సబ్బం మీద దెబ్బ ?

విశాఖ జిల్లా రాజకీయాల్లో సబ్బం హరిది ప్రత్యేక స్థానం. ఆయన పుట్టింది, పెరిగింది. ఎదిగింది కాంగ్రెస్ రాజకీయాల్లో. తమ నాయకుడు రాజీవ్ గాంధీని ఏదో అన్నాడని ఆగ్రహించి [more]

Update: 2020-10-03 08:00 GMT

విశాఖ జిల్లా రాజకీయాల్లో సబ్బం హరిది ప్రత్యేక స్థానం. ఆయన పుట్టింది, పెరిగింది. ఎదిగింది కాంగ్రెస్ రాజకీయాల్లో. తమ నాయకుడు రాజీవ్ గాంధీని ఏదో అన్నాడని ఆగ్రహించి నాటి తెలుగుదేశం మంత్రి అశోక్ గజపతి రాజును విశాఖ ఎయిర్ పోర్టులో అడ్డుకుని ఆయన కారు డోర్ పట్టుకుని కొంత దూరం ప్రయాణం చేసి అలజడి సృష్టించిన సంచలన చరిత్ర ఆయనకు ఉంది. అపుడు ఆయన యూత్ కాంగ్రెస్ లీడర్ గా ఉండేవారు. ఉత్తరాంధ్ర దిగ్గజ నేత ద్రోణం రాజు సత్యనారాయణను ఎదిరించి మరీ కాంగ్రెస్ లో వర్గ రాజకీయాలను కొనసాగించిన నేర్పూ సబ్బం హరిదే. ఇక కాంగ్రెస్ పార్టీనే ఒక దశలో ధిక్కరించి బహిష్కరణకు గురి అయిన సబ్బం హరి ఆ తరువాత కేవీపీ రామచంద్రరావు ద్వారా దానిని ఎత్తివేయించుకున్నారు. వైఎస్సార్ చలువతో ఆయన 2009 ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీగా గెలిచారు.

జగన్ భక్తుడిగా…..

జగన్ కి చాలా ఫ్యూచర్ ఉందని, ఆయన్ని మించిన నాయకుడిని ఉమ్మడి ఏపీలో చూడబోమని ముందే జోస్యం చెప్పిన వారు సబ్బం హరి. ఇక జగన్ వెంట మొదట్లో నడచిన అతి కొద్ది మందిలో ఆయన ఒకరు. ఉత్తరాంధ్రా జిల్లాల బాధ్యతలను జగన్ సబ్బం హరికి అప్పగించి అంతా చూడమన్నారంటే హరికి ఇచ్చిన గౌరవం వేరేగా చెప్పనవసరం లేదు అయితే వైసీపీ విధాన నిర్ణయాల మీద జగన్ మీడియాతో ఎక్కువగా మాట్లాడడమే కాకుండా జగన్ కంటే తానే ఎక్కువ అన్నట్లుగా చేసిన ఓవర్ యాక్షన్ కి ప్రతిఫలంగా కొంత దూరం అయ్యారు. అక్కడితో ఆగకుండా 2014 ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతుందని టీడీపీ అనుకూల మీడియాలో జోస్యాలు చెప్పడంతో ఆయన వైసీపీ నుంచి పూర్తిగా దూరం కావాల్సివచ్చింది.

బాబు మెప్పు కోసం….

ఇక చంద్రబాబు మెప్పు కోసం గత అయిదేళ్ళూ చాలా చేసిన సబ్బం హరి ఎట్టకేలకు టీడీపీ టికెట్ సంపాదించి భీమిలీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పటికీ ఆయన చంద్రబాబే రేపటి సీఎం అంటూ విశాఖ ఆక్టోపస్ హోదాలో జోస్యాలు చెబుతూ ఉంటారు. మరో వైపు జగన్ నేడో రేపో దిగిపోకతప్పదని అంటున్నదీ సబ్బం హరి ఒక్కరే. జమిలి ఎన్నికల గురించి ఎక్కువగా మాట్లాడుతున్నదీ ఆయనే. ఏపీలో ఎపుడు ఎన్నికలు జరిగినా చంద్రబాబు గెలవడం ఖాయమని చెబుతున్న సబ్బం హరి మార్క్ జోస్యాలు విశాఖ తమ్ముళ్ళే నమ్మడంలేదు. అందుకే అక్కడ నుంచి పెద్ద ఎత్తున వలసలు వైసీపీ వైపుగా సాగుతున్నాయి.

ఒక్క పోటుతో …..

విశాఖలో ఉంటూ జగన్ సర్కార్ మీద రెచ్చిపోతున్న సబ్బం హరి ఇపుడు ఒక ఇష్యూలో దొరికారు. ఆయన మునిసిపాలిటీ స్థలాన్ని ఆక్రమించి ఇల్లు కట్టుకున్నారన్నది అందరికీ తెలిసిందే. ఇది జరిగి కూడా పాతికేళ్ళు దాటుతోంది. ఇపుడు హఠాత్తుగా గుర్తుకొచ్చినట్లుగా జీవీఎంసీ అధికారులు ఒక్క పోటుతో దానిని కూల్చేశారు. దీని మీద సబ్బం హరి మాట్లాడుతూ తనకు నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చుతారు అంటూ మండిపడ్డారు. అయితే ఇది మునిసిపాలిటీకి చెందిన స్థలం అని పన్నెండు అడుగులు ఆక్రమించి మరీ ముందుకు సబ్బం హరి అక్రమ నిర్మాణాలు చేశారని అధికారులు అంటున్నారు. తమ నేత మీద ప్రభుత్వం తీసుకున్న కక్ష సాధింపు చర్య ఇది అని సబ్బం హరి అనుచరులు అంటున్నారు. దీని మీద తేల్చుకుంటామని చెబుతున్నారు. అయితే ఇది జస్ట్ శాంపిల్ మాత్రమేనని వైసీపీ నేతలు అంటున్నారు. హరి మేయర్ గా ఉండగా అయిదేళ్ల పాలనలో చేసిన అక్రమాలు ఒక్కోటీ బయటకు తీస్తామని చెబుతున్నారు. అదే కనుక జరిగితే హరి టార్గెట్ అవడం ఖాయమే. మరి విశాఖలో టీడీపీ బాగా తగ్గుతున్న వేళ హరి వైపు గొంతెత్తి అరచే తమ్ముళ్ళు ఉంటారా.

Tags:    

Similar News