తెలుగోడు తెలివైనోడు...ఓటు ఎటు వైపు అంటే...?

Update: 2018-04-24 16:30 GMT

కర్ణాటక ఎన్నికల్లో తెలుగు ప్రజలు కీలకం కాబోతున్నారు. దాదాపు 35 నియోజకవర్గాల్లో విజయావకాశాలను ప్రభావితం చేసే శక్తి ఉండటంతో అన్ని పార్టీలూ వీరి చుట్టూ ప్రదిక్షిణలు చేస్తున్నాయి. సుమారు 85 లక్షల మంది తెలుగు ఓటర్లు ఉన్నట్లు అంచనా. దశాబ్దాల క్రితం విద్య, ఉద్యోగ, వ్యాపర, వ్యవసాయం కోసం వెళ్లిన తెలుగు ప్రజలు అక్కడ పాతుకుపోయారు. స్థానికంగా బలీయ శక్తిగా రూపొందారు. బెంగళూరు నగరంతో పాటు సరిహద్దు జిల్లాల్లో వీరి ప్రభావం ఎక్కువ. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కర్ణాటక సరిహద్దును పంచుకుంటున్నాయి. దీంతో రెండు రాష్ట్రాల ప్రజలు వలస వెళ్లారు. ఆంధ్ర నుంచి ఎక్కువ మంది రైతులు వ్యవసాయం కోసం వెళ్లగా, తెలంగాణ నుంచి పలువురు ఉపాధి కోసం తరలి వెళ్లారు.

కీలకభూమిక పోషిస్తున్న.....

బీదర్, బెంగళూరు, రాయచూరు, కోలార్, బళ్లారి, కొప్పళ, చిత్ర దుర్గ, హబ్బళి, ధార్వాడ, గంగావతి, సింధనూరు, తుమకూరు, శివమొగ్గ, దావణగెరె, బెంగళూరు, యాదగిరి, కలబురగి ప్రాంతాల్లో తెలుగు వాళ్లు విస్తరించి ఉన్నారు. వివిధ రంగాల్లో స్థిరపడి ఉన్నారు. సామాజికంగా కూడా శక్తిమంతులు. తుంగభద్ర జలాశయం నిర్మాణ సమయంలోనే కోస్తాంధ్ర నుంచి పలువురు వ్యవసాయం కోసం వచ్చారు. ఆ తర్వాత నారాయణపుర, ఆలమట్టి ఆనకట్టల నిర్మాణంతో వీరి రాక మరింత పెరిగింది. కొంత మంది భూములు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తుండగా, మరికొందరు సొంతంగా భూములు కొనుగోలుచేసి అక్కడే స్థిరపడిపోయారు. రాయచూరు, కొప్పళ జిల్లాల్లో తెలుగువారి క్యాంపులు అధికం. తుంగభద్ర ఎడమ కాల్వ పరిధిలోని గంగావతిలో 10 క్యాంపులు, కనకగిరిలో 20, సింధనూరులో 90 క్యాంపులు ఉన్నాయి. కర్ణాటకలో తెలుగువారు నివసించే ప్రాంతాలను క్యాంపులని వ్యవహరిస్తుంటారు. ఇక బళ్లారి, రాయచూరు ప్రాంతాల్లో తెలుగువారి ప్రాధాన్యం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఈ రెండు ప్రాంతాల్లో ఏపీకి చెందిన గాలి జనార్థన్ రెడ్డి కుటుంబ ప్రభావం గణనీయంగా ఉంది. అభ్యర్థుల ఎంపిక, వారికి అవసరమైన అంగబలం, అర్థబలం సమకూర్చడంలో వీరిది కీలకపాత్ర. గాలి జనార్థన్ రెడ్డి, ఆయన సోదరులు కరుణాకర్ రెడ్డి, సోమశేఖర్ రెడ్ి ఎంతటి శక్తిమంతులో తెలిసిందే. 2008-2013 మద్య కాలంలో బీజేపీ ప్రభుత్వంలో వారికి గల ప్రాధాన్యం అందరికీ తెలిసిన విషయమే. కీలకమైన రెవెన్యూ, పర్యాటక శాఖ మంత్రి పదవులను ఆ కుటుంబం చేజిక్కించుకుంది. తాజా ఎన్నికల్లో వారి ప్రాధాన్యం తక్కువేమీ కాదు. వివిధ కేసులను ఎదుర్కొంటున్న గాలి జనార్థన్ రెడ్డి మినహా ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితులుకు టిక్కెట్ల పంపిణీలో ప్రాధాన్యం లభించింది. తెలుగు వారైన కట్టా సుబ్రమణ్య నాయుడు సైతం బీజేపీ రాజకీయాల్లో కీలకమైన వ్యక్తి. ఈయన ఆంధ్రప్రదేశ్ కు చెందిన తెలుగుదేశం నాయకుడు, మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమ నాయుడి వియ్యంకుడు. బెంగళూరు నగరం లోని హెబ్బళ సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన సుబ్రమణ్యనాయుడు మళ్లీ అదే నియోజకవర్గం నుంచి పోటీకి దిగారు. బీజేపీ మంత్రి వర్గంలో ఆయన మంత్రిగా పనిచేశారు.

