డబ్బుల లెక్కలేనా..?

అన్నీ డబ్బు లెక్కలే. ఏ రాష్ట్రాలకు ఏమిచ్చారన్న లెక్క తెలివిగా దాచేశారు. అసలు దేశానికి ఏం చేశారన్నదీ అంతుచిక్కని అర్థశాస్త్రంలో గుదిగుచ్చేశారు. ప్రపంచంలో పెద్ద ఆర్థిక వ్యవస్థగా [more]

Update: 2019-07-06 16:30 GMT

అన్నీ డబ్బు లెక్కలే. ఏ రాష్ట్రాలకు ఏమిచ్చారన్న లెక్క తెలివిగా దాచేశారు. అసలు దేశానికి ఏం చేశారన్నదీ అంతుచిక్కని అర్థశాస్త్రంలో గుదిగుచ్చేశారు. ప్రపంచంలో పెద్ద ఆర్థిక వ్యవస్థగా ముద్ర వేయించుకోవాలన్న తపన తప్ప పేదోడి కడుపు నిండుతుందా? లేదా? అన్న మానవత మరుగైపోయింది. అల్లో లక్ష్మణా అంటున్న నిరుద్యోగికి భరోసా కరవైంది. అన్నదాతకు అభయం కనిపించలేదు. స్థూలంగా బడ్జెట్ పై వినిపిస్తున్న నిట్టూర్పులివి. ఐతిహాసిక్ కదమ్…చారిత్రకంగా ఇదో ముందడుగు అంటూ ప్రధాని నరేంద్రమోడీ అభివర్ణించిన బడ్జెట్ పద్దు లో ఆర్థిక శాస్త్రానికే అగ్రతాంబూలమిచ్చారు. తాజాగా అఖండభారత్ ఆశీర్వదించి హారతులు పట్టిన ప్రభుత్వం కావడంతో రాజకీయ అనివార్యతలు పెద్దగా లేవు. స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే వెసులుబాటు లభించింది. రానున్న అయిదేళ్ల కాలానికి రోడ్ మ్యాప్ గా చెప్పుకునే ఈ బడ్జెట్ లో భవిష్యత్ లక్ష్యాలపై భారతీయ జనతా పార్టీ చాలా స్థిరంగానే ఉన్నట్లు అర్థమవుతుంది. ముఖ్యంగా 2025 నాటికి ప్రపంచంలో అమెరికా, చైనాల తర్వాత అతిపెద్ద ఆర్థిక శక్తిగా నిలవాలనే తాపత్రయం అడుగడుగునా కనిపించింది. ప్రస్తుతం ప్రపంచంలో ఆరో అతిపెద్ద ఆర్థిక శక్తిగా నిలుస్తున్న భారత్ మరింతగా విజృంభించాలనే తపన ఆర్థిక మంత్రి ప్రసంగంలోనూ, ప్రధాని ప్రశంసలోనూ కొట్టొచ్చినట్లు కనిపించింది. అందులో ప్రజలు మెచ్చే హృదయానికి హత్తుకునే హార్దిక అంశాలేమున్నాయనే విషయం చర్చనీయమవుతోంది. మిత్రపక్షాల ఒత్తిడులు, ఎన్నికల రాజకీయాలు, ప్రాంతీయ డిమాండ్లకు అతీతంగా సంపూర్ణ బాధ్యత, అధికారాలతో స్వేచ్ఛగా తాము అనుకున్నది చేసే వీలు ప్రభుత్వానికి కలిగింది. ఈ బడ్జెట్ భవిష్యత్ విషయంలో బాగానే ఆలోచించింది. అయితే వర్తమానంపై మాత్రం ఉదాసీనత వహించింది.

అంతరాల సరిహద్దులు…

భారత దేశాన్ని 2025 నాటికి 350 లక్షల కోట్ల రూపాయల జాతీయోత్పత్తితో అభివృద్ధి చెందిన దేశంగా చూడాలనేది ప్రస్తుత భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ యోచన. ఈ లక్ష్యం దిశలో నడపటమే కార్యాచరణగా వార్షిక పద్దును వండివార్చారు. అయితే ఆరుశాతానికి పైగా ఉరుముతున్న నిరుద్యోగం, 65 కోట్ల మంది ప్రజలు ఆధారపడిన వ్యవసాయరంగంలో సంక్షోభం, పారిశ్రామిక రంగంలో మందగమనం, బ్యాంకింగ్ రంగంలో అనిశ్చితి వంటి అంశాలకు బడ్జెట్ లో పూర్తి సమాధానాలు ఇవ్వలేకపోయిందనే విమర్శలు వినవస్తున్నాయి. స్టాండ్ అప్ ఇండియా, స్టార్ట్ అప్ ఇండియా, మేకిన్ ఇండియా, కౌశల్ యోజన, ముద్ర రుణాల వంటి పథకాలు ఆశించిన స్థాయిలో ఫలితాలు సాధించలేకపోయాయి. అందుకే ఉత్పత్తి రంగం ఉసూరుమనిపిస్తోంది. ఉపాధి వట్టిపోయింది. కొనుగోలు శక్తి సన్నగిల్లింది. డిమాండ్ లోపించింది. అందువల్లనే లెక్కల్లో భారత్ దాదాపు 190 లక్షల కోట్ల రూపాయల పైచిలుకు స్థూల జాతీయోత్పత్తి కలిగిన దేశంగా కనిపిస్తున్నప్పటికీ ప్రజల్లో సంతృప్తస్థాయి కనిపించడం లేదు. ఆర్థిక వ్యవస్థలో అసమానతలు ఎక్కువగా ఉండటం ఇందుకొక కారణం. 18శాతం ధనికులు 80 శాతం సంపదపై అధికారాన్ని కలిగి ఉండటం, 20 శాతం సంపదపైనే 82 శాతం ఆధారపడి ఉండటమనేది ఆర్థిక అంతరాలను చాటి చెప్పే ఉదంతమే. 60 శాతం ప్రజలకు ఉపాధి నిస్తున్న వ్యవసాయరంగం వాటా ఆర్థిక వ్యవస్థలో 12 శాతమే. ఆ మాత్రం ఆదాయంతోనే పేదరికంలోనే వారు బ్రతుకునీడ్చాల్సి ఉంటుందన్నమాట.

