జేసీ బ్రదర్ జోస్యం నిజమేనా?

విలీనాలు ఏపీకి కొత్త కాదు, ఇక విభజన తరువాత తెలంగాణాలో కొత్త విలీనం కధ మొదలైంది. నాడు ముగ్గురు సభ్యులు ఉన్న వైసీపీని, ఆ తరువాత పదిహేను [more]

Update: 2019-07-13 06:30 GMT

విలీనాలు ఏపీకి కొత్త కాదు, ఇక విభజన తరువాత తెలంగాణాలో కొత్త విలీనం కధ మొదలైంది. నాడు ముగ్గురు సభ్యులు ఉన్న వైసీపీని, ఆ తరువాత పదిహేను మంది సభ్యులు ఉన్న టీడీపీని టీఆర్ఎస్ సర్కార్ విలీనం చేసుకుంది. రెండవమారు అధికారంలోకి వచ్చాక బలమైన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ ని కూడా విలీనం చేసుకుంది. అంతకు ముందు ప్రజారాజ్యం పార్టీ మొత్తానికి మొత్తం కాంగ్రెస్ లో విలీనం అయిన చరిత్ర కూడా చూశాం. ఇక తాజాగా గోవాలో ఉన్న పది మంది ఎమ్మెల్యేల కాంగ్రెస్ పార్టీ బీజేపీలో విలీనం అయిన విషయం సంచలనం రేపుతోంది. ఓ విధంగా చెప్పాలంటే ఇది విలీన రాజకీయ యుగంగా ఉందనుకోవాలి. మరి సమయం సందర్భం కలసివచ్చిందనో మరే కారణమో తెలియదు కానీ టీడీపీలో సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి టీడీపీని బీజేపీతో విలీనం చేస్తే ఓ పని అయిపోతుందనేశారు. ఆయన చాలా సులువుగా ఈ మాట చెప్పినా పసుపు పార్టీ తమ్ముళ్లకు మాత్రం ఎక్కడో కలుక్కుమంటోంది. దాదాపుగా నాలుగు దశాబ్దాల పార్టీ టీడీపీని ఏపీలో నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చిన బీజేపీలో విలీనం చేయడమా అని భగ్గుమంటున్నారు.

చేస్తే మంచిదేనట….

ఆనాడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీకి ఏపీలో పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అప్పట్లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఎమ్మెల్యేల పక్క చూపులు భరించలేక చిరంజీవి గౌరవంగా తానే తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తున్నట్లుగా చెప్పుకుని కేంద్రంలో మంత్రి పదవి తీసుకున్నారు. ఇపుడు చంద్రబాబు నాయుడు పరిస్థితి కూడా ఏమంత గొప్పగాలేదు. ఏపీ అసెంబ్లీలో పేరుకు టీడీపీకి 23 మంది ఎమ్మెల్యేలు ఉంటే అందులో ఒకరిద్దరు తప్ప నోరు విప్పిన వారు లేరు. అసలు సభకు వచ్చిన వారు కూడా లేరు. ఇక మిగిలిన వారిలో అనేకమంది సొంత పనుల్లో బిజీగా ఉన్నారు. కొందరు గోడ దూకడానికి టైం కోసం ఎదురుచూస్తున్నారు. ఇలా జారిపోతున్న వారిని ఒక గాటకు కట్టి నడిపించడం బాబుకు కష్టసాధ్యమైన విషయమే. మరో వైపు బీజేపీ కూడా పొంచిఉంది. వీలైనంత మందిని తీసేసుకుని బీజేపీలోకి తమ్ముళ్ళు విలీనం అయ్యారని చెప్పుకోవడానికి ఆ పార్టీ ఆరాటపడుతోంది. అందువల్ల ఎటువంటి చికాకులు లేకుండా ఉండాలంటే అధినాయకుడే విలీనం ప్రతిపాదన చేస్తే మంచిదని జేసీ బ్రదర్ ప్రభాక‌రరెడ్డి అంటున్నారు.

దిగనారిపోవడమేనా….

ఏపీలోనూ, దేశంలోనూ ఇపుడున్న వాతావరణంలో తెలుగుదేశం పార్టీ మనగలిగే అవకాశాలు పెద్దగా లేవనే చెప్పాలి.బాబు డెబ్బయి పడిలో ఉన్నారు. ఆయన పార్టీని ఈ వయసులో నడిపించడం శక్తికి మించిన పని. ఇక పార్టీలో ఉన్న వారికి నిబద్దత లేదు. వారంత వారు గోడ దూకడానికి చూస్తున్నారు. రాజకీయం కాస్తా జోరు అందుకుంటే ఉన్న వారిలో చాలా మంది ఫిరాయించడం ఖాయం. అపుడు చంద్రబాబుకు మిగిలేది తానూ తన బావమరిది మాత్రమేనేమో. ఈ నేపధ్యంలో నుంచి చూసుకున్నపుడు బాబుకు విపక్ష నేత పాత్ర కూడా పోయే అవకాశాలు గట్టిగా ఉన్నాయి. దాంతో చంద్రబాబు టీడీపీని బీజేపీలో విలీనం చేసేసి ఏ గవర్నర్ గానో వెళ్ళిపోతే మంచిదన్న మాట కూడా కొందరు అంటున్నారు. బీజేపీలో టీడీపీ విలీనం భావసారూప్యంతో కూడుకున్నదే. టీడీపీ పెట్టినపుడు ఎక్కువమంది బీజేపీ నుంచి వచ్చినవారే ఉన్నారు. మొత్తంగా చూస్తే ఈ ప్రతిపాదన జేసీ బ్రదర్ వూరికే చేయలేదనిపిస్తోంది. చూడాలి మరి ఏమవుతుందో.

Tags:    

Similar News