రేపే 2019 ఎన్నికల టీజర్ విడుదల

Update: 2018-07-19 15:30 GMT

రాజకీయ అవిశ్వాసంలో ఎవరు ఆధిక్యం సాధిస్తారనే అంశంపై సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతోంది. గణాంకాలు కేంద్రసర్కారుకు సానుకూలంగా ఉన్నాయి. అవిశ్వాసం ప్రతిపాదించిన వారికీ ఆ సంగతి తెలుసు. ప్రజల్లో ఒక కదలిక తీసుకురావడమనే లక్ష్యంతో ప్రభుత్వంపై తమకు నమ్మకం లేదని తీర్మానం పెట్టారు. ఆ కదలికకు అవసరమైన ప్రేరణను పార్లమెంటు డిబేట్ రూపంలో ప్రజల ముందుంచాలని యత్నం. హాట్ హాట్ గా సాగనున్న 2019 ఎన్నికలకు ముందస్తుగా ఇస్తున్న టీజర్ గా దీనిని భావించాలి. ఏరకమైన ఎత్తుగడలతో రాజకీయ పార్టీలు ఎన్నికల సమరాన్ని ఎదుర్కొనేందుకు సిద్దమవుతున్నాయో సూచన ప్రాయంగా ఈ అవిశ్వాసం వెల్లడిస్తుంది. మోడీ వర్సస్ అఖిలపక్షాలు అన్నట్లుగా తంతు మారుతుందా? లేక బీజేపీ వర్సస్ బహుళపార్టీలు అన్నట్లుగా సీన్ కనిపిస్తుందా? అన్నదే తేలాల్సి ఉంది. రాజకీయ బలాబలాల తూకంగా ఈ అవిశ్వాసాన్ని చూడాల్సి ఉంటుంది.

ఎవరికెంత లాభం..?

నో కాన్ఫిడెన్స్ తీర్మానం కారణంగా ఎవరికెంత లబ్ధి చేకూరుతుందనే లెక్కలు ఇప్పటికే మొదలైపోయాయి. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెసు పార్టీ గడచిన నాలుగేళ్లుగా పార్లమెంటు లోపల,బయట అధికారపక్షానికి గట్టి సవాల్ విసరలేకపోయింది. శాసనసభల ఎన్నికల్లో పేలవమైన పనితీరుని కనబరిచింది. ఉభయసభల చర్చల్లోనూ సమర్థతను చాటుకోలేకపోయింది. యూపీఏ హయాంలో అధికారం పంచుకున్న అనేక పార్టీలు దూరమయ్యాయి. కాంగ్రెసు నేత్రుత్వంలోని సంకీర్ణ పక్షాల బలం నామమాత్రమైపోయింది. దీనిని రివర్స్ ట్రెండ్ లోకి తీసుకెళ్లి గతవైభవాన్ని పునరుద్ధరించుకునేందుకు అవిశ్వాసం సహకరిస్తుందని హస్తం పార్టీ అతి విశ్వాసంతో ఉంది. యూపీఏ కూటమికి కొత్త మిత్రులు చేరడమే కాకుండా, సంకీర్ణబలం ఒకతాటిపైకి వస్తుందనే భరోసాను వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెసు నాయకులు. త్రుణమూల్ కాంగ్రెసు పార్టీ కూడా జాతీయ స్థాయి ప్రాధాన్యాన్ని కోరుకుంటోంది. బీజేపీ, కాంగ్రెసు, అన్నాడీఎంకే తర్వాత అధికసంఖ్యలో లోక్ సభలో సభ్యులున్న పార్టీ టీఎంసీనే. కాంగ్రెసును తోసిరాజంటూ తనను తాను ఒక ప్రధాన అపోజిషన్ గా కేంద్రస్థానంలో ఆవిష్కరించుకోవచ్చునని టీఎంసీ లెక్కలు వేసుకుంటోంది.

కమలం కంపల్సన్స్...

