“ఒక్కసారి ఛాన్స్‌” అన్నా వినలేదుగా..!

రాజకీయాల్లో సెంటిమెంట్‌కు ఉండే ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. ప్రజలను ఏదో ఒక విధంగా మచ్చిక చేసుకుని ఓట్లు కుమ్మరించుకోవాలని వ్యూహంతో ప్రతి రాజకీయ నాయకుడు కూడా [more]

Update: 2019-08-07 06:30 GMT

రాజకీయాల్లో సెంటిమెంట్‌కు ఉండే ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. ప్రజలను ఏదో ఒక విధంగా మచ్చిక చేసుకుని ఓట్లు కుమ్మరించుకోవాలని వ్యూహంతో ప్రతి రాజకీయ నాయకుడు కూడా ప్రయత్నిస్తూనే ఉంటారు. దీనికి ఆ పార్టీ, ఈ పార్టీ అనే చర్చ అవసరం లేదు. ప్రతి పార్టీ కూడా సెంటిమెంట్ రాజకీయాలకు కేంద్ర బిందువే. ముఖ్యంగా ఏపీ వంటి చోట్ల జాలి హృదయం ఎక్కువగా ఉన్న ప్రజలను బుట్టలో వేసుకునేందుకు ఒక్కొక్క నాయకుడు చేసే ప్రయత్నాలు కూడా అన్ని ఇన్ని కావు.

సెంటిమెంట్లకు….

ఈ క్రమంలోనే నాయకులు ఎన్నికలు వచ్చేసరికి ఎక్కడా లేని ప్రేమను ప్రజలపై కురిపించేస్తారు. అయితే, కొన్నిసార్లు మాత్రం ఈ తరహా సెంటిమెంట్లకు కూడా ప్రజ‌లు లొంగ‌ని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలను మచ్చిక చేసుకునేందుకు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న అప్పటి వైసిపి ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ ప్రజల్లో ప్రచారం చేసింది. ఆ పార్టీ మొర విన్న ప్రజలు జగన్‌కు అధికార పగ్గాలు అప్పగించారు.

చివరి సారి అన్నా…..

ఇలానే టిడిపిలోని కొందరు నాయకులు ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ ప్రజల మధ్యకు వెళ్లారు. ఒకపక్క పార్టీ అధినేత, అప్పటి సీఎం చంద్రబాబు అభివృద్ధిని చూసి ఓట్లేయాల‌ని, లేకపోతే, రాష్ట్రం నష్టపోతుందని ప్రచారం చేస్తే.. కొందరు సీనియర్ నాయకులు, రాజకీయ ఉద్దండులు మాత్రం ఒక్క ఛాన్స్ ప్లీజ్.. ఇక, మేం రాజకీయాల నుంచి తప్పుకుంటాం.. అంటూ ప్రజలను మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నించారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా టిడిపికి చెందిన నాయకులు పదుల సంఖ్యలో ప్రజలను మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నించారు. వీరిలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీ అభ్యర్థులు కూడా ఉండడం గమనార్హం. తెలుగుదేశం పార్టీ నేతలైన ప్రతివాడ నారాయణస్వామి(నెల్లిమర్ల), మండలి బుద్ధ ప్రసాద్ (అవనిగడ్డ) కోడెల శివప్రసాద్‌రావు (సత్తెనపల్లి), ఆలపాటి రాజా (తెనాలి), రాయపాటి సాంబశివరావు(నరసరావుపేట ఎంపీ)లు ప్రజలకు సెంటిమెంట్ వ‌ల విసిరారు.

పట్టించుకోని ప్రజలు….

అయితే, ప్రజలు అనూహ్యంగా వీరిని తిప్పి కొట్టారు. కొందరు ఎన్నికల బూత్‌ల‌లోకి ప్రవేశించి హాల్ చల్ చేశారు. మరికొందరు తమ వయసును ఏకరువు పెట్టారు. ఇంకొందరు ఇప్పటి వరకు ప్రజలకు తాము చేసిన సేవలను వివరించారు. మరికొందరు ఇవే తమకు చిట్టచివరి ఎన్నికలని, రాష్ట్ర అభివృద్ధిలో తమకు మరో అవకాశం ఇప్పించాలని తెలుగుదేశం పార్టీ నేతలు ప్రజలను వేడుకున్నారు. ఈ మొత్తం వ్యవహారాన్నికి తోడు.. తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా కూడా వీరిని బాగానే ప్రచారం చేసింది. అయినా కూడా వీరిలో ఏ ఒక్కరికి ప్రజలు మొగ్గు చూపించలేదు. దీంతో వీరంతా మూకుమ్మడిగా ఓటమి ఎదుర్కొన్నారు.

ఎండ్ కార్డు పడినట్లేనా…?

విచిత్రం ఏంటంటే పార్టీలో చాలా సీనియ‌ర్ అయిన గోరంట్ల బుచ్చయ్య చౌద‌రి ఇంత వ్యతిరేక‌త‌లోనూ విజ‌యం సాధించి అంద‌రిని ఆశ్చర్యప‌రిచారు. దీంతో ఇప్పుడు ఇవే చివ‌రి ఎన్నిక‌లుగా భావించి పోటీ చేసి ఓడిన తెలుగుదేశం పార్టీ నేతల భవితవ్యం ఏంటి ? తెలుగుదేశం పార్టీ తరపున పదవులు అనుభవించారే కానీ, ప్రజలకు చేరువ కాలేకపోయాడు అనే విమర్శలు వీరిని ఇప్పుడు తీవ్రంగా వేధిస్తున్నాయి. వీరిలో కురువృద్ధులు కూడా ఉండడంతో వచ్చే ఎన్నికల నాటికి వీరికి రాజకీయ సన్యాసమే మిగలనుంది. ఈ క్రమంలో వీరి వారసులు రంగంలోకి దిగుతారా? లేక వీరితోనే వీరి రాజకీయాలకు ఎండ్ కార్డు పడుతుందా అనేది ఆసక్తిగా మారింది. చూడాలి మరి ఏం జరుగుతుందో!!

Tags:    

Similar News