ఎన్నికల వేళ తెలుగుదేశం కొత్త ప్లాన్..!

మరో మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నందున తెలుగుదేశం పార్టీ కొత్త ఎత్తులు వేస్తోంది. పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా [more]

Update: 2019-01-13 09:30 GMT

మరో మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నందున తెలుగుదేశం పార్టీ కొత్త ఎత్తులు వేస్తోంది. పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా చేరికలను ప్రోత్సహించాలని ఆ పార్టీ నిర్ణయించింది. వివిధ పార్టీల నాయకులను చేర్చుకోవడం ద్వారా పార్టీ మరింత బలపడటంతో పాటు ఎన్నికల వేళ క్యాడర్ లో ఉత్సాహం, ప్రజల్లో టీడీపీ బలపడుతోందనే ఒక సిగ్నల్ ను తీసుకువెళ్లవచ్చని ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు ఆలోచన అని తెలుస్తోంది. ఎన్నికలను ఎదుర్కోవడంలో, ఎన్నికల వ్యూహాలను రచించడంలో సిద్ధహస్తుడైన చంద్రబాబు నాయుడు.. చేరికల ద్వారా పార్టీకి కొత్త ఊపు తీసుకురావాలనే నిర్ణయానికి వచ్చారు. ఈ మేరకు ఆయన పలువురు నేతలకు సిగ్నల్స్ కూడా ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది. త్వరలోనే కొందరు నాయకులు వరుసగా తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా వైఎస్సార్ కాంగ్రెస్ లోకి తప్ప తెలుగుదేశం పార్టీలోకి పెద్దస్థాయి నాయకుల చేరికలు జరగడం లేదు. దీంతో చేరికలు ప్రోత్సహించేందుకు ఇది సరైన సమయంగా టీడీపీ భావిస్తోంది.

విశాఖ సీనియర్ నేతల చేరిక..?

ముఖ్యంగా, గతంలో రాజకీయాల్లో కీలకంగా ఉండి ఇప్పుడు సైలెంట్ అయిపోయిన ఇద్దరుముగ్గురు నాయకులను చేర్చుకునేందుకు తెలుగుదేశం పార్టీ సిద్ధమైంది. ఇందులో భాగంగా విశాఖపట్నం జిల్లాకు చెందిన సీనియర్ నేత కొణతాల రామకృష్ణ, మాజీ ఎంపీ సబ్బం హరి టీడీపీలో చేరుతారనే ప్రచారం బాగా జరుగుతోంది. సబ్బం హరి అవకాశం దొరికినప్పుడల్లా తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు పాలనకు అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. ఇటీవల కొణతాల రామకృష్ణ కూడా అటువంటి వ్యాఖ్యలే చేశారు. అయితే, సబ్బం హరి చేరిక ఖాయమే అయినా కొణతాల మాత్రం ఇంకా మీమాంసలో ఉన్నారు. వైఎస్ కు సన్నిహితుడిగా ముద్రపడిన కొణతాల వైసీపీలో కొంతకాలం పాటు చాలా కీలకంగా పనిచేశారు. జగన్ కూడా ఆయనకు బాగా ప్రాధాన్యత ఇచ్చారు. అయితే, గత ఎన్నికల తర్వాత ఆయన పార్టీని వీడారు. మళ్లీ వైసీపీలో చేరుతారనే ప్రచారం జరిగినా అలా జరగలేదు. అయితే, రాజకీయ వేదిక కోసం ఎదురుచూస్తున్న కొణతాల త్వరలోనే టీడీపీలో చేరే అవకాశం ఉందని సమాచారం.

కాంగ్రెస్ నేతలకు గాలం…

ఇక, వైసీపీలో చురుగ్గా పనిచేసి తాజాగా రాజీనామా చేసిన నటుడు కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు కూడా తెలుగుదేశం పార్టీలో చేరేందుకు మొగ్గు చూపుతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఆయన టీడీపీ నేతలతో టచ్ లో ఉన్నారని, త్వరలోనే ఆయన చేరిక లాంఛనమే కానుంది. ఇక మాజీ మంత్రి అహ్మదుల్లా, మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల కూడా త్వరలోనే తెలుగుదేశం పార్టీలో చేరతారని అంటున్నారు. ఇక, మరికొందరు కాంగ్రెస్ నేతలకు కూడా టీడీపీ గాలం వేస్తుందనే ప్రచారం జరుగుతోంది. అయితే, టీడీపీతో పొత్తు ఉంటే తమకు పొత్తులో సీట్లు దక్కే అవకాశం ఉన్నందున కాంగ్రెస్ నేతలు టీడీపీలో చేరే అంశాన్ని పెండింగ్ లో పెడుతున్నా, ఒకవేళ పొత్తు ఉండదంటే మాత్రం టీడీపీలో చేరి టిక్కెట్లు దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తానికి సంక్రాంతి పండుగ తర్వాత తెలుగుదేశం పార్టీలోకి చేరికలు ప్రారంభం కానున్నాయని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి.

Tags:    

Similar News