ముందే చేతులెత్తేశారా?

ప్రధాన ప్రతిప‌క్షం టీడీపీ కీల‌క‌మైన నెల్లూరు జిల్లాలో ఘోర‌మైన ప‌రిస్థితిని ఎదుర్కొంటోంది. ఇక్కడ గ‌త ఏడాది ఎన్నిక‌ల‌కు ముందు ఒక వెలుగు వెలిగిన టీడీపీ ఇప్పుడు దిక్కులు [more]

Update: 2020-01-25 06:30 GMT

ప్రధాన ప్రతిప‌క్షం టీడీపీ కీల‌క‌మైన నెల్లూరు జిల్లాలో ఘోర‌మైన ప‌రిస్థితిని ఎదుర్కొంటోంది. ఇక్కడ గ‌త ఏడాది ఎన్నిక‌ల‌కు ముందు ఒక వెలుగు వెలిగిన టీడీపీ ఇప్పుడు దిక్కులు చూస్తోంది. ఎవ‌రు పార్టీని ముందుండి న‌డిపిస్తారా? అని భావిస్తోంది. “తెలుగు దేశం పిలుస్తోంది.. క‌ద‌లిరా!“-అని ఒక‌ప్పుడు అన్నగారు ప్రజ‌ల‌కు పిలుపునిస్తే.. ఇప్పుడు ఇదే పిలును త‌న పార్టీ కార్యకర్తల‌కు, నాయ‌కుల‌కే ఇవ్వాల్సిన ప‌రిస్థితిని మాజీ సీఎం చంద్రబాబు ఎదుర్కొంటున్నారు. ఎవ‌రికి వారు పార్టీకి దూరంగా ఉంటున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో పార్టీ ఇక్కడ ఘోరంగా ఓడిపోయింది. దీంతో పార్టీ ఇప్పుడు అనాథ‌గా మారిపోయింది.

కార్పొరేషన్ ఎన్నికల్లో…..

దీనికి పార్టీ అధినేత చంద్రబాబు స్వయంకృత‌మే ఉంద‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. క్షేత్రస్థాయిలో నాయ‌క‌త్వాన్ని కాకుండా వ్యాపార దిగ్గజాల‌కు ఎన్నిక ల్లో అవ‌కాశం ఇవ్వడం వంటి ప‌రిణామాల‌తోనే ప‌రిస్థితి ఇలా అయింద‌ని అంటున్నారు. స‌రే…పార్టీ ప‌రిస్థితి ఎలా ఉన్నా.. త్వర‌లోనే స్థానిక సంస్థల‌కు ఎన్నిక‌లు జ‌రిగే అవ‌కాశం ఉంది. ఈ క్రమంలో నెల్లూరు కార్పొరేష‌న్‌కు ఎన్నిక‌లు జ‌రిగితే.. ప‌రిస్థితి ఏంటి ? ఎవ‌రు ముందుండి న‌డిపిస్తారు ? అనే ప్రశ్న తెర‌మీదికి వ‌చ్చింది. మొత్తం 56 వార్డులున్న నెల్లూరు కార్పొరేష‌న్‌లో టీడీపీ ప‌రిస్థితి చాలా దీనస్థితిలో ఉంది.

ఇద్దరూ పట్టించుకోక పోవడంతో…

ప్రస్తుతం ఇప్పటి వ‌రకు ఉన్న ప‌రిస్థితిని అంచ‌నా వేస్తే.. నెల్లూరులో టీడీపీ జెండా మోసేవారు కానీ, పార్టీ ప‌క్షాన పోటీ చేసే వారు కానీ ఎవ‌రూ క‌నిపించ‌డం లేదు. గ‌త ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల ప్రభావంతో నాయ‌కులు ఎవ‌రికి వారు సైలెంట్ అయిపోయారు. వాస్తవానికి మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పొంగూరు నారాయ‌ణ కానీ, రూర‌ల్ నుంచి పోటీ చేసి ఓడిన మాజీ మేయ‌ర్ అబ్దుల్‌ అజీజ్ కానీ ఇప్పుడు పార్టీని ప‌ట్టించుకోవ‌డం లేదు. ఎవ‌రికి వారు వ్యాపారాల్లో మునిగి తేలుతున్నారు.

వార్డుల్లో పోటీ చేసే వారు….

నెల్లూరు సిటీలో 30 వార్డులు, రూర‌ల్‌లో 26 వార్డులు ఉన్నాయి. రేపటి వేళ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో ఊపు తెచ్చేలా టీడీపీ త‌ర‌ఫున అడుగులు ముందుకు వేసే వారు ఒక్కరు కూడా క‌నిపించ‌డం లేద‌ని అంటున్నారు. ఎన్నిక‌ల్లో పార్టీ త‌ర‌పున పోటీ చేసే వారే లేరు. న‌లుగురైదుగురు ధైర్యం చేసి పోటీ చేసి గెలుస్తార‌న్న గ్యారెంటీ లేదు. గెలిచిన వాళ్లు కూడా త‌ర్వాత పార్టీలో ఉండ‌ర‌నే సొంత పార్టీ వాళ్లే చెపుతున్నారు. ఈ నేప‌థ్యంలో పార్టీ ఏ విదంగా ముందుకు సాగుతుందో అర్ధం కావ‌డం లేదు.

Tags:    

Similar News