భీమీలీ టీడీపీకి రాజు దొరికాడు…?

విశాఖ జిల్లాలో భీమిలీ నియోజకవర్గం అత్యంత ప్రతిష్టాత్మకమైనది. తెలుగుదేశానికి కంచుకోట. ఈ నియోజకవర్గంలో చివరి నిముషంలో టికెట్ తెచ్చుకున్నా కూడా అవతల పార్టీ అభ్యర్ధికి మూడు చెరువుల [more]

Update: 2021-07-04 00:30 GMT

విశాఖ జిల్లాలో భీమిలీ నియోజకవర్గం అత్యంత ప్రతిష్టాత్మకమైనది. తెలుగుదేశానికి కంచుకోట. ఈ నియోజకవర్గంలో చివరి నిముషంలో టికెట్ తెచ్చుకున్నా కూడా అవతల పార్టీ అభ్యర్ధికి మూడు చెరువుల నీళ్ళు తాగించే సామర్ధ్యం టీడీపీ అభ్యర్ధికి ఉంటుంది. దానికి అచ్చమైన ఉదాహరణ మాజీ ఎంపీ సబ్బం హరి. 2019 ఎన్నికల్లో ఆయన లాస్ట్ మినిట్ లో భీమిలీ నుంచి పోటీ చేసినా కేవలం తొమ్మిది వేల ఓట్ల తేడాతోనే ఓటమి పాలు అయ్యారు. అది కూడా వైసీపీకి ఎంతో ఊపు ఉన్న పరిస్థితుల్లో అవంతి శ్రీనివాస్ కి సొంత బలం ఉన్నచోట అన్ని ఓట్లు వచ్చాయి. అలాంటి భీమిలీలో హరి మరణం తరువాత ఇంచార్జి లేకుండా పోయారు. ఇపుడు మాజీ ఎంపీపీని తెచ్చి ఇంచార్జిని చేశారు.

అదే బలం…?

భీమిలీలో బలమైన సామాజిక వర్గంగా కాపులు ఉన్నారు. ఇప్పటికి నాలుగు సార్లుగా ఆ సామాజిక వర్గం నుంచే వరసగా ఎమ్మెల్యేలుగా గెలుస్తున్నారు. దాంతో టీడీపీ కూడా మరోసారి ఆ వర్గానికే పెద్ద పీట వేసింది. సబ్బం హరి వెలమ సామాజికవర్గానికి చెందిన నేత. ఇపుడు అవంతి శ్రీనివాసరావుకు ధీటు అయిన కాపు నేతను టీడీపీ ఎంపిక చేసింది. గతంలో టీడీపీలో ఉంటూ ఎంపీపీగా గెలిచిన కోరాడ రాజబాబు ప్రజారాజ్యం నుంచి 2009 ఎన్నికల్లో భీమిలీ ఎమ్మెల్యే అభ్యర్ధిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరువాత వైసీపీలో చేరిన ఆయన టికెట్ దక్కకపోవడంతో టీడీపీలోకి తిరిగి వెళ్లిపోయారు. ఇన్నాళ్ళకు ఆయనకు అవకాశం వచ్చిందని క్యాడర్ ఆనందిస్తున్నారు.

వీళ్ళూ రెడీనా….?

అయితే భీమిలీ సీటు మీద చాలా మంది కన్ను ఉంది. రాజబాబుని ఈ రోజుకు ఇంచార్జిగా నియమించినా భవిష్యత్తుల్లో మార్పుచేర్పులు ఉంటాయని కూడా అంచనా వేస్తున్నారు. మత్స్య కారుల కోటాలో తనకు సీటు ఇవ్వాలని టీడీపీ రాష్ట్ర ప్రదాన కార్యదర్శి గంటా నూకరాజు కోరుకుంటున్నారు. అదే విధంగా టీడీపీ అర్బన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పాశర్ల ప్రసాద్ కూడా భీమిలీ నుంచి పోటీ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు 2024 నాటికి టీడీపీలో చురుకుగా ఉంటే ఆయనకే టికెట్ అన్న మాట కూడా ఉంది. వీరందరి కంటే కూడా బాలయ్య చిన్నల్లుడు భరత్ కూడా ఇదే సీటు మీద కన్నేశారని టాక్ నడుస్తోంది.

ఈసారి కష్టమేనా …?

భీమిలీలో వైసీపీ మరోసారి గెలవాలి అంటే కష్టపడాల్సి ఉంటుందని అంటున్నారు. ఇటీవల జరిగిన లోకల్ బాడీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధులు పెద్ద సంఖ్యలో గెలిచారు. అలాగే కార్పోరేషన్ ఎన్నికల్లో కూడా ఎనిమిది డివిజన్లకు గానూ అయిదు టీడీపీ పరం అయ్యాయి. నాయకులతో పని లేకుండా బలమైన క్యాడర్ ఇక్కడ టీడీపీకి ఉంది. దాంతో ఎన్నికల నాటికి అనుకూలంగా గాలి వీస్తే భీమిలీలో మరోమారు సైకిల్ జోరుగా సాగడం ఖాయమని అంటున్నారు. ఏది ఏమైనా అవంతి ఇప్పటినుంచే తన నియోజకవర్గం మీద ఒక కన్ను వేసి ఉండకపోతే మాత్రం చేజేతులా సీటు కోల్పోవలసి ఉంటుందని కూడా అంటున్నారు.

Tags:    

Similar News