలుగైదు పేర్లు వినిపిస్తున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే, రాజ‌కీయ‌ కురువృద్ధుడైన ప‌తివాడ‌ నారాయ‌ణ‌స్వామికి మంచి ట్రాక్ రికార్డు ఉంది.1983 నుంచి 2004ఎన్నిక‌ల వ‌ర‌కు వ‌రుస‌గా గెలుస్తూ వ‌చ్చారు. ఆయ‌న జైత్ర‌యాత్ర‌కు 2009లో బ్రేక్ ప‌డింది. అది కూడా కేవ‌లం 500 ఓట్ల అతి స్వ‌ల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. నాడు ప్ర‌జారాజ్యం ఎంట్రీతో జ‌రిగిన ముక్కోణ‌పు పోటీలో ఆయ‌న‌పై బ‌డ్డుకొండ అప్ప‌ల‌నాయుడు స్వ‌ల్ప తేడాతో విజ‌యం సాధించారు. ఇక 2014లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో మ‌ళ్లీ నారాయ‌ణ‌స్వామే విజ‌యం సాధించారు. ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం నిత్యం ఆయన ప్రజల్లో ఉంటారు. అందుకే ఆయ‌నకు ఇన్నాళ్లు తిరుగులేదు. ఇప్పుడు కూడా పెద్ద‌గా వ్య‌తిరేక‌త లేదు. సౌమ్యుడిగా పేరుంది. అయితే వ‌య‌సు పైబ‌డింద‌నే కార‌ణంతో ఆయ‌న‌కు టికెట్ ఇచ్చేందుకు చంద్రబాబు నిరాక‌రిస్తారా? లేదా తిరిగి వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారం కీలకం కావ‌డంతో ఆయ‌న్నే రంగంలోకి దింపుతారా? అన్న‌ది చూడాలి.

నెల్లిమర్లపై కన్నేసిన గంటా…

త‌న‌ను త‌ప్పిస్తే త‌న త‌న‌యుడికి టికెట్ ఇవ్వాల‌ని నారాయ‌ణ‌స్వామి చంద్ర‌బాబును కోరిన‌ట్లు స‌మాచారం. అయితే దానికి చంద్ర‌బాబుకు సిద్ధంగా లేర‌ని తెలుస్తోంది. త‌న‌యుడికి ఇవ్వ‌కుంటే మాత్రం త‌న‌కే టికెట్ కేటాయించాల‌ని కూడా అధినేత‌ను కోరారట. అయితే చంద్‌ిబాబు నిర్ణ‌యం తెలియ‌రావ‌డం లేదు. వాస్త‌వానికి నారాయ‌ణ‌స్వామికి మంచి పేరున్న త‌న త‌న‌యులు రాజ‌కీయ అంశాలే కొద్దిగా ఆయ‌న్ను ఇబ్బందుల్లోకి నెట్టాయ‌ని తెలుస్తోంది. ఇక ప్ర‌తీ ఎన్నిక‌లకు నియోజ‌క‌వ‌ర్గాన్ని మార్చే గంట శ్రీనివాస‌రావు కూడా నెల్లిమ‌ర్ల‌పై క‌న్నేసిన‌ట్లు తెలుస్తోంది. ఇక్క‌డి నుంచి ఆయ‌న పోటీ చేయాల‌ని భావిస్తున్న‌రట. గ‌త నాలుగు ఎన్నిక‌ల్లో నాలుగు నియోజ‌క‌వ‌ర్గాలు మారుస్తూ వ‌స్తోన్న గంటా ప్ర‌స్తుతం విశాఖ జిల్లా భీమిలి నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. విజ‌య‌న‌గ‌రం జిల్లా ఇన్‌ఛార్జ్‌ గా ఉన్న గంటా నెల్లిమ‌ర్ల మీద క‌న్నేసి కొద్ది రోజులుగా ఇక్క‌డ ద్వితీయ శ్రేణి నాయ‌కుల‌ను త‌న వైపున‌కు తిప్పుకునే ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్టే అక్క‌డ వాతావ‌ర‌ణం చెపుతోంది.

ద్విముఖ పోరుతో విజేత ఎవరో…

ఇక నారాయ‌ణ‌స్వామి పేరు కాకుండా ఇద్ద‌రు ఎంపీపీల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే అధిష్ఠానం వ‌ద్ద వారికి అంత‌గా బ‌లం లేద‌ని స‌మాచారం. నారాయ‌ణ‌స్వామికి టికెట్ ఇస్తే పార్టీ కచ్చితంగా పార్టీ గెలుస్తుంద‌ని నియోజ‌క‌వ‌ర్గ నేత‌లు చెప్పుకొస్తున్నారు. అలా కాకుంటే గంటాతో స‌హా ఇంకెవ‌రికి టికెట్ కేటాయించిన కొంత ఇబ్బందిక‌ర వాతావ‌ర‌ణం ఉంటుంద‌ని హెచ్చ‌రిస్తున్నారు. ఇదిలా ఉండ‌గా వైసీపీ విష‌యానికి వ‌స్తే పెన్మ‌త్స సాంబ‌శివ‌రావు ఫ్యామిలీని కాద‌ని బొత్స స‌త్య‌నారాయ‌ణ బంధువు మాజీ ఎమ్మెల్యే బొడ్డుకొండ అప్ప‌ల‌నాయుడుకి పార్టీ నియోజ‌క‌వ‌ర్గం స‌మ‌న్వ‌య‌క‌ర్త ప‌గ్గాలు అప్ప‌గించ‌డంతో ఆ పార్టీలో అసంతృప్తి నెల‌కొంది. గ‌తంలో ర‌ద్ద‌యిన స‌తివాడ నుంచి ఎనిమిది సార్లు ఘ‌న‌ విజ‌యాలు సాధించిన పెన్మత్స సాంబ‌శివ‌రాజు ఫ్యామిలీని జ‌గ‌న్ పూర్తిగా ప‌క్క‌న పెట్ట‌డంతో కొన్ని వ‌ర్గాల్లో అసంతృప్తి నెల‌కొంది. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో కాపు సామాజకవ‌ర్గం ఓట్లు అధికంగా ఉండ‌ట‌మే ఆయ‌న ఎంపికకు ఓ కార‌ణంగా తెలుస్తోంది. జ‌న‌సేన అభ్య‌ర్థి గురించి అయితే ఇంకా ఏం తెలియ‌రావ‌డం లేదు. పోటీ మాత్రం ప్ర‌ధానంగా వైసీపీ -టీడీపీల మ‌ధ్యే ఉండ‌నుంది.

Tags:    

Similar News