అక్కడ వైసీపీని ఢీకొట్టేందుకు టీడీపీ తంటాలు

వైసీపీ సంస్థాగతంగా బలంగా ఉన్న నెల్లూరు జిల్లాలో చాలా అసెంబ్లీ సెగ్మెంట్లలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. నియోజకవర్గాల పున‌ర్విభజనతో 2009లో ఏర్పడిన నెల్లూరు రూరల్‌ నియోజకవర్గంలో టీడీపీ [more]

Update: 2019-02-07 07:00 GMT

వైసీపీ సంస్థాగతంగా బలంగా ఉన్న నెల్లూరు జిల్లాలో చాలా అసెంబ్లీ సెగ్మెంట్లలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. నియోజకవర్గాల పున‌ర్విభజనతో 2009లో ఏర్పడిన నెల్లూరు రూరల్‌ నియోజకవర్గంలో టీడీపీ ఆది నుంచి గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటూ వస్తోంది. వాస్తవంగా చూస్తే నెల్లూరు కార్పోరేషన్‌లో 26 వార్డులతో పాటు నెల్లూరు రూరల్‌ మండలంతో విస్తరించి ఉన్న నెల్లూరు రూరల్‌ నియోజకవర్గంలో టీడీపీ సంస్థాగతంగా చూస్తే బలంగానే ఉంది. గత ఎన్నికల్లో నెల్లూరు కార్పొరేషన్‌ వైసీపీ గెలుచుకున్నా రూరల్‌ నియోజకవర్గంలో ఉన్న 26 వార్డుల్లో మాత్రం టీడీపీ సత్తా చాటింది. తెలుగుదేశం పార్టీ కార్పొరేషన్‌లో గెలిచిన సీట్లలో మెజారిటీ సీట్లు రూరల్‌ నియోజకవర్గ పరిధిలో ఉన్నవే. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సరైన నాయకుడు లేకపోవడంతో పాటు గత రెండు ఎన్నికల్లోనూ మిత్రపక్షాలకు కేటాయించడం కూడా ఆ పార్టీ ఇక్కడ ఎదగకపోవడానికి మరోక కారణం. 2009లో టీడీపీ ఈ సీటును కమ్యూనిస్టులకు కేటాయించింది. ఇక్కడ నుంచి పోటీ చేసిన దివంగత మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి సులువుగానే విజయం సాధించారు.

ఆదాల పోటీలో ఉంటారా..?

2014 ఎన్నికల్లో రూరల్‌ సీటును టీడీపీ పొత్తుల్లో భాగంగా బీజేపీకి ఇవ్వగా వైసీపీ నుంచి పోటీ చేసిన కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి ఘన విజయం సాధించారు. దీంతో ఈ నియోజకవర్గంలో టీడీపీకి బలమైన నాయకుడు అంటూ లేరు. అయితే గత నాలుగున్నర ఏళ్లలో ఈ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ గా ఉన్న మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌ రెడ్డి నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులను ఏకతాటి మీదకు తీసుకురావడంలో మాత్రం సక్సెస్‌ అయ్యారు. ప్రస్తుతం నెల్లూరు లోక్‌సభ టీడీపీ ఇన్‌ఛార్జ్‌ గా ఉన్న ఆయన నెల్లూరు రూరల్‌కు సైతం ఇన్‌ఛార్జ్‌ గా ఉన్నారు. దీంతో ఆయన ఎక్కడ నుంచి పోటీ చేస్తారన్నది క్లారిటీ లేదు. రూరల్‌ నుంచి పోటీ చేసేందుకు ఆయన ఆసక్తిగా లేరన్న ప్రచారమూ ఉంది. వాస్తవంగా చూస్తే నియోజకవర్గంలో ఇప్పటికీ వైసీపీ బలంగానే ఉంది. గత ఐదేళ్లుగా సిట్టింగ్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి నియోజకవర్గంలో క్రమం తప్పకుండా ప్రజలకు అందుబాటులో ఉంటూ వచ్చారు. ప్రతిపక్షంలో ఉన్నా తన సొంత నిధులు వెచ్చించి అనేక కార్యక్రమాలు చేపట్టారు.

కోటంరెడ్డిని ఢీకొట్టగలరా..?

ఈ క్రమంలోనే 365 రోజుల ప్రజాహిత పాదయాత్ర చేసిన ఆయన మరో సంవత్సరం పాటు గడప గడపకు వైసీపీ అంటూ ఇలా రెండేళ్లుగా నిత్యం ప్రజల్లోనే ఉన్నారు. దీంతో ఇక్కడ చాలా బలంగా ఉన్న శ్రీధర్‌ రెడ్డిని ఢీకొట్టే విషయంలో ఆదాల కాస్త వెనకడుగు వేస్తున్నట్టు ప్రచారం కూడా ఉంది. ప్రస్తుతానికి ఆదాల నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ గా ఉన్నా చంద్రబాబు ఆయన్ను ఎంపీగా పోటీ చేయిస్తారా ? లేదా నెల్లూరు రూరల్‌ నుంచి దింపుతారా ? లేదా ఆదాల కోవూరులో పోటీ చేస్తారా అన్నది క్లారిటీ లేదు. ఇదే క్రమంలో టీడీపీ నుంచి నగర మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌తో పాటు మరో సీనియర్‌ నేత పెళ్లకూరు శ్రీనివాసులరెడ్డి పేర్లు సైతం ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అలాగే టీడీపీ నుంచి ప్రముఖ వ్యాపార సంఘం నాయకుడు నన్నపురెడ్డి పెంచలరెడ్డి పేరు కూడా అనూహ్యంగా తెరమీదకు వచ్చింది. వీరితో పాటు ఆనం సోదరుల్లో ఒకరైన ఆనం జైకుమార్‌ రెడ్డి పేరును కూడా టీడీపీ అధిష్ఠానం పరిశీలిస్తున్నట్టు తెలిసింది.

బలమైన అభ్యర్థిని దించేందుకు…

వైసీపీ నుంచి కోటంరెడ్డి బలంగా ఉండడంతో ఆయన్ను ఢీ కొట్టేందుకు సామాజికంగానూ, ఆర్థికంగానూ బలమైన అభ్యర్థిని రంగంలోకి దించి ఈసారి ఎలాగైనా నెల్లూరు రూరల్‌ సీటుపై టీడీపీ జెండా ఎగరవెయ్యాలని అధిష్ఠానం పట్టుదలతో ఉంది. పార్టీ సంస్థాగతంగా బలంగా ఉన్నా అభ్యర్థి ఎవరో తేలకపోవడంతో టీడీపీ కేడర్‌లో కూడా కొంత గందరగోళం నెలకొంది. అదే టైమ్‌లో నెల్లూరు నగరంలో సగ భాగం కలిసి ఉన్న ఈ సీటుపై జనసేన సైతం కన్నేసింది. బలమైన అభ్యర్థిని దించడం ద్వారా ఇక్కడ లాభపడాలని ఆ పార్టీ ప్లాన్‌. అయితే జనసేన చీల్చే ఓట్లు ప్రధాన పార్టీల్లో ఎవరి కొంప ముంచుతాయన్నది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్‌. ఏదేమైన నెల్లూరు రూరల్‌ నియోజకవర్గంలో వైసీపీని ఢీకొట్టి గెలిచేందుకు టీడీపీ చావో రేవో వరకు రెడీ అవుతోంది.

Tags:    

Similar News