మేయ‌ర్ సీటు కోసం టీడీపీలో ర‌గ‌డ..‌?

అదేంటి? రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కార్పొరేష‌న్లలోనూ వైసీపీ విజ‌యం సాధించి.. మేయ‌ర్ పీఠాల‌ను కూడా ద‌క్కించుకుని స‌మావేశాలు కూడా దాదాపు అన్నిచోట్లా స్టార్ట్ అయ్యాయి క‌దా.. ఇప్పుడు [more]

Update: 2021-05-04 03:30 GMT

అదేంటి? రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కార్పొరేష‌న్లలోనూ వైసీపీ విజ‌యం సాధించి.. మేయ‌ర్ పీఠాల‌ను కూడా ద‌క్కించుకుని స‌మావేశాలు కూడా దాదాపు అన్నిచోట్లా స్టార్ట్ అయ్యాయి క‌దా.. ఇప్పుడు ప్రధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ మేయ‌ర్ సీటు కోసం ర‌గ‌డ ప‌డుతోందేంటి ? అని అనుకుంటున్నారా ? ఇక్కడే ఉంది.. అస‌లు రాజ‌కీయం. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కార్పొరేష‌న్లకు ఎన్నిక‌లు జ‌ర‌గ‌లేదు. ఒక‌టి రెండు చోట్ల వివిధ కార‌ణాల‌తో ఎన్నిక‌లు నిలిచిపోయాయి. అలాంటి వాటిలో రాజ‌మండ్రి మునిసిప‌ల్ కార్పొరేష‌న్ ఒక‌టి. ఈ కార్పొరేష‌న్ ప‌రిధిలో విలీన గ్రామాల సమస్య కోర్టులో ఉండటంతో మొన్న ఎన్నికలు జరగలేదు.

పట్టుకోసం….

అయితే.. తాజాగా ఇప్పుడు ముసాయిదా విడుదలైంది. దీంతో పార్టీలు స్పీడ్ పెంచాయి. మ‌రీ ముఖ్యంగా ప్రధాన ప్రతిప‌క్షం అంతో ఇంతో బ‌లంగా ఉన్న ఇక్కడ ఎట్టి ప‌రిస్థితిలోనూ కార్పొరేష‌న్ ద‌క్కించుకునేందుకు టీడీపీ వ్యూహాత్మకంగా అప్పుడే అడుగులు వేయ‌డం ప్రారంభించింది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రమంతా వైసీపీ గాలి వీచినా రాజమండ్రి అర్బన్‌, రూరల్‌ నియోజకవర్గాల్లో టీడీపీ ఎమ్మెల్యేలు గెలిచారు. ఆదిరెడ్డి భవానీ రాజమండ్రి అర్బన్‌ నుంచి , గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజమండ్రి రూరల్‌ నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు కోడలైన ఆదిరెడ్డి భవానీ. రాజమండ్రిలో పట్టుకోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

పదవి కోసం రెండు వర్గాలు….

ఈ క్రమంలో భవానీ భర్త ఆదిరెడ్డి వాసు రాజ‌మండ్రి మేయర్‌ పీఠంపై ఆశ పెట్టుకున్నారు. ఈ నేప‌థ్యంలో ఎమ్మెల్యే గోరంట్ల జోక్యం చేసుకోకుండా ఆదిరెడ్డి వర్గం అడ్డుకుంటోందని టాక్‌. ఈ రెండు వర్గాల పోరుతో ఇప్పుడు రాజ‌మండ్రి రాజ‌కీయం వేడెక్కింది. కార్పొరేష‌న్‌పై ప‌ట్టుకోసం.. అటు బుచ్చయ్య చౌద‌రి.. రాజ‌మండ్రి సిటీలోనే గ‌త నెల రోజులుగా మ‌కాం వేసి.. వ్యూహాలు రెడీ చేసుకుంటున్నారు. అదే స‌మ‌యంలో భ‌వానీ కూడా త‌న భ‌ర్త‌,మామ‌ల‌తో క‌లిసి.. ఇక్కడ మేయ‌ర్ పీఠం ద‌క్కించుకునేందుకు పావులు క‌దుపుతున్నారు. అయితే.. ఇదివివాదంగా మార‌డంతో విసుగుపుట్టిన టీడీపీ లోకల్‌ నేతలు.. మాజీ కార్పొరేటర్లు సైకిల్‌కు గుడ్‌బై చెప్పేస్తుండ‌డం అత్యంత ఆశ్చర్యక‌ర‌మైన విష‌యం.

కలిసి ఉంటేనే…?

వాస్తవానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో.. అంటే.. వైసీపీ స‌ర్కారు దూకుడు, నేత‌ల వ్యూహాల నేప‌థ్యంలో టీడీపీ మళ్లీ పాగా వేయడం అంత సులభం కాదన్నది పార్టీ నేతలు చెప్పేమాట. రాజమండ్రి కార్పోరేష‌న్‌లో హ్యాట్రిక్‌ విజయాలు సాధించిన టీడీపీకి నాలుగోసారి పెద్ద సవాల్‌ ఎదురుకానున్నట్టు చెబుతున్నారు. నేత‌ల మ‌ధ్య ఐక్యత‌లేని కార‌ణంగా.. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీకి భారీ ఎదురు దెబ్బత‌గిలినా.. ఇక్కడ నేత‌లు గుర్తించ‌లేక పోతున్నార‌ని అంటున్నారుప‌రిశీల‌కులు. అదే స‌మ‌యంలో ఇక్కడ కార్పోరేష‌న్‌పై వైసీపీ జెండా ఎగ‌ర‌వేసేందుకు నేతలు వ్యూహాల‌తో దూసుకు పోతున్నారు. మ‌రి టీడీపీ కాస్త ప‌ట్టున్న రాజ‌మండ్రి కార్పోరేష‌న్‌లో అయినా గెలిచి సంచ‌ల‌నం క్రియేట్ చేస్తుందా ? లేదా అనైక్యత‌తో ఇక్క‌డ కూడా ఓడి మ‌రో ప‌రాజ‌యం త‌మ ఖాతాలో వేసుకుంటుందా ? అన్నది చూడాలి.

Tags:    

Similar News