గుట్టు చప్పుడు కాకుండా…?

రాజకీయ పార్టీలు హుజూరాబాద్ ను ఒక ఉప ఎన్నికగా చూడటం లేదు. రాష్ట్రవ్యాప్తంగా భవిష్యత్ అవకాశాలను బేరీజు వేసుకుంటున్నాయి. తమ భావి ప్రజాస్వామ్య సమరానికి లిట్మస్ టెస్టుగా [more]

Update: 2021-08-26 12:30 GMT

రాజకీయ పార్టీలు హుజూరాబాద్ ను ఒక ఉప ఎన్నికగా చూడటం లేదు. రాష్ట్రవ్యాప్తంగా భవిష్యత్ అవకాశాలను బేరీజు వేసుకుంటున్నాయి. తమ భావి ప్రజాస్వామ్య సమరానికి లిట్మస్ టెస్టుగా అంచనా వేసుకుంటున్నాయి. బలాబలాలలో తీవ్రమైన వ్యత్యాసం చూపించడం ద్వారా ప్రత్యర్థులు దరిదాపుల్లో లేకుండా చూసుకోవాలనేది అధికార టీఆర్ఎస్ పార్టీ వ్యూహం. ఈ ఒక్క స్థానంలో నెగ్గి చూపించడం ద్వారా నైతికంగా ప్రతిపక్ష స్థానంలోకి రావాలనేది బీజేపీ ఆశ. మొత్తానికి మొత్తంగా చేతులెత్తేయడం కాకుండా ప్రధాన ప్రత్యర్థులిద్దరకీ దీటుగా నిలవడం ద్వారా తమ అవకాశాలను కాపాడుకోవాలనేది కాంగ్రెసు లక్ష్యం. ఇందుకోసం సామ దాన భేదోపాయాలన్నిటినీ ప్రయోగిస్తున్నాయి పార్టీలు. అందుకే ఇది కేవలం ఒక శాసనసభ స్థానానికి జరుగుతున్న ఎన్నిక స్థాయిని మించిపోయింది. నిజంగానే ఒక కొలబద్దగా ఈ ఎన్నిక నిలుస్తుందా? అన్నిపార్టీలను మాయలో పెడుతుందా? అన్నది తేలాలి. ఏదేమైనా ఆ నియోజకవర్గం ప్రజలకు మాత్రం పండుగ వచ్చింది. సామాజిక అవసరాలు మొదలు, వ్యక్తిగత ప్రయోజనాల వరకూ అందరికీ అన్నీ సమకూర్చి పెట్టే సాధనంగా మారింది.

‘బంధు’మిత్రులకు…

వివిధ రకాల ప్రభుత్వ పథకాలు హుజూరాబాద్ లో సంతృప్తస్థాయికి అమలు చేయాలని రాష్ట్రప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. దళిత బంధు పథకం కేవలం ఈ ఎన్నికను దృష్టిలో పెట్టుకునే రూపొందించారు. రాష్ట్రవ్యాప్తంగా ఏవిధంగా అమలు చేస్తారనేది పక్కనపెడితే ఇక్కడ మాత్రం సక్సెస్ అయ్యే సూచనలు కానవస్తున్నాయి. వెయ్యికోట్ల రూపాయలు ఇప్పటికే ప్రభుత్వం నుంచి విడుదలయ్యాయి. మరో వెయ్యి కోట్లు నెలరోజుల వ్యవధిలోపుగానే విడుదల చేసేందుకు సర్కారు సిద్ధమవుతోంది. మొదటి వెయ్యికోట్లు ఖర్చు అయిన వెంటనే మిగిలిన సొమ్మును విడుదల చేయాలని కేసీఆర్ సూచించారు. అమలు బాధ్యతను అధికారులకు మాత్రమే అప్పగించకుండా ఆర్థిక శాఖమంత్రి హరీశ్ రావు చేతుల్లోనే పెట్టడం విశేషం. రాజకీయ లెక్కలతో స్కీమును పక్కాగా ముడిపెట్టడమే ఇందులోని ఉద్దేశం. ప్రతి లబ్ధిదారు కనీసం పది కుటుంబాలను ప్రభావితం చేసేలా చూడాలని అంతర్గతంగా లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. దళిత బంధు కారణంగా ఇతర వర్గాలు పార్టీకి దూరం కాకుండా ఇప్పటికే ఉన్న రకరకాల స్కీములను కులాలు, వర్గాల వారీగా గరిష్ఠస్థాయి ఆచరణకూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఇందుకోసం దాదాపు అయిదువేల కోట్ల రూపాయలను వెచ్చించనున్నట్లు సమాచారం. అయితే ఇది బహిరంగ ప్రచారం జరగకుండా లబ్ధిదారులకు చేరిపోవాలని భావిస్తున్నారు. ప్రతి కుటుంబానికి వ్యక్తిగత ప్రయోజనం చేకూరడం వల్ల వారంతా పార్టీకి అండగా నిలుస్తారనేది ఆశ. అందుకే క్లస్టర్ల వారీగా కులాల నాయకులకు బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఆయా వర్గాలు, కులాల్లో ఎంతమందికి ప్రభుత్వ పథకాలు ప్రయోజనాలు, కొత్తగా నగదు లబ్ధి సమకూరిందనే వ్యవహారాలను పార్టీ బాధ్యులు నేరుగా పరిశీలిస్తారు. అమలుకు అధికారులకు సహకరిస్తారు.

హరీశ్ ద్విముఖ పాత్ర…

ఈ మొత్తం వ్యవహారాన్ని హరీశ్ రావు స్వయంగా పర్యవేక్షిస్తారు. ఆర్థికమంత్రిగా అధికారిక హోదాలో హుజూరాబాద్ ను రోజువారీ సమీక్షలో చేర్చుకున్నారాయన. ఈవిషయంలో హరీశ్ రావు ద్విముఖ పాత్ర తీసుకుంటున్నారు. నాయకులను గుర్తించి వారికి గ్రామాలు, వార్డులు, బూత్ ల వారీ సామాజిక వర్గాలుగా కేటాయింపులు చేస్తున్నారు. ప్రభుత్వ స్కీముల రూపంలోని ప్రతి ప్రయోజనం ఓటరుకు పక్కాగా చేరేలా చూడటమే ఈ క్