పాత కాంబో రోత అవుతుందా ?

ఏపీలో ఎలాగైనా 2024 ఎన్నికల్లో వైసీపీని దించేయాలని చంద్రబాబుకు కసి ఉంది. ఆయన కంటే పదింతల కసి టీడీపీ అభిమానులకు, వివిధ రంగాల్లో ఉన్న ఆ సామాజికవర్గం [more]

Update: 2021-04-16 13:30 GMT

ఏపీలో ఎలాగైనా 2024 ఎన్నికల్లో వైసీపీని దించేయాలని చంద్రబాబుకు కసి ఉంది. ఆయన కంటే పదింతల కసి టీడీపీ అభిమానులకు, వివిధ రంగాల్లో ఉన్న ఆ సామాజికవర్గం ప్రముఖులకు కూడా ఉంది. వారంతా కూడా తిరిగి టీడీపీని ఎలా నిలబెట్టాలి అన్న దాని మీద అతి పెద్ద పరిశోధనలే చేస్తున్నారు. వారికి జగన్ తో రాజకీయ వైరం కంటే కూడా ఇంకా ఎక్కువ శత్రుత్వమే ఉందనిపిస్తోంది. అదే సమయంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే దక్కే ప్రయోజనాలు, కంఫర్టబిలిటీ వేరు అన్నది కూడా బాగా తెలుసు.

మూడుతో స్పీడ్….

ఇక ఏపీలో మూడు పార్టీల కలయిక మీద జోరుగా చర్చ సాగుతోంది. అవి టీడీపీ, బీజేపీ, జనసేన. ఈ పార్టీలకు పెద్దన్నలా టీడీపీ ఉండాలి. జూనియర్ పార్టనర్స్ గా ఆ రెండూ చేతులు కలపాలి. ఈ మూడు పార్టీలు కలిస్తే గెలుపు మూడ్ వస్తుందని, స్పీడ్ కూడా పెరుగుతుందని టీడీపీని అభిమానించే వారి ఆలోచనగా ఉంది. అయితే ఈ కాంబో ఏమీ కొత్తది కాదు, 2014 నాటిదే. ఇంకా చెప్పాలంటే పాతదే. జనాలు కూడా ఒకసారి మెచ్చి అందలం ఎక్కించిన ఈ కాంబో సీక్వెల్ అంటే ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

అయ్యే పనేనా ….?

ఏపీలో చూసుకుంటే బీజేపీ ఒంటరిగా ఎదగాలని అనుకుంటోంది. ఆ పార్టీ ముందు ఎలిమినేట్ చేయాలనుకుంటోంది టీడీపీని, అంటే 2024 ఎన్నికల నాటికి ప్రధాన ప్రతిపక్ష స్థానానికి, 2029 నాటికి అధికారంలోకి రావాలని బీజేపీ ఆలోచనగా చెబుతున్నారు. ఈ పోరాటానికి తనకు చేదోడుగా జనసేనను ఆ పార్టీ ఎంచుకుంది. అదే సమయంలో టీడీపీని దూరం పెడుతోంది. ఇక జనసేన తీరు చూస్తే బీజేపీ కంటే కూడా టీడీపీ బెస్ట్ అని భావిస్తోంది. టీడీపీ అయితే ముగ్గురూ కలసి ముగ్గులోకి దూకాలని గట్టిగా కోరుకుంటోంది.

అనివార్యమా …?

ఇక బీజేపీ తీరు చూస్తే వద్దు అంటూనే కావాలంటుంది. అది రాజకీయాల్లో ఉండాల్సిన ప్రధమ లక్షణమే. అందువల్ల ఈనాడు టీడీపీని దూరం పెడుతున్నా ఎన్నికలు తరుముకువచ్చే వేళ ఉనికి చాటుకోవడానికైనా ఆ పార్టీతో పొత్తుకు సై అంటుందన్న విశ్లేషణలూ ఉన్నాయి. మరో వైపు టీడీపీకి కావాల్సింది ఇదే. బీజేపీకి తెలుగు రాష్ట్రాల్లో ఎంతలా ఆశలు అణగారిపోతే అంతలా తన దగ్గరకు వస్తుందని, అపుడు బేషరతుగా మిత్రుడిని చేసుకోవచ్చునని ఎదురుచూస్తోంది. మొత్తానికి మూడు పార్టీల కలయిక అన్నది కొత్తా కాదు వింతా కాదు, ఈ మూడూ కలసినా వైసీపీని ఢీ కొట్టి అధికారంలోకి వస్తాయన్న పూర్తి నమ్మకం కూడా ఎవరికీ లేదు ఎందుకంటే 2014 వేరు, 2024 వేరు కాబట్టే.

Tags:    

Similar News