పవన్ పక్కా క్లారిటీగా చెప్పేశారే…!!

పవన్ కల్యాణ్ విషయంలో పెద్ద ఫిర్యాదు ఉంది. అదేంటంటే ఆయనది నిలకడలేని రాజకీయమని. పైగా పార్ట్ టైం పాలిటిక్స్ అని కూడా పవన్ కల్యాణ్ కి పేరు [more]

Update: 2019-07-07 13:30 GMT

పవన్ కల్యాణ్ విషయంలో పెద్ద ఫిర్యాదు ఉంది. అదేంటంటే ఆయనది నిలకడలేని రాజకీయమని. పైగా పార్ట్ టైం పాలిటిక్స్ అని కూడా పవన్ కల్యాణ్ కి పేరు పెట్టేశారు. అయితే పవన్ చేసిందే అలాంటి రాజకీయం కాబట్టి ఏం అనడానికి కూడా లేకుండా పోయింది. 2014లో జనసేన పార్టీని స్థాపించిన పవన్ కల్యాణ్ ఆ తరువాత అడపా తడపా కనిపిస్తూ ఓ వైపు సినిమాలు చేసుకున్నారు. ఇక చివరాఖర్లో రాజకీయ తెర మీద మెరిసి ఎన్నికల్లో పోటీ పడ్డారు. ఫలితం మాత్రం చేదు అనుభవాన్ని మిగిల్చింది. దాంతో పవన్ సార్ కి తత్వం బోధపడింది రాజకీయాన్ని కూడా షూటింగులా చేస్తే జనం ఒప్పరని. ఇపుడు పవన్ రెండు పడవల మీద కాలు పెట్టాలా లేదా తేల్చుకోవాల్సిన సమయం వచ్చింది. పవన్ సైతం ఓడిపోయిన తరువాత తన జీవితం రాజకీయాలకే అంకితం అని చెప్పుకొచ్చారు. అయితే ఆ మాటను అపుడు ఎవరూ నమ్మలేదు కానీ ఇపుడు ఏకంగా విదేశీ గడ్డ మీద మరింత బలమైన గొంతుతో చెప్పేసరికి నమ్మాలనిపిస్తోంది.

ముఖానికి రంగు వేసుకునేది లేదిక….

ఈ జీవితంలో ముఖానికి రంగు వేసుకునేదేలేదు. ఇది పవన్ కల్యాణ‌్ లేటెస్ట్ స్టేట్మెంట్. అమెరికా గడ్డ మీద తానా సభల్లో పవన్ చెప్పిన నిఖార్సైన మాట ఇది. ఇకపై పూర్తి సమయం ప్రజా జీవితానికే ఖర్చు చేస్తానని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. అక్కడ అభిమానులు అడిగిన దానికి పవన్ ఇలా విడమరచి చెప్పారంటే ఆయన గట్టి సంకల్పంతోనే ఇలా అన్నారనుకోవాలి. ఇక పవన్ సైతం సినిమాలు చేస్తే మళ్ళీ జనాల్లో తప్పుడు అభిప్రాయం వెళ్తుందని పవన్ భావిస్తున్నారు. సీరియస్ పొలిటీషియన్ గా ఫోకస్ అవడం కష్టమని కూడా అంచనా వేసుకునే పవన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా కనిపిస్తోంది.

ఆశావహ వాతావరణం….

ఇక పవన్ ఘోరంగా ఓడిపోయినా రాజకీయాల్లో నిలబడాలనుకోవడానికి కారణం ఏపీలో ఉన్న పరిస్థితులే. టీడీపీ రేసులో కాస్తా వెనక్కు పోవడంతో జనసేనకు అవకాశాలు మెరుగ్గా కనిపిస్తున్నాయి. బలమైన సామాజిక వర్గం దన్ను, సినీ గ్లామర్, యువత మద్దతు ఇలా అన్నీ అనుకూలతలు ఉండబట్టే పవన్ కల్యాణ్ మరో చాన్స్ చూడడానికి రెడీ అవుతున్నారు. పైగా బాబుని, జగన్ని చూసిన ప్రజలకు తానే ఇక ఆల్టర్నేట్ అవుతానని కూడా పవన్ కల్యాణ‌్ కి బలంగా నమ్మకం ఉన్నట్లుంది. దానికి తోడు జమిలి ఎన్నికల నేపధ్యంలో మూడేళ్లకే మరో మారు సమరానికి సిధ్ధం కావాలంటే ఇప్పటి నుంచే జనాల్లో ఉంటేనే పోటీ పడగలమని పవన్ భావిస్తున్నట్లుగా ఉంది. మొత్తం మీద చూసుకుంటే పవన్ ముఖానికి రంగు వేసుకోరుట. ఆడేది పాడేది అంతా రాజకీయ తెర మీదేనట. ఇప్పటికైతే ఇదే పక్కా.

Tags:    

Similar News