మళ్లీ ఆయన కోసం ప్రయత్నం .. అందుకేనా?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లాలో బలంగా ఉంది. గత ఎన్నికల్లో నలుగురు మాత్రమే టీడీపీ నుంచి గెలిచారు. ప్రతి నియోజకవర్గంలో వైసీపీకి పటిష్టమైన నాయకత్వం ఉంది. అయినా [more]

Update: 2020-06-23 02:00 GMT

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లాలో బలంగా ఉంది. గత ఎన్నికల్లో నలుగురు మాత్రమే టీడీపీ నుంచి గెలిచారు. ప్రతి నియోజకవర్గంలో వైసీపీకి పటిష్టమైన నాయకత్వం ఉంది. అయినా సరే ఆ జిల్లాలో వైసీపీ ఆపరేషన్ ఆకర్ష్ చేస్తూనే ఉంది. ఇప్పటికే కొంతమంది నాయకులు టీడీపీ నుంచి వైసీపీలో చేరిపోయారు. మరికొందరు చేరిపోతారన్న ప్రచారం మళ్లీ ఊపందుకుంది. అసలే కొనఊపిరి తో ఉన్న టీడీపీకి ఉన్న కొద్ది మంది నేతలు పోతే జిల్లాలో పార్టీ జెండా మోసే వారు కనపడని పరిస్థిితి.

టీడీపీ బలంగా…..

ప్రకాశం జిల్లాలో టీడీపీ ఒకప్పుడు బలంగా ఉండేది. పేరుమోసిన నాయకులు ఉండేవారు. అయితే గత ఎన్నికల్లో వైఎస్ జగన్ ప్రభంజనంలోనూ టీడీపీ నాలుగు సీట్లు గెలుచుకుంది. చీరాల, పర్చూరు, అద్దంకి, కొండపి స్థానాలను గెలుచుకుంది. ఈ నాలుగు స్థానాల్లోనూ గెలిచిన అభ్యర్థులపై వైసీపీ తొలి నుంచి వల విసురుతూనే ఉంది. కరణం బలరాం ఇప్పటికే వైసీపీకి మద్దతు పలికారు. మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేలు ప్రస్తుతానికి టీడీపీలోనే ఉన్నారు.

ఆర్థికంగా సాయం అందించే వారిపై…..

ఎమ్మెల్యేలు తమ వలలో పడకపోవడంతో వైసీపీ బలమైన నేతలను పార్టీలోకి తీసుకునే ప్రయత్నాలు ప్రారంభించింది. టీడీపీని ఆర్థికంగా ఆదుకునే నేతలపైనే వైసీపీ కన్నేసింది. ఇందులో భాగంగా మాజీ మంత్రి శిద్ధా రాఘవరావును వైసీపీ తన పార్టీలో చేర్చుకుంది. ఆయన ఆర్థికంగా టీడీపీకి వెన్నుదన్నుగా ఉండేవారు. అందుకే రాజకీయంగా పెద్దగా బలం లేకపోయినా శిద్దా రాఘవరావుకు కండువా కప్పేశారు. దీంతో టీడీపీకి కొంత నిధులు ఆగిపోయినట్లే.

పోతుల రామారావుపై……

ఇక మరో మాజీ ఎమ్మెల్యే పోతుల రామారావును కూడా వైసీపీ టార్గెట్ చేసింది. ఈయన గనుల కంపెనీలకు కూడా నోటీసులు జారీ చేసింది. పోతుల రామారావు బలమైన సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో పాటు ఆర్థికంగా బలమైన వారు. టీడీపీని జిల్లాలోనే కాకుండా రాష్ట్రస్థాయి కార్యక్రమాలకు కూడా ఆర్థికంగా సాయం చేస్తుంటారు. దీంతో పోతుల రామారావును పార్టీలోకి తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. రేపో, మాపో ఆయన కూడా వైసీపీ కండువా కప్పుకోవడం ఖాయంగా కన్పిస్తుంది.

Tags:    

Similar News