వీళ్లు మారరు… పార్టీ పట్టించుకోదు.. ఇక అంతే?

ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ టీడీపీ నేతల్లో సఖ్యత లేదు. పార్టీని కలసికట్టుగా ముందుకు తీసుకెళదామన్న ధ్యాస లేదు. రోజురోజుకూ విభేదాలు మరింత తీవ్రమవుతున్నాయి తప్పించి ఎక్కడా టీడీపీ నేతల్లో [more]

Update: 2020-07-05 03:30 GMT

ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ టీడీపీ నేతల్లో సఖ్యత లేదు. పార్టీని కలసికట్టుగా ముందుకు తీసుకెళదామన్న ధ్యాస లేదు. రోజురోజుకూ విభేదాలు మరింత తీవ్రమవుతున్నాయి తప్పించి ఎక్కడా టీడీపీ నేతల్లో ఐక్యత కన్పించడం లేదు. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న అనంతపురం జిల్లాలో తెలుగు తమ్ముళ్లు కొట్టుకుంటున్నారు. ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటున్నారు. అయినా పార్టీ హైకమాండ్ వీరి ఫిర్యాదులను పక్కన పెట్టింది. విభేదాలను పరిష్కరించే ప్రయత్నమూ చంద్రబాబు చేయకపోవడంతో విభేదాలు మరింత ముదురుతున్నాయి.

మూడు నియోజకవర్గాల్లో….

జిల్లాలో మూడు నియోజకవర్గాల్లో టీడీపీ నేతల మధ్య విభేదాలు తీవ్రమయ్యాయి. పెనుకొండ, శింగనమల, కల్యాణదుర్గం నియోజకవర్గాల్లో టీడీపీ నేతల మధ్య సఖ్యత లేదు. అనంతపురం జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా పార్థసారధి ఉన్నారు. అయితే ఆయన సొంత నియోజకవర్గం పెనుకొండలోనే విభేదాలు తీవ్రంగా ఉన్నాయి. ఇక్కడ పార్థసారధికి పోటీగా కురుబ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ సవితమ్మకు, పార్థసారధికి పడటం లేదు. పోటీగా సవితమ్మ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఎంపీ టిక్కెట్ ఇప్పిస్తానని హామీ ఇచ్చి మొండి చేయి చూపడంతో సవితమ్మ పార్థసారధికి వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు. దీనిపై పార్థసారధి ఇప్పటికే అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. కానీ చంద్రబాబు పట్టించుకోలేదు.

ఎవరి కార్యక్రమాలు వారివే….

ఇక శింగనమల నియోజకవర్గంలో టీడీపీ ఇన్ ఛార్జి శ్రావణికి వ్యతిరేకంగా అక్కడ టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్ రాజు పోటీ కార్యక్రమాలు చేపడుతున్నారు. పార్టీ పిలుపు ఇచ్చిన కార్యక్రమాలను ఇద్దరూ వేర్వేరుగా నిర్వహిస్తుండటంతో క్యాడర్ అయోమయంలో పడింది. శ్రావణికి జేసీ వర్గం మద్దతు ఉండగా, రాజుకు మాజీ మంత్రి సపోర్ట్ ఉంటున్నారు. ఇప్పటికే ఈ నియోజకవర్గం నుంచి శమంతకమణి, యామిని బాల వైసీపీలోకి వెళ్లిపోయారు. అయినా టీడీపీలో గ్రూపుల గోల ఆగడం లేదు.

ఆధిపత్య పోరుతో…..

మరో నియోజకవర్గమైన కల్యాణదుర్గంలోనూ ఆధిపత్య పోరు టీడీపీలో కొనసాగుతోంది. మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరికి, పార్టీ ఇన్ ఛార్జి ఉమామహేశ్వర నాయుడులకు మధ్య పొసగడం లేదు. తన ఓటమికి హనుమంతరాయ చౌదరి కారణమంటూ ఉమామహేశ్వరనాయుడు బహిరంగంగానే ఆరోపించారు. పార్టీ కార్యక్రమాలను కూడా విడివిడిగా చేస్తున్నారు. దీనిపై ఉమామహేశ్వర నాయుడు పార్టీ హైకమాండ్ కుఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో ఆయన వర్గం అసహనం వ్యక్తం చేస్తోంది. మొత్తం మీద అనంతపురం జిల్లాలోని మూడు కీలకమైన నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు విభేదాలతో పార్టీ పరువును బజారున పడేస్తున్నారు. మరి చంద్రబాబు ఎప్పుడు జోక్యం చేసుకుంటారో చూడాలి.

Tags:    

Similar News