ఈ టీడీపీ నేత‌లు నేడు ఎక్కడ దాక్కున్నారు ?

ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో టీడీపీ అధికారంలో ఉండ‌గా నానా హ‌డావిడి చేసిన నేత‌లు ఇప్పుడు ఫుల్ సైలెంట్ అయిపోయారు. 2014 ఎన్నిక‌ల్లో టీడీపీ.. వైసీపీకి జిల్లాలో ఏ మాత్రం [more]

Update: 2021-03-03 12:30 GMT

ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో టీడీపీ అధికారంలో ఉండ‌గా నానా హ‌డావిడి చేసిన నేత‌లు ఇప్పుడు ఫుల్ సైలెంట్ అయిపోయారు. 2014 ఎన్నిక‌ల్లో టీడీపీ.. వైసీపీకి జిల్లాలో ఏ మాత్రం స్పేస్ ఇవ్వలేదు. పార్టీ అధికారంలో ఉండ‌గా గెలిచిన వాళ్లు… ఇత‌ర ప‌ద‌వుల్లో ఉన్నోళ్లు… గ‌త ఎన్నిక‌ల్లో టిక్కెట్లు ఆశించినోళ్లు చేసిన హంగామాకు అంతూ పంతూ లేదు. చాలా మంది నేత‌ల ఓవ‌ర్ యాక్షనే పార్టీ గ‌త ఎన్నిక‌ల్లో జిల్లాలో చావు దెబ్బ కొట్టేసింది. ఎన్నిక‌ల్లో జిల్లా ఓట‌రు ఇచ్చిన తీర్పుతో ఒక్కో నాయ‌కుడికి దిమ్మతిరిగిపోయి మైండ్ బ్లాక్ అయ్యింది. దీంతో చాలా మంది గ‌త ఎన్నిక‌ల‌కు ముందు సీట్లు ఆశించి హంగామా చేసినోళ్లు.. ఎన్నిక‌ల్లో ఓడినోళ్లు గ‌ప్‌చుప్ అన్నట్టుగా వ్యవ‌హ‌రిస్తున్నారు.

బోళ్ల రాజీవ్ :

గ‌త ఎన్నిక‌ల‌కు ముందు జిల్లాలో టీడీపీకి బ‌ల‌మైన కుటుంబానికి చెందిన ముళ్లపూడి కుటుంబానికి చెందిన బోళ్ల రాజీవ్ ( దివంగ‌త కేంద్ర మాజీ మంత్రి బోళ్ల బుల్లిరామ‌య్య మ‌న‌వ‌డు) ఏలూరు పార్లమెంటు సీటు త‌న‌దే అంటూ హ‌ల్‌చ‌ల్ చేశారు. ఏలూరు ఎంపీ మాగంటి బాబుకు పార్టీ చాలా ఛాన్సులు ఇచ్చింద‌ని, త‌న‌కే ఎంపీ సీటు ఇవ్వాల‌ని నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌ర్యటిస్తూ మాగంటి వ్యతిరేక వ‌ర్గాన్ని ప్రత్యక్షంగానో లేదా ప‌రోక్షంగానో ఎంక‌రేజ్ చేశారు. చంద్రబాబు మాత్రం సిట్టింగ్ ఎంపీ మాగంటినే కంటిన్యూ చేయ‌గా ఆయ‌న ఓడిపోయారు. బోళ్లకు నిజంగా టీడీపీ సీటు కావాలంటే ఇదే మంచి టైం.. ఆయ‌న ప్రజ‌ల్లోకి వ‌చ్చి పార్టీ త‌ర‌పున తిరుగుతూ కేడ‌ర్‌కు అందుబాటులో ఉంటే వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న‌కే సీటు వ‌చ్చేది. ఈ టైంలో చేతి చ‌మురు వ‌దిలించుకోవ‌డం త‌ప్పా ఏముంది అనుకున్నారేమో గాని రాజీవ్ బ‌య‌ట‌కు రావ‌డం లేదు. మ‌ధ్యలో వైసీపీలోకి వెళ్లే ప్రయ‌త్నాలు కూడా జ‌రిగాయి. త‌ర్వాత ఏమైందో సైలెంట్ అయిపోయారు. బోళ్ల వ‌ర్గం మాత్రం పార్టీకి వీడుతుండ‌డం లేదా టీడీపీకి దూరంగా ఉండ‌డం చేస్తోంది.

