అక్కడ టీడీపీ పుంజుకుంటుందా… 25 ఏళ్ల త‌ర్వాత అయినా?

మాజీ మంత్రి, బీజేపీ నాయ‌కుడు మాణిక్యాల‌రావు మృతితో ప‌శ్చిమ గోదావరి జిల్లా తాడేప‌ల్లి గూడెం రాజ‌కీయాల్లో గ్యాప్ ఏర్పడింది. అన్నీతానై వ్యవ‌హ‌రించిన మాణిక్యాల‌రావు.. ఇక్కడ బీజేపీని ప‌టిష్టం [more]

Update: 2020-08-13 05:00 GMT

మాజీ మంత్రి, బీజేపీ నాయ‌కుడు మాణిక్యాల‌రావు మృతితో ప‌శ్చిమ గోదావరి జిల్లా తాడేప‌ల్లి గూడెం రాజ‌కీయాల్లో గ్యాప్ ఏర్పడింది. అన్నీతానై వ్యవ‌హ‌రించిన మాణిక్యాల‌రావు.. ఇక్కడ బీజేపీని ప‌టిష్టం చేసుకున్నారు. 2014 ఎన్నిక‌ల్లో తొలిసారి ఇక్కడ విజ‌యం సాధించిన మాణిక్యాల‌రావు.. అనూహ్యంగా మంత్రి ప‌ద‌విని కూడా చేప‌ట్టారు. అంత‌కు ముందు కేవ‌లం కౌన్సెల‌ర్‌గా ప‌నిచేసిన అనుభ‌వంతోనే ఆయ‌న ఫ‌స్ట్ టైం ఎమ్మెల్యేగా పోటీ చేసి విజ‌యం సాధించారు. వాస్తవానికి 2014 ఎన్నిక‌ల్లో టీడీపీ పొత్తులో భాగంగా తాడేప‌ల్లిగూడెం సీటును తాము గెల‌వం అని డిసైడ్ అయ్యి బీజేపీకి ఇచ్చింది. అయితే మాణిక్యాల‌రావు అనూహ్యంగా విజ‌యం సాధించారు. ఆ త‌ర్వాత మంత్రి అయ్యారు. ఇక గ‌త ఎన్నిక‌ల్లో ఆయ‌న న‌ర‌సాపురం ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు.

1999 ఎన్నికల తర్వాత….

మాణిక్యాల‌రావు మృతి ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోనే బీజేపీకి పెద్ద తీర‌ని లోట‌నే చెప్పాలి. ఆయ‌న పార్టీల‌తో సంబంధం లేకుండా సేవా సంస్థల ద్వారా కూడా ఎంతో మంది మ‌దిలో చెర‌గ‌ని ముద్ర వేసుకున్నారు. ఇక్కడ‌ టీడీపీ జెండా ఎగ‌రేయాల‌ని ఎప్పటి నుంచో ఎదురు చూస్తోంది. గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో ఈలి నాని టీడీపీ త‌ర‌ఫున పోటీ చేసి 20 వేల ఓట్ల తేడాతో ఓట‌మి పాల‌య్యారు. వాస్తవానికి 1989, 1994, 1999 ఎన్నిక‌ల్లో టీడీపీ ఇక్కడ నుంచి విజ‌యం సాధించింది. త‌ర్వాత మాత్రం ఇప్పటి వ‌ర‌కు ఈ నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ జెండా ఎగిరింది లేదు. 2014లో బీజేపీతో పొత్తు కార‌ణంగా టికెట్‌ను బీజేపీకి కేటాయించింది. ఇక, ఆ త‌ర్వాత బీజేపీదే ఇక్కడ పెత్తనంగా మారింది. వాస్తవానికి ఇక్కడ టీడీపీ హ‌యాంలో బాగానే అభివృద్ధి కార్యక్రమాలు జ‌రిగినా ఐదేళ్ల పాటు మంత్రి మాణిక్యాల‌రావు వ‌ర్సెస్ అప్పటి జ‌డ్పీచైర్మ‌న్ ముళ్లపూడి బాపిరాజు మ‌ధ్య తీవ్రమైన యుద్ధం న‌డిచింది.

సరైన నాయకుడు లేక…..

మాణిక్యాల‌రావు సైతం నిత్యం టీడీపీ నేత‌ల‌తో ఆయ‌న ఢీ అంటే ఢీ అని పార్టీని నిల‌బెట్టుకు వ‌చ్చారు. ఇక‌, గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో బీజేపీ-టీడీపీ వేర్వేరుగా పోటీ చేయ‌డంతో టీడీపీకి ఇక్కడ పెద్ద ఎదురు దెబ్బ త‌గ‌ల‌డంతో పాటు చిత్తుగా ఓడింది. మాణిక్యాల‌రావు ఎమ్మెల్యేగా కాకుండా న‌ర‌సాపురం ఎంపీగా పోటీ చేశారు. ఇక‌, ఇప్పుడు మాణిక్యాల‌రావు మృతితో బీజేపీని బ‌ల‌ప‌రిచే ఆస్థాయి నాయ‌కుడు లేర‌నే చెప్పాలి. ఈ నేప‌థ్యంలో బీజేపీ ఓటు బ్యాంకును సైతం త‌మ‌కు అనుకూలంగా మ‌లుచుకుని ఎదిగేందుకు టీడీపీ కృషి చేస్తేనే ఆ పార్టీకి 25 ఏళ్ల త‌ర్వాత అయినా ఇక్కడ విజ‌యం ద‌క్కే అవ‌కాశాలు ఉన్నాయి. అయితే ఇక్కడ బీజేపీకి మాణిక్యం లేని లోటు ఎవ్వరూ తీర్చ‌లేని ప‌రిస్థితి ఉంటే… టీడీపీకి కూడా స‌రైన నాయ‌కుడు లేరు.

కుల సమీకరణలతో….

గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఓడిన మాజీ ఎమ్మెల్యే ఈలి నాని ప్రస్తుతం వైసీపీతో అంట‌కాగుతున్నారు. ఆయ‌న‌పై టీడీపీ కూడా ఆశ‌లు వ‌దులుకుంది. ఇక్కడ సీటుపై క‌న్నేసిన జ‌డ్పీ మాజీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజుకు ఇక్కడ కుల స‌మీక‌ర‌ణ‌లు సెట్ అయ్యే ఛాన్స్ లేదు. దీంతో టీడీపీకి ఇక్కడ ఎవ‌రు నాయ‌కుడిగా మార‌తారో ? చూడాలి. ఇక్కడ నుంచి గెలిచిన వైఎస్సార్ సీపీ నాయ‌కుడు కొట్టు స‌త్యనారాయ‌ణ కూడా దూకుడుగానే ఉన్నారు. ఈ నేప‌థ్యంలో టీడీపీ ఎలా పైచేయి సాధిస్తుందో చూడాలి.

Tags:    

Similar News