ఇక వారికి ఆ యోగం లేన‌ట్లేనా..?

తెలుగుదేశం పార్టీ టిక్కెట్ల కేటాయింపు వ్య‌వ‌హారం కొంద‌రు సీనియ‌ర్ నేత‌ల రాజ‌కీయ జీవితానికి ముగింపు ప‌లుకుతున్న‌ట్లే క‌నిపిస్తోంది. మ‌రికొంద‌రికి మంత్రం మంత్రి అయ్యే యోగ్యాన్ని దూరం చేస్తోంది. [more]

Update: 2019-03-19 08:00 GMT

తెలుగుదేశం పార్టీ టిక్కెట్ల కేటాయింపు వ్య‌వ‌హారం కొంద‌రు సీనియ‌ర్ నేత‌ల రాజ‌కీయ జీవితానికి ముగింపు ప‌లుకుతున్న‌ట్లే క‌నిపిస్తోంది. మ‌రికొంద‌రికి మంత్రం మంత్రి అయ్యే యోగ్యాన్ని దూరం చేస్తోంది. తాము అసెంబ్లీకి పోటీ చేస్తాం మొర్రో అని ప‌లువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు అంటున్న అధినేత మాత్రం ఎంపీగా పోటీ చేయాల్సిందేన‌ని ప‌ట్టుబ‌డుతున్నారు. దీంతో అధినేత మాట కాద‌న‌లేక ఎట్ట‌కేల‌కు ఎంపీలుగా పోటీ చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. దీంతో మ‌ళ్లీ ఎమ్మెల్యేగా గెలిచి పార్టీ అధికారంలోకి వ‌స్తే మ‌రోసారి మంత్రి ప‌ద‌వి ద‌క్కించుకోవాల‌నుకుంటున్న వారి ఆశ‌ల‌పై చంద్ర‌బాబు నీళ్లు చ‌ల్లుతున్నారు.

త‌న‌యుల రాజ‌కీయ జీవితం కోసం…

ఈ క్యాబినెట్ లో మంత్రులుగా ఉన్న ఐదుగురు సీనియ‌ర్ నేత‌లు ఇక వ‌చ్చేసారి పార్టీ అధికారంలోకి వ‌చ్చిన మంత్రి ప‌ద‌వి యోగ్యాన్ని కోల్పోనున్నారు. ఇందులో వార‌సుల‌పై ఉన్న ప్రేమ‌, వారి రాజ‌కీయ జీవితంపై ఆరాటంతో కొంద‌రు వారికి వారే త్యాగానికి సిద్ధ‌ప‌డ్డారు. మంత్రి ప‌రిటాల సునీత మూడుసార్లు గెలిచిన రాప్తాడు నుంచి ఈసారి ఆమె పోటీ చేయ‌డం లేదు. రెండు టిక్కెట్లు ఇచ్చేందుకు పార్టీ అంగీక‌రించ‌క‌పోవ‌డంతో రాప్తాడు నుంచి ఆమె త‌న‌యుడు ప‌రిటాల శ్రీరామ్ ను పోటీకి నిలిపి ఆమె త‌ప్పుకుంటున్నారు. ఇక‌, క‌ర్నూలు జిల్లాలో సీనియ‌ర్ నేత‌, ఉప ముఖ్య‌మంత్రి కేఈ కృష్ణ‌మూర్తి కూడా ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల‌కు దూర‌మైన‌ట్లే క‌నిపిస్తోంది. ఆయ‌న స్థానంలో ప‌త్తికొండ నుంచి కుమారుడు కేఈ శ్యాంబాబును పోటీ చేయిస్తున్నారు. విజ‌య‌న‌గ‌రం జిల్లా చీపురుప‌ల్లి నుంచి మంత్రి కిమిడి మృణాళిని కుమారుడు కిమిడి నాగార్జున పోటీ చేస్తున్నారు. ఆమె కూడా ప్ర‌త్య‌క్ష రాజకీయాల నుంచి రిటైర్ అవుతున్నారు. ఈ ముగ్గురు యువ నేత‌లు ఈసారి గెలిచి పార్టీ అధికారంలోకి వ‌చ్చిన జూనియ‌ర్లు అయినందున వారికి మంత్రి ప‌ద‌వి ఇచ్చే అవ‌కాశం అయితే ఉండ‌దు. దీంతో త‌న‌యుల రాజ‌కీయ జీవితం కోసం ఈ ముగ్గురు మంత్రి ప‌ద‌వి యోగ్యాన్ని త్యాగం చేసిన‌ట్లే చెప్పుకోవాలి.

బ‌ల‌వంతంగా పార్ల‌మెంటు బ‌రిలో

ఇక‌, మ‌రో ఇద్ద‌రు మంత్రుల‌కు మాత్రం అధినేత చంద్ర‌బాబు నాయుడే మంత్రి ప‌ద‌వి యోగ్యాన్ని దూరం చేస్తున్నారు. జ‌మ్మ‌ల‌మ‌డుగు ఫిరాయింపు ఎమ్మెల్యే, మంత్రి ఆదినారాయ‌ణ‌రెడ్డిని ఈసారి ఆయ‌న క‌డ‌ప ఎంపీగా పోటీ చేయిస్తున్నారు. అనేక చ‌ర్చ‌ల త‌ర్వాత ఆదినారాయ‌ణ‌రెడ్డిని ఇందుకోసం బ‌ల‌వంతంగా ఒప్పించారు. ఇక‌, ద‌ర్శి నుంచి మ‌రోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్న మంత్రి శిద్ధా రాఘ‌వ‌రావును బ‌ల‌వంతంగా ఒంగోలు పార్ల‌మెంటుకు పోటీ చేయిస్తున్నారు. ఈ రెండు స్థానాల్లో వైసీపీ బ‌లంగా ఉన్నందుకు, టీడీపీకి బ‌ల‌మైన అభ్య‌ర్థులు లేనందున వీరిని పోటీకి దించుతున్నారు. దీంతొ ఈ ఇద్ద‌రు కూడా వ‌చ్చేసారి టీడీపీ అధికారంలోకి వ‌చ్చినా మంత్రి ప‌ద‌వి అవ‌కాశం మాత్రం దూర‌మైన‌ట్లే. మొత్తానికి ఈసారి మంత్రులుగా ఉన్న ఐదుగురు వ‌చ్చేసారి అధికారంలోకి వ‌చ్చినా క్యాబినెట్ లో మాత్రం క‌నిపించే అవ‌కాశం లేదు.

Tags:    

Similar News