వాతల వయ్యారం…

అభివృద్ధి చెందిన అమెరికా, చైనా, ఫ్రాన్స్, బ్రిటన్, జర్మనీ, జపాన్ లతో లతో భారత ఆర్థిక వ్యవస్థను పోల్చుకోవడం బాగానే ఉంటుంది. కానీ భారత్ లోని ఆర్థిక వ్యత్యాసాల సగటు ఆయాదేశాల్లో కనిపించదు. ఫలితంగా ప్రపంచంలో ఎంతగా ఎదిగినప్పటికీ భారత ప్రజల జీవనప్రమాణాలు మెరుగ్గా కనిపించవు. సామాజిక సూచికల్లో వెనకబాటు తనం కొట్టొస్తుంది. ఎంత ఎత్తుకు ఎదిగితే ఏమిటి ప్రయోజనం ప్రజల్లో దాదాపు సగం మంది పేదరికంలో మగ్గుతుంటే అన్న ప్రశ్న తలెత్తుతుంది. దీనికి సొల్యూషన్ వెదికే ప్రయత్నం జరుగుతుందేమోననే ఆశ మధ్యతరగతి వర్గాల్లో నరేంద్రమోడీ రేకెత్తించగలిగారు. కానీ ఆ ఆశలు నెరవేర్చే దిశలోనే ప్రస్థానం సాగుతుందా? అంటే కాలమే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. పొదుపు, పెట్టుబడులు, ఎగుమతులు కలగలిస్తే పారిశ్రామికోత్పత్తి, ఉపాధికల్పనకు మార్గాలు ఏర్పడతాయి. రుణాలు మొదలు గిట్టుబాటు వరకూ సమకూరితే వ్యవసాయం తో అరవైశాతం ప్రజలు ఆనందమయజీవనం గడపగలుగుతారు. 12శాతం మేరకే పరిమితమైన ఆర్థిక రంగంలో వ్యవసాయ భాగస్వామ్యాన్ని కనీసం 30 శాతం మేరకైనా పెంచుకోగలిగితేనే మెజార్టీ ప్రజలకు మెరుగైన జీవితం ఏర్పడుతుంది. బడ్జెట్ పద్దులో ఆరకమైన సూచనలు ప్రస్ఫుటం కాకపోవడం ప్రధాన లోపమే.

మెరుపులూ మెరిశాయ్…

ప్రజల ఆశకు, ప్రభుత్వ ఆచరణకు మధ్య అంతరం నిరంతరం ఉంటుండేదే. అయితే ఈ బడ్జెట్ లో కొన్ని చారిత్రక అడుగులు పడిన మాటను మాత్రం విస్మరించలేం. సామాజిక భద్రత అనేది భారత దేశంలో కరవైంది. తమ జీవనకాలంలో దేశప్రగతికి ఎంతోకొంత తోడ్పాటునందించి వయసుడిగిన తర్వాత దయనీయమైన జీవితం గడుపుతున్న వారు కోట్ల సంఖ్యలో కనిపిస్తారు. ప్రభుత్వోద్యోగులు, సంఘటితరంగంలోని ఉద్యోగులు మినహాయిస్తే మిగిలిన వారికి వ్రుద్ధాప్యం అన్నది ఒక శాపంగా పరిణమిస్తోంది. దీనికి పరిష్కారమా? అన్నట్లుగా ముందుగా వ్యాపార వర్గాల నుంచి మొదలు పెట్టినప్పటికీ మూడు కోట్ల మందికి వ్రుద్దాప్య పింఛన్లు ఇవ్వడమనేది పౌరుల జీవితంలో విశ్వాసాన్ని పాదుకొలిపే చర్యగానే చెప్పాలి. 2022 నాటికి అందరికీ ఇల్లు ఉండాలనే లక్ష్యంతో తీసుకుంటున్న చర్యలూ మెరుగైనవే. అదే విధంగా మౌలిక వసతుల రంగంలో గ్రామసడక్ యోజన, రైల్వే, రవాణా రంగాల్లో పెట్టుబడులు పెంచడం వంటివి భవిష్యత్తులో ఆర్థిక వ్యవస్థ వృద్ధికి, సేవారంగానికి ఉపకరిస్తాయి. స్వచ్ఛ భారత్ కింద తీసుకుంటున్న చర్యలూ సత్ఫలితాలను ఇస్తున్నాయి. అయితే హామీలు గుప్పించడం కాకుండా వాస్తవికంగా ఉండాలనే ఉద్దేశంతో నేల విడిచి సాము చేయకుండా బడ్జెట్ ను రూపొందించామంటున్నారు కమలనాథులు.మధ్యతరగతి ఆశలకు వారధి కట్టకపోవడం మాత్రం కచ్చితంగా చిన్నబుచ్చే అంశమే.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News