మాస్టర్ స్ట్రోక్ కు తట్టుకుంటారా?

అదేంటో రాజకీయాల్లో ఉన్న వారికి ఎపుడు సొంత ప్రాణం కంటే పదవులే ఎక్కువైపోతాయి. వాటిని పట్టుకుని జీవితం అంతా అందులోనే ఉందనుకుంటారు. అయితే ఎపుడు అవి చప్పున [more]

Update: 2019-10-30 03:30 GMT

అదేంటో రాజకీయాల్లో ఉన్న వారికి ఎపుడు సొంత ప్రాణం కంటే పదవులే ఎక్కువైపోతాయి. వాటిని పట్టుకుని జీవితం అంతా అందులోనే ఉందనుకుంటారు. అయితే ఎపుడు అవి చప్పున జారిపోతాయో ఎవరికీ తెలియదు. ఇక ఏపీలో చూసుకుంటే వింతైన రాజకీయం నడుస్తోంది. జగన్ సీఎం అయ్యాక ఫిరాయింపులు ఉండవంటూ నిండు అసెంబ్లీ సాక్షిగా భారీ ప్రకటన చేసి చంద్రబాబు కుదుట పడేలా చేశారు. అయితే అయిదు నెలల కాలం గడచింది. ఈలోగా జాతీయ, రాష్ట్ర స్థాయిలో రాజకీయం మారిపోయింది. చంద్రబాబు సైతం జగన్ ఏమీ చేయలేడన్న ధీమాతో పూటకో రకంగా విమర్శలు చేస్తూ రెచ్చిపోతున్నారు. దాంతో జగన్ కి సైతం చిర్రెత్తుకొచ్చిందని అంటున్నారు. దానికి వర్తమాన పరిస్థితులు కూడా అనుకూలించడంతో ఇపుడు జగన్ మార్క్ పాలిటిక్స్ ని బయటకు తీస్తున్నారుట.

గేట్లు ఎత్తేస్తారా?

జగన్ అసెంబ్లీలో చెప్పినట్లుగానే గేట్లు కనుక ఎత్తేస్తున్నారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. నేను కనుక గేట్లు ఎత్తెస్తే మీ వెనకలా ఒక్కరు కూడా మిగలరు చంద్రబాబూ అంటూ గట్టి హెచ్చరిక తొలి అసెంబ్లీ సెషన్ లోనే జగన్ చేశారు. ఇపుడు మాత్రం జగన్ గేట్లు ఎత్తేయడానికి రెడీగా ఉన్నారట. తాము ఒక రాజకీయ సిధ్ధాంతం పెట్టుకుని ముందుకు పోతూంటే చంద్రబాబు దాన్ని చేతగానితనంగా తీసుకుంటున్నారని జగన్ భావిస్తున్నారని అంటున్నారు. ఇక వైసీపీ మంత్రులు సైతం చంద్రబాబు తీరు మీద గుస్సా అవుతున్నారుట. అందుకే చంద్రబాబు ను కట్టడి చేయమంటున్నారుట. రాజకీయంగా పరిస్థితులు అనుకూలంగా ఉన్నపుడే చంద్రబాబు మళ్ళీ లేవకుండా టీడీపీకి గట్టి దెబ్బ వేయమన్న వత్తిడి వైసీపీలో పెరిగిందట. దానికి జగన్ సైతం ఇపుడు సరేనని అంటున్నారని సమాచారం.

ఒకరు కాదుగా ….

ఎవరో ఒకరు అడుగు ముందు వేస్తే అనుసరిద్దాం అన్నది టీడీపీలో ఎమ్మెల్యే తమ్ముళ్ల ఆలోచన‌గా ఉంది. ఆ ఒక్కడూ వల్లభనేని వంశీ అవుతాడా అన్నది చూడాలంటున్నారు. ఇక వైసీపీ శిబిరం నుంచి వస్తున్న మాట ఏంటంటే ఒకరు కాదు దాదాపుగా డజన్ మంది వరకూ ఎమ్మెల్యేలు వైసీపీలోకి రావాలని చూస్తున్నారని అంటున్నారు. అదే జరిగితే ఏపీలో చంద్రబాబు విపక్ష హోదా గల్లంతు అవడం ఖాయం. ప్రస్తుతం టీడీపీకి 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మొత్తం అసెంబ్లీలో పది శాతం అంటే 18 మంది ఉంటేనే ప్రధాన ప్రతిపక్ష హోదా లభిస్తుంది. ఆ లెక్కన 12 మంది వరకూ సైకిల్ దిగిపోయి వైసీపీలోకి ఫిరాయిస్తే 11 మంది ఎమ్మెల్యేలతో చంద్రబాబు మామూలు ఎమ్మెల్యే అయిపోతారు. అలాంటి దెబ్బ కొట్టాలన్నదే వైసీపీ మాస్టర్ ప్లాన్ లా ఉంది. ఇక్కడ మరో విషయం కూడా బయటకు వస్తోంది. ఇలా సగం సగం ఎమ్మెల్యేలు వస్తే ఉప ఎన్నికల గండం ఉంటుంది కాబట్టి మూడు వంతుల మంది కనుక టీడీపీ నుంచి వచ్చేలా చేస్తే అపుడు ఏకంగా టీడీఎల్పీ ని వైసీపీలో విలీనం చేసుకునే ప్రతిపాదన కూడా ఉందని అంటున్నారు. మరి ఇదే జరిగితే మాత్రం టీడీపీ పూర్తిగా కుదేల్ అయినట్లే. జగన్ మాస్టర్ స్ట్రోక్ ఏంటో చూడాలి.

Tags:    

Similar News