ఏపీలో టీడీపీ మరీ ఇంత పతనానికా ?

తెలుగుదేశం పార్టీ ఓ చారిత్రాత్మకమైన అవసరంగా ఏర్పాటు అయింది. ఓ కొత్త చరిత్రను స్రుష్టించింది. 1980 దశకం వరకూ కాంగ్రెస్ ను పేరెత్తి, నోరెత్తి అనే నాధుడూ [more]

Update: 2019-06-19 12:30 GMT

తెలుగుదేశం పార్టీ ఓ చారిత్రాత్మకమైన అవసరంగా ఏర్పాటు అయింది. ఓ కొత్త చరిత్రను స్రుష్టించింది. 1980 దశకం వరకూ కాంగ్రెస్ ను పేరెత్తి, నోరెత్తి అనే నాధుడూ లేడు, నాయకుడూ లేడు. అలా అప్రతిహతంగా సాగిపోతున్న కాంగ్రెస్ బండికి బ్రేకులేసి వెనక్కి లాగేసిన మొనగాడు అన్న నందమూరి తారకరామారావు. కూర్చో అంటే కూర్చో అన్నట్లుగా కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఉండేవారు. చెప్పులు మోసిన సీఎంలను ఆంధ్రావని కళ్ళారా చూసింది. ఓ విధంగా రాచరిక వ్యవష్తను, నియంత పాలనను కళ్ళ ముందు పెట్టిన అహంకారపూరితమైన ఢిల్లీ పాలకుల కళ్ళు తెరిపించడానికి అన్నగారు తెలుగుదేశం తో ముందుకు వచ్చారు. ఎన్నో రికార్డులు బద్దలు కొట్టారు. మొత్తం 14 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఎన్టీయార్ ఒకే ఒకసారి ఓడిపోయారు. అయినా ఆయన రాజకీయాల్లో విజేత. ఎందుకంటే విలువలు, సిధ్ధాంతాల విషయంలో ఆయన ఎపుడూ ఓడిపోలేదు.

టీడీపీ పటిష్టంగా ఉందా :

ఇక ఇపుడు టీడీపీని తీసుకుంటే ఆ సిధ్ధాంతాలు ఏ కోశానా లేవు అనిపిస్తుంది. ఏ ఎండకా గొడుగు పట్టుకుని నెట్టేసుకుని రావడమే చంద్రబాబు నాయుడు జమానాలోని టీడీపీకి అలవాటు అయింది. ఏ పార్టీకి వ్యతిరేకంగా పుట్టిందే అదే కాంగ్రెస్ తో చెట్టాపట్టాల్ వేసిన ఘనత అచ్చంగా బాబుదే. ఈ పరిస్థితుల్లో తాజా ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓటమి పాలు అయింది. . సీట్లు 23 మాత్రమే వచ్చాయి. ఎంపీలూ మూడంటే మూడు దక్కాయి. అయినా ఓట్ల పరంగా దాదాపుగా నలభై శాతం దక్కించుకుంది. వైసీపీకి యభై శాతం ఓట్లు వచ్చాయనుకున్న టీడీపీ బాగా దగ్గరలోనే ఉంది. ఒక ఎన్నికలో ఓటమి పాలు అయినా మరో ఎన్నికలో గెలిచే అవకాశం ఎపుడూ ఉంటుంది. చంద్రబాబు నాయుడు స్వయంగా చెప్పీనట్లు ఇప్పటికి 9 ఎన్నికలను చూసిన టీడీపీ అయిదు సార్లు గెలిచి నాలుగు సార్లు ఓటమిపాలు అయింది. లక్షలో కార్యకర్తలు, భారీ ఓట్ల షేర్, ప్రతి పల్లెలో కచ్చితమైన ఓటు బ్యాంక్, మొదటి నుంచి అట్టిపెట్టుకునే బలమైన సామాజిక వర్గాలు ఇలా ఎన్నో సానుకూలతలు ఉన్నా టీడీపీ ఎందుకు ఇంతలా క్రుంగిపోతోంది. ఆ పార్టీ నుంచి ఎందుకు నాయకులు పక్క చూపులు చూస్తున్నారు.

బాబే మైనస్ :

టీడీపీకి ఇపుడు అన్నీ ఉన్నా అయిదవతనం కరవు అయింది. అదే నాయకత్వ పటిమ. టీడీపీలో చంద్రబాబు ఉన్నారుగా అంటే ఆయన నాయకుడు కాదని మేనేజర్ అని అంటారు విపక్షాలు. ఇపుడు స్వపక్షీయులు కూడా అదే మాట అంటున్నారు. బాబు 1999లో మొదటిసారి తన మ్యానిపులేషన్ తో ఎన్నికల్లో గెలిచారు. 2014తో దానికి ఎండ్ కార్డ్ పడింది. ఇక బాబు ఎత్తులు అన్నీ అవుట్ డేటెడ్ అయిపోయాయి. రాజకీయం కూడా ఎంతో మారిపోయింది. ఇంకా ట్రెడిషనల్ పాలిటిక్స్ చేస్తామంటే జనం మెచ్చుకోరు, అందుకే నిన్నటి ఎన్నికల్లో జనం తిప్పికొట్టారు. సోషల్ మీడియా యుగంలో ఎవరేమిటి అన్నది క్లారిటీగా మరు నిముషంలో తెలిసిపోతోంది. మోడీ మీదనో, కేసీయర్, జగన్ మీదనో నిందలు మోపేసి బండలు వేసేసి పబ్బం గడుపుకుందామంటే కుదరదు. బాబు పాజిటివ్ పాలిటిక్స్ చేయాలి. అది ఆయన వల్ల కాదని ఎపుడో తేలిపోయింది. అందుకే ఇపుడు బాబు నాయకత్వంలో టీడీపీ బతికి బట్టకట్టదనే తమ్ముళ్ళు తమ దారి చూసుకుంటున్నారు. ఇది నిజంగా విషాదమే. 40 శాతం ఓట్ షేర్ ఉన్న ఓ పార్టీ అతి వేగంగా కరిగి నీరు కావడమే రాజకీయ విచిత్రం, విలాపమే

Tags:    

Similar News