వైసీపీ ఓడిపోతుందా..??

గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హవా వీచిన నెల్లూరు జిల్లాలో ఈసారి ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఈసారి కూడా జిల్లాలో ఎక్కువ స్థానాలు సాధించాలని వైఎస్సార్ [more]

Update: 2019-04-04 01:30 GMT

గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హవా వీచిన నెల్లూరు జిల్లాలో ఈసారి ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఈసారి కూడా జిల్లాలో ఎక్కువ స్థానాలు సాధించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుండగా ఈసారైనా జిల్లాలో సత్తా చాటాలని తెలుగుదేశం పార్టీ తహతహలాడుతోంది. అయితే, ఇప్పటికీ జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలంగా కనిపిస్తున్నా గట్టి పోటీ ఇచ్చే స్థానాల్లో కావాలి నియోజకవర్గం ముందు కనిపిస్తోంది. కావలిలో వైసీపీ, టీడీపీ మధ్య గట్టి పోటీ ఉంది. ఇద్దరు అభ్యర్థులూ గెలుపు కోసం శాయశక్తులా కష్టపడుతున్నారు. ప్రచారంలో ఇద్దరూ దూసుకుపోతున్నారు.

ప్రతాప్ కు దూరమైన పాత నేతలు

గత ఎన్నికల్లో రాంరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బీద మస్తాన్ రావు నుంచి గట్టి పోటీ ఎదుర్కొని 4969 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. వృత్తిరిత్యా వ్యాపారవేత్త అయిన ప్రతాప్ కుమార్ రెడ్డి 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసి ఓడారు. గత ఎన్నికల ముందు వైసీపీలో చేరి విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో కావాలి వైసీపీ టిక్కెట్ కోసం పోటీ తీవ్రంగా నెలకొంది. మాజీ ఎమ్మెల్యేలు కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి, వంటేరు వేణుగోపాల్ రెడ్డి కూడా టిక్కెట్ కోసం ప్రయత్నించారు. చివరకు సిట్టింగ్ గా ఉన్న ప్రతాప్ కుమార్ రెడ్డి వైపే జగన్ మొగ్గు చూపారు. దీంతో విష్ణువర్ధన్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి పార్టీ నుంచి వెళ్లిపోయారు. ఆర్థికంగా బలంగా ఉన్న ప్రతాప్ కుమార్ రెడ్డికి గత ఎన్నికల్లో విజయం కోసం సహకరించిన నేతలే ఇప్పుడు ప్రత్యర్థులుగా మారడంతో ఆయన ఒంటరయ్యారు. విజయం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. పార్టీ బలం తనకు కలిసొస్తుందని ధీమాగా ఉన్నారు.

బలమైన అభ్యర్థిగా విష్ణు

ఇక, తెలుగుదేశం పార్టీలోకి చివరి నిమిషంలో వెళ్లిన కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డికి టిక్కెట్ దక్కింది. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిన మాజీ ఎమ్మెల్యే మస్తాన్ రావును నెల్లూరు పార్లమెంటుకు పంపించారు. పార్టీకి కొత్త కావడంతో విష్ణువర్ధన్ రెడ్డికి టీడీపీ కార్యకర్తలతో పూర్తిగా సయోధ్య కుదరలేదు. బీద మస్తాన్ రావు ఆయనకు పూర్తిగా సహకరిస్తుండటం కలిసివచ్చే అవకాశం ఉంది. బీద ఈ నియోజకవర్గానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ప్రచారం చేస్తున్నారు. విష్ణువర్ధన్ రెడ్డికి స్వంతంగా ఉన్న బలానికి పార్టీ బలం కూడా తోడవడం, ప్రభుత్వ సంక్షేమ పథకాలు కలిసివస్తాయని నమ్మకంగా ఉన్నారు. తనకు వైసీపీ టిక్కెట్ ఇవ్వనందున కచ్చితంగా గెలిచి తాన బలమేంటో వైసీపీకి చూపించాలని ఆయన పట్టుదలతో ఉన్నారు. దీంతో కావలిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఈసారి గెలవడం అంత సులువు కాదనే అంచనాలు ఉన్నాయి.

Tags:    

Similar News