తోట జ‌గ‌దీష్ :

మాజీ రాజ్యస‌భ స‌భ్యురాలు తోట సీతారామ ల‌క్ష్మి త‌న‌యుడు అయిన తోట జ‌గ‌దీష్ సైతం పార్టీ అధికారంలో ఉండ‌గా.. త‌న త‌ల్లి ఎంపీగా ఉండ‌డంతో కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌ట్టు కోసం ప్రయ‌త్నాలు చేశారు. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉండ‌గానే త‌న‌కూ సీటు కావాల‌ని క్యాస్ట్ ఈక్వేష‌న్లు తెర‌మీద‌కు తెచ్చారు. ఎన్నిక‌ల‌కు ముందు తాడేప‌ల్లిగూడెం లేదా జిల్లాలో మరో సీటు విష‌యంలో జ‌గదీష్ పేరు వినిపించింది. ఎన్నిక‌ల్లో పార్టీ చిత్తుగా ఓడిపోవ‌డం.. ఇటు త‌న త‌ల్లి ఎంపీ ప‌ద‌వి కూడా ముగియ‌డంతో జ‌గ‌దీష్ రాజ‌కీయాల‌కు దూరంగా త‌న వ్యాపారాలు తాను చేసుకుంటున్నారు. ఇటీవ‌ల పార్టీ తోటకు కేవ‌లం న‌ర‌సాపురం పార్లమెంట‌రీ పార్టీ అధ్యక్షురాలి ప‌ద‌వితో స‌రిపెట్టడంతో కూడా ఈ ఫ్యామిలీ అసంతృప్తితో ఉంది.

ఈలి నాని పార్టీకి రారాం చెప్పేసిన‌ట్టేనా ?

మాజీ ఎమ్మెల్యే ఈలి నాని గ‌త ఎన్నికల్లో అప్పటి జ‌డ్పీచైర్మన్ ముళ్లపూడి బాపిరాజుతో పోటీ ప‌డి మ‌రీ గూడెం ఎమ్మెల్యే సీటు ద‌క్కించుకున్నారు. పార్టీ ఓడిపోయాక అస‌లు టీడీపీతో నాకేం సంబంధం లేద‌న్నట్టుగా వ్యవ‌హ‌రించారు. పైగా మంత్రి చెరుకువాడ‌తో చెట్టాప‌ట్టాలేసుకుని తిరుగుతుండ‌డంతో విసిగిపోయిన బాబు గూడెం ఇన్‌చార్జ్ ప‌ద‌వి నుంచి ఆయ‌న్ను పీకేసి వ‌ల‌వ‌ల బాబ్జీకి అప్పగించారు. ఈలి నాని పార్టీ కార్యక్రమాల‌కు పూర్తి దూరంగా ఉండ‌డంతో ఆయ‌న ఎప్పుడైనా పార్టీ వీడ‌వ‌చ్చని అంటున్నారు.

మొడియం శ్రీనివాస్‌:

సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండి కూడా సీటు ద‌క్కించుకోలేక పోయిన పోల‌వ‌రం మాజీ ఎమ్మెల్యే మొడియం శ్రీనివాస్‌కు ఇప్పుడు పార్టీలో దారులు మూసుకుపోతున్నాయి. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తీవ్ర వ్యతిరేక‌త తెచ్చుకున్న మొడియం ఇప్పుడు పోల‌వ‌రంలో మ‌ళ్లీ ఛాన్స్ రాదా ? అని ఆశ‌తో ఉన్నా అక్కడ గ‌త ఎన్నిక‌ల్లో ఓడిన బొరగం శ్రీను స్ట్రాంగ్ అయిపోవ‌డంతో మొడియం టైం కోసం వేచి చూడ‌డం త‌ప్పా టీడీపీ నుంచి బ‌య‌ట‌కు రాలేని ప‌రిస్థితి.

వీళ్లంతా కూడా…..

వీళ్లే కాకుండా మాజీ ఎమ్మెల్యేలు బూరుగుపల్లి శేషారావు, బండారు మాధ‌వ‌నాయుడు, పుల‌ప‌ర్తి అంజిబాబుతో పాటు జ‌డ్పీ మాజీ చైర్మన్ ముళ్ల‌పూడి బాపిరాజు లాంటి నేత‌ల్లో చాలా మంది ఇప్పటి నుంచే పార్టీ కోసం క‌ష్టప‌డినా ఉప‌యోగం ఉండ‌దు.. ఇంత క‌ష్టప‌డినా బాబు చివ‌ర్లో ఎవ‌రికి సీటు ఇస్తారో ? చెప్పలేం.. ఎన్నిక‌ల‌కు యేడాది ముందు వ‌ర‌కు సైలెంట్‌గానే ప‌ని కానిచ్చేద్దాం అని పార్టీ స‌న్నిహితుల‌తో అంటున్నార‌ట‌. టీడీపీ క‌ష్టాల్లో ఉంటే ప‌ట్టదు కాని.. సీటే కావాల‌ని ప‌శ్చిమ టీడీపీ నేత‌లు చేస్తోన్న రాజ‌కీయానికి చంద్రబాబు చిక్కుతారా ? లేదా వీరిని సైడ్ చేసేస్తారా ? అన్నది కాల‌మే నిర్ణయించాలి.

Tags:    

Similar News