కాషాయ గూటిలో సైకిల్ జోరు

రాజకీయమంటే అదే మరి. నిన్నటి దోస్తీ నేడుండదు. అలాగే పాత శత్రుత్వం ఈ రోజు కనుమరుగు. సరిగ్గా ఇదే నెల గత ఏడాది చూస్తే బీజేపీని పెద్ద [more]

Update: 2019-08-15 00:30 GMT

రాజకీయమంటే అదే మరి. నిన్నటి దోస్తీ నేడుండదు. అలాగే పాత శత్రుత్వం ఈ రోజు కనుమరుగు. సరిగ్గా ఇదే నెల గత ఏడాది చూస్తే బీజేపీని పెద్ద గొంతు చేసుకుని టీడీపీ తమ్ముళ్ళు తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిపోశారు. దాంతో ఏపీ బీజేపీ నేతలు కూడా చంద్రబాబు మీద అంతెత్తున ఎగిరిపడేవారు. చంద్రబాబు వర్సెస్ బీజేపీ యుద్ధం చూసిన వారు ఈ జన్మలో కలుస్తారా అనుకున్నారు. కలవకపోయినా బీజేపీ చంద్రబాబుని క్షమిస్తుందా అని కూడా ఆలోచించారు. కానీ ఇపుడు కాషాయం నీడన కూర్చుని చంద్రబాబుకు వత్తాసు పలికే నేతలను చూశాక బీజేపీతో బాబు బాయీ బాయీ అనిపించేలా పరిస్థితి ఉంది. టీడీపీలో చంద్రబాబుకు కుడిభుజంగా ఉన్న సుజన చౌదరి బీజేపీ కండువా కప్పేసుకున్నారు. ఆయన చంద్రబాబును పల్లెత్తు మాట అనరని రాజకీయం ఆ మాత్రం తెలిసిన అందరికీ అర్ధమయ్యే విషయమే. అయితే ఆయన చంద్రబాబు టీడీపీ ఆఫీసులో పెట్టే ప్రెస్ మీట్ కాపీలను దగ్గర పెట్టుకున్నట్లుగా అవే మాటలు వల్లించడమే అసలైన విషయం. చంద్రబాబు ఏం కోరుకుంటున్నారో అవే మాటలను బీజేపీ గొంతు నుంచి వినిపిస్తూ సుజన కాషాయ రాజకీయాన్ని రక్తి కట్టిస్తున్నారు.

పోలవరంపై గరం గరం….

నిజానికి పోలవరం విషయంలోనే కేంద్రంలో టీడీపీకి దోస్తీ కట్ అయింది. సాక్షాత్తు ప్రధాని మోడీ పోలవరం చంద్రబాబుకు ఏటీఎం అయిందని గోదారి గట్టునే నిలబడి గర్జించివెళ్లారు. అటువంటి బీజేపీలోకి వెళ్లినా కూడా సుజనా వాయిస్ ఏ మాత్రం మారలేదు. ఫక్తు టీడీపీ నేతలా ఆయన మాటలు ఉన్నాయి. పోలవరం కాంట్రాక్ట్ ని రద్దు చేయడాన్ని గట్టిగా తప్పు పడుతున్నారు సుజనాచౌదరి. నిజంగా ఇది ఆశ్చర్యమే. బీజేపీ శిబిరంలో ఉండి అలా మాట్లాడ‌డం కంటే విడ్డూరం మరోటి లేదు కూడా. పోలవరం నిర్మాణం ఆలస్యం అవుతుందని సుజన సుద్దులు చెబుతున్నారు. కాంట్రాక్టులో అవినీతిని నిరూపించాల‌ని డిమాండ్ చేస్తున్నారు. ఇది బాగానే ఉంది కానీ బీజేపీలో చేరిన ఈ కొత్త పూజారి ఇదే డిమాండ్ చేసిన ప్రధాని మోడీని తప్పుపట్టగలరా. ప్రాజెక్టును ఏటీఎంలా దోచుకున్నార‌ని మోడీ అన్నపుడు దాన్ని రుజువు చేయమని కూడా అడుగుతారా. పోలవరంపై ప్రధాని ఓ విధానంతో ఉంటే అదే పార్టీ వేదిక నుంచి బాబుని సమర్ధించేలా సుజనా మాట్లాడం నిజంగా దారుణమే. ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ కన్నా లక్ష్మీ నారాయణ సమక్షంలోనే ఆయన ఈ కామెంట్స్ చేస్తూంటే బీజేపీ పాత కాపులు నోరెళ్లబెట్టి చోద్యం చిత్తగించడం విశేషం కాక మరేమిటి.

చంద్రబాబుకు మిత్రపక్షంగా….

సుజనా చౌదరి లాంటి వారు బీజేపీలో చేరాక టీడీపీకి అచ్చమైన మిత్రపక్షంగా ఆ పార్టీ మారిపోకుండా మిగిలి ఉంటుందా. చంద్రబాబు నా దైవం. ఆయన్ని ఏమీ అనను అని ఒట్టుపెట్టుకున్న నాడే సుజనా అసలు గుట్టు రట్టు అయింది. ఇక ఏపీలో బీజేపీ ఏం బలపడుతుంది. విన్నర్ కావాలంటే రన్నర్ ప్లేస్ ని ముందు సాధించాలి. రన్నర్ గా టీడీపీ ఉంది. దాన్ని ఏమీ అనను అంటున్న మాజీ టీడీపీ నాయకులను వెంటేసుకుని బీజేపీ ఏపీలో ఏం సాధిస్తుందని. ఇక ఏపీలో జగన్ ఒక్కణ్ణి విమర్శిస్తే బీజేపీని మెచ్చి జనం పట్టం కడతారన్నది ఉత్తమాట. జగన్ ను బలహీనపరిస్తే అది టీడీపీకే మేలు చేస్తుంది. ఆ సంగతి తెలిసి కూడా సుజనా లాంటి వారిని ఆపలేకపోతున్నరంటే బీజేపీలో టీడీపీకి చాలా వరకూ చోటు ఇచ్చేసినట్లే. ఈ తప్పుడు వ్యూహంతో ముందుకు వెళ్తున్న బీజేపీని జనం ఎంతవర‌కూ నమ్ముతారన్నదే అసలైన ప్రశ్న. బీజీపీలో చేరిన సుజనాను ఇంతవరకూ ఒక్క మాట అనని చంద్రబాబు తెలివిని కూడా ఈ సందర్భంగా మెచ్చుకోవాలి.

Tags:    

Similar News