సంపూర్ణ ఆధిక్యత ఉన్నప్పటికీ అవిశ్వాసతీర్మానాన్ని ఎదుర్కోవాల్సి రావడం కమలం పార్టీ కి అవమానంగానే చెప్పాలి. తీవ్రస్థాయిలో ఇతర రాజకీయపార్టీలు బీజేపీని, ప్రత్యేకించి మోడీని వ్యతిరేకించడం వల్లనే ప్రస్తుత పరిస్థితి ఉత్పన్నమైంది. బడ్జెట్ సెషన్ లో రాజకీయ కారణాలతోనే అవిశ్వాస తీర్మానాన్ని బీజేపీ నిరాకరించింది. మూల్యం చెల్లించాల్సి వచ్చింది. మోడీ ప్రజాస్వామ్య సంప్రదాయాలను కాలరాస్తున్నాడనే ముద్ర పడిపోయింది. అధికార పార్టీ అవిశ్వాసం విషయంలో కంగారు పడిపోతోందనే విమర్శలూ వెల్లువెత్తాయి. చాలా బిల్లులు పెండింగులో ఉన్నాయి. వీటిని ఆమోదించుకోవాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉంది. అవిశ్వాసానికి మోకాలడ్డితే సభ వాయిదా పడటం మినహా గత్యంతరం లేదు. దీంతో అవిశ్వాసాన్ని అంగీకరించి చర్చ చేపట్టడమే ఉత్తమమనే అంచనాకు వచ్చింది. చర్చ, ఓటింగు తర్వాత అవసరమైతే సభనే రద్దు చేసేందుకు నైతికంగా కేంద్రానికి అవకాశం దక్కుతుంది. సభ్యుల సంఖ్యాపరంగా అభివ్రుద్ధి, సంక్షేమ కార్యక్రమాలు వివరించడానికి తమకే ఎక్కువ సమయం దక్కుతుందనే ధీమాలో ఉంది అధికారపక్షం. దానికితోడు ప్రధానికి సమయంతో నిమిత్తం లేకుండా మాట్లాడే వీలుంటుంది. అందువల్ల అవిశ్వాసాన్ని తాము సానుకూలంగా మలచుకోగలమనే నమ్మకం బీజేపీలో వ్యక్తమవుతోంది.

చాంపియన్షిప్...

ఎన్డీఏ లో ఒక పక్షంగా కొనసాగిన తెలుగుదేశం పార్టీకి నిన్నామొన్నటివరకూ జాతీయ స్థాయి రాజకీయ ప్రాధాన్యం దక్కలేదు. వాజపేయి కాలంలో ఎన్డీఏలో చంద్రబాబుకు దక్కిన గౌరవంతో పోలిస్తే ఈ విడత కించపరిచినట్లే భావించాలి. అయితే రాజకీయ, నూతన రాష్ట్ర అవసరాల ద్రుష్ట్యా సర్దుకుపోవాల్సి వచ్చింది. కేంద్రం నుంచి బయటికి రావడంతోనే చంద్రబాబు నాయుడికి గత వైభవం తిరిగి దక్కింది. యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్ గా గతంలో చక్రంతిప్పిన రోజులు మళ్లీ తిరిగొచ్చాయి. మోడీని ఎధుర్కొనేందుకు సమఉజ్జీ చంద్రబాబే అన్న ప్రచారం ఊపందుకుంది. ఇదంతా ఆంధ్రప్రదేశ్ లో టీడీపీకి అడ్వాంటేజిగా మారతాయని భావిస్తున్నారు. తమ రాజీనామాలు ఆమోదింపచేసుకుని వైసీపీ వ్యూహాత్మక తప్పదానికి పాల్పడింది. రాజీనామాలు చేసినా ఉపఎన్నికలు రాకపోవడంతో రాజకీయ లబ్ధి చేకూరే సూచనలు కనిపించడం లేదు. మరోవైపు లోక్ సభలో తమ పార్టీ వాణి వినిపించే అవకాశం కోల్పోయారు. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు ఏకైక చాంపియన్ గా టీడీపీ తనను తాను క్లెయిం చేసుకొంటోంది. వైసీపీ మాజీ ఎంపీలు ఢిల్లీలోనే మకాం వేసి హడావిడి చేస్తున్నారు. కానీ వారికి ద్వితీయ ప్రాధాన్యమే లభిస్తోంది. అధికారపార్టీకి ప్రత్యామ్నాయంగా ఎదగాలని చూస్తున్న వైసీపీకి ఇది కొంత ఇబ్బందికరమే. ఎత్తుగడల్లో తనను తాను మరోసారి చంద్రబాబు నిరూపించుకున్నారనే చెప్పవచ్చు.

-ఎడిటోరియల్ డెస్క్

Similar News