కడప ఖాళీ అయినట్లేనా?

ఇటీవల జరిగిన ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి శాపంగా పరిణమించాయి. కోలుకోలేని దెబ్బతీశాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కేవలం 23 సీట్లు మాత్రమే రావడంతో నేతలు [more]

Update: 2019-09-13 08:00 GMT

ఇటీవల జరిగిన ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి శాపంగా పరిణమించాయి. కోలుకోలేని దెబ్బతీశాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కేవలం 23 సీట్లు మాత్రమే రావడంతో నేతలు వలస బాట పట్టడం ప్రారంభించారు. అన్ని జిల్లాల మాట ఎలా ఉన్నా ఎన్నికలకు ముందు చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కడప జిల్లాలో మాత్రం టీడీపీ ఖాళీ అయ్యే పరిస్థితి కన్పిస్తుంది. కడప జిల్లా ముఖ్యమంత్రి జగన్ సొంత ప్రాంతం కావడంతో ప్రాధాన్యం సంతరించుకుంది.

జగన్ సొంత జిల్లా కావడంతో…..

కడప జిల్లా వైఎస్ జగన్ కు పట్టున్న జిల్లా. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాం నుంచే ఆ కుటుంబానికి జిల్లా అండగా నిలబడేది. 2014 ఎన్నికల్లోనూ కడప జిల్లాలో కేవలం ఒక్క సీటు మాత్రమే టీడీపీ సాధించుకోగలిగింది. అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబు కడప జిల్లాపై ప్రత్యేక దృష్టి పెట్టారు. వైసీపీ నుంచి నేతలను చేర్చుకున్నారు. వైఎస్ జగన్ ను మానసికంగా, రాజకీయంగా దెబ్బతీయాలంటే కడప జిల్లాలో పార్టీని బలోపేతం చేయాలని నిర్ణయించారు. అందుకే అప్పట్లో వైసీపీ నుంచి వచ్చి చేరిన ఆదినారాయణరెడ్డికి మంత్రి పదవి ఇచ్చారు.

జీరో రిజల్ట్ రావడంతో…..

తాజాగా జరిగిన ఎన్నికల్లో కడపలో ఒక్క సీటును కూడా తెలుగుదేశం పార్టీ గెలుచుకోలేకపోయింది. జీరో రిజల్ట్ వచ్చింది. పులివెందులకు నీళ్లు ఇచ్చామన్న చంద్రబాబు ప్రచారం కూడా వర్క్ అవుట్ కాలేదు. కుప్పం కంటే తాను పులివెందులకే ప్రాధాన్యత ఇచ్చానన్న చంద్రబాబు మాటలను కడప వాసులు పట్టించుకోలేదు. ఎన్నికల ఫలితాల అనంతరం కడప జిల్లాలో నేతలు వలస బాట పట్టారు. ఇప్పటికే రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ భారతీయ జనతా పార్టీలో చేరారు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు పార్టీని వీడటంతో పార్టీ శ్రేణులు నైరాశ్యంలోకి వెళ్లిపోయాయి.

ముఖ్యనేతలందరూ….

ఇక మంత్రి పదవి ఇచ్చిన ఆదినారాయణరెడ్డి కూడా బీజేపీలోకి జంప్ అయి పోయారు. ఈ నెల 14, 15వ తేదీల్లో కడప జిల్లాలో మరికొందరు టీడీపీ నేతలు భారతీయ జనతా పార్టీలో చేరనున్నారు. ఇప్పటికే కొందరు సెకండ్ క్యాడర్ లీడర్లు బీజేపీలోకి వెళ్లిపోయారు. ముఖ్య నేతలతో పాటు ద్వితీయ శ్రేణినేతలు పెద్దయెత్తున బీజేపీలో చేరనున్నారు. వీరితో పాటు వీరశివారెడ్డి లాంటి నేతలు కూడా వైసీపీ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇలా పట్టులేకపోయినా ఐదేళ్ల పాటు ప్రత్యేక దృష్టి పెట్టిన చంద్రబాబు పార్టీ కడప జిల్లాలో ఖాళీ అయ్యే పరిస్థితులు కన్పిస్తున్నాయి.

Tags:    

Similar News