జగన్ ను కంట్రోల్ చేయడానికేనా?

మీడియా అంటే జనం పక్షం వహించాలి. మంచి చెడు స్పష్టంగా చెప్పాలి. మీడియా అంటే అర్ధమే అది. వారధిగా ఉండాల్సిన వారు వన్ సైడైడ్ గా మార‌డంతోనే [more]

Update: 2019-10-08 05:00 GMT

మీడియా అంటే జనం పక్షం వహించాలి. మంచి చెడు స్పష్టంగా చెప్పాలి. మీడియా అంటే అర్ధమే అది. వారధిగా ఉండాల్సిన వారు వన్ సైడైడ్ గా మార‌డంతోనే ఆ నమ్మకం క్రమంగా తగ్గిపోతోంది. ఇపుడు రాజకీయ పార్టీల అధినేతలతో మీడియా పెద్దలు ఏకంగా మీటింగులు, ఏకాంత చర్చలు జరుపుతూ మరింతగా కలసిపోతున్న నేపధ్యంలో మీడియా విలువలు వట్టి కబుర్లుగా మారుతున్న పరిస్థితి ఉంది. ఏపీలో చూసుకుంటే తెలుగు మీడియాలో ప్రధాన‌మైన సెక్షన్ ఏ పార్టీకి అనుకూలమో సామాన్య జనానికి సైతం ఇట్టే తెలిసిపోతోందంటే మీడియా పెద్దరికం ఎంతటి నగుబాటు అయిందో అర్ధమవుతూనే ఉంది. ఇవన్నీ పక్కన పెడితే ఇపుడు ఓ రాజకీయ పార్టీకి మద్దతుగా హస్తిన రాయబారాలు, బేరాలు చేయగలిసే స్థితికి మీడియా ఎదిగిందా, దిగజారిందా అన్న సందేహాలు వస్తున్నాయి.

గతంలో చూడని సీన్లు….

మీడియా గతంలో ఘనంగా ఉన్న రోజుల్లో రాజకీయ నాయకులు కలవడానికి వచ్చినా కూడా అవకాశం ఇవ్వని సందర్బాలు తెలుగు నేల చూసింది. ఇపుడు రాసుకుపూసుకుతిరగడమే కాదు, ఏకంగా రాజకీయపు వాకిట్లలో తచ్చాడుతూ వారికి అనుకూల రాగాలు తీస్తున్న వైనాలు కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తున్నాయి. ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు చెందిన ఓ మీడియా పెద్దాయన నేరుగా ఢిల్లీకి వెళ్ళి ప్రముఖ రాజకీయ అధినేతను కలవడమే కాదు, ఆయనతో తాను గంటన్నర సేపు పైగా మాట్లాడానని సొంత మీడియాలో రాయించుకున్నారు. ఆయన తెలుగు రాజకీయాలపైనా కూడా ఈ భేటీలో చర్చించినట్లుగా కూడా చెప్పుకున్నారు. మరి ఇవన్నీ చూసినపుడు మీడియా రాజకీయ రాయబారి పాత్రతో సరిపెడుతోందా ఇంకా ముందుకు వెళ్తోందా అన్న డౌట్లు కూడా వస్తున్నాయి.

జగన్ ని నెత్తిన రుద్దారట…

ఇక ఏపీలో మీడియా మోతుబరిగా పేరుమోసిన మరో పెద్దాయన కేంద్ర మంత్రి ఒకరితో మాట్లాడుతూ జగన్ ని మా నెత్తిన రుద్దారంటూ అక్కసు వెళ్లగక్కారని కూడా వార్తలు వచ్చాయి. అంటే ప్రజాస్వామ్యం గురించి నీతులు చెప్పే మీడియాలో ఉంటూ ఒకరు నెత్తిన రుద్దితే రాజ్యాలు మారిపోయేటంతగా బలహీనంగా మన డెమోక్రసీ ఉందని ఆ మీడియా మోతుబరి భావనా అన్న విమర్శలు కూడా వచ్చాయి. అంతే కాదు, అలా గతంలో ప్రజాస్వామ్యం పీక నొక్కి తమకు కావాల్సిన వారిని పీఠాలపైన ప్రతిష్టించుకున్న అనుభవాలు ఉండడం చేతనేనా ఈ రకమైన ఆలోచనలు వస్తున్నాయని కూడా కామెంట్స్ పడ్డాయి.

వారికి లేని దురద మీడియాకి…..

ఇవన్నీ ఇలా ఉంటే ఏపీలో ఓ పార్టీ గెలిచింది. మరో పార్టీ ఓడింది. ఈ రెండూ పనులు ప్రజలే చేశారని ప్రజాస్వామ్యప్రియులు అనుకుంటున్నారు. వారి కంటే పెద్ద శక్తులు ఉన్నాయా. అవేనా రాజకీయాలను శాసిస్తున్నాయా. మీడియాలో సుద్దులు చెప్పేవారు వీటినే నమ్ముతూ ప్రజలకు మాత్రం నీతులు చెబుతున్నారా అన్న డౌట్లు కూడా ఈ పొకడలు చూస్తుంటే ఇపుడు కలుగుతున్నాయి. ఇక ఓడిన పార్టీ తన ఏడుపు తాను ఏడవకుండా అనుకూల మీడియా పెద్దలు వెక్కి వెక్కి ఏడవడమే ఇక్కడ అసలైన విశేషం. మరి ఈ ఘటనలు చాలవా మీడియా, రాజకీయాల మధ్య అక్రమ‌ సంబంధాలు ఎంతలా విషపు కౌగిలిలో పెనవేసుకుపోయాయో చెప్పడానికి అంటున్నారు ప్రజాస్వామ్యప్రియులు.

Tags:    

Similar News