తెలుగు వారికి కాంగ్రెస్.....

కాంగ్రెస్ పార్టీలో కూడా తెలుగువారు చక్రం తిప్పుతున్నారు. ప్రస్తుతం రాష్ట్ర హోంమంత్రి రామలింగారెడ్డి తెలుగువారే. ముఖ్యమంత్రి తర్వాత అత్యం కీలకమైనది హోంశాఖ. ఆయనకూతురు సౌమ్యారెడ్డి బెంగళూరు నగరంలోని జయా నగర్ నియోజకవర్గం నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. నగరంలోని బీటీఎం లే అవుట్ నియోజకవర్గం నుంచి రామలింగారెడ్డి బరిలో ఉన్నారు. ఎంఆర్ సీతారామ్ మల్లేశ్వరం నుంచి, డాక్టర్ సుధాకర్ రెడ్డి చిక్ బళ్లాపుర నుంచి, వాణి కృష్ణారెడ్డి చింతమాశి నుంచి, సుబ్బారెడ్డి బాగేపల్లి నుంచి, గురప్పనాయుడు పద్మనాభ నగర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థులుగా బరిలో ఉన్నారు. వీరు కాక గౌరీబిదనూరు నుంచి శివశంకరరెడ్డి, ముళబాగిలు నుంచి మంజునాధ, బొమ్మనహళ్లి నంుచి రాజగోపాలరెడ్డి, చిక్కపేట నుంచి దేవరాజ్, కేజీఎఫ్ నుంచి రూప శశిధర్, రాజరాజేశ్వరి నగర్ నుంచి మునిరత్నం, పులకేసీ నగర్ నుంచి అఖండ శ్రీనివాసమూర్తి,శ్రీనివాస పుర నుంచి కేఆర్ రమేష్ కుమార్ లను కాంగ్రెస్ పార్టీ పోటీకి నిలబెట్టింది. తెలుగు ప్రజలకు కాంగ్రెస్ ఇస్తున్న ప్రాధాన్యానికి ఇదే నిదర్శనం. 28 నియోజకవర్గాలున్న బెంగుళూరు నగరంలో కూడా తెలుగువారి ప్రభావం ఎక్కువే. ఇక్కడ నుంచి 10 నియోజకవర్గాల్లో వారి ప్రభావాన్ని విస్మరించలేం. ముఖ్యంగా హెబ్బళ, కె.ఆర్.పురం, యలహంక, బొమ్మనహళ్లి, బీటీఎం లే అవుట్, జయ నగర, మహదేవపురం తదితర స్థానాల్లో వీరి ప్రభావం ఎక్కువ.

తెలుగు నేతలను రంగంలోకి దించేందుకు.....

తెలుగు ప్రజలు రాష్ట్రంలో ఒకే పార్టీకి ఓటేసిన దాఖలాలు లేవు. బీజేపీని ఓడించాలని తెలుగుదేశం పిలుపివ్వగా, జనతాదళ్ (ఎస్) ను గెలిపించాలని టీఆర్ఎస్ విజ్ఞప్తి చేసింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా బెంగళూరు వెళ్లి ఆ పార్టీ అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడ ను కలిశారు. ప్రస్తుత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు 2008లో బీజేపీ తరుపున ప్రచారం చేసి తెలుగువారు కమలం పార్టీకి మద్దతు ఇవ్వాలనికోరారు. కర్ణాటక నుంచి మూడు సార్లు రాజ్యసభకు ఎన్నికైన ఆయనకు రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత పరిచయాలున్నాయి. ముఖ్యంగా కోస్తాంధ్ర నుంచి వలస వెళ్లిన ప్రజలను ప్రభావితం చేయగల శక్తి ఆయనకు ఉంది. తెలుగు నాయకుల చేత ప్రచారంచేయించేందుకు కన్నడ పార్టీలుకసరత్తు చేస్తున్నాయి. జనసేన అధిపతి పవన్ కల్యాణ్ చేత ప్రచారం చేయించాలని జేడీఎస్ ప్రయత్నాలుచేస్తుంది. మెగాస్టార్ చిరంజీవిని రంగంలోకి దించాలని కాంగ్రెస్ కసరత్తులు చేస్తోంది. తెలుగుదేశం నాయకులు ప్రత్యక్షంగా రంగంలోకి దిగనప్పటికీ, బీజేపీని ఓడించేందుకు తెరవెనక ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది. కోస్తాంధ్ర నుంచి వలస వెళ్లిన ప్రజలపై ఆ పార్టీ ప్రభావం ఎక్కువే. కేంద్ర ప్రభుత్వం ఏపీకిప్రత్యేక హోదా ఇవ్వనందుకు తెలుగుదేశం పార్టీ తీవ్ర అసంతృప్తితో ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో తెలుగువారు గంపగుత్తగా ఒకే పార్టీకి ఓట్లేస్తారన్న గ్యారంటీ ఏమీ లేదు. అక్కడి పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటారు తప్ప తెలుగునాయకుల పిలుపులకు స్పందిస్తారన్నది వాస్తవం కాదని రాజకీయ విశ్లేషకుల అంచనా.

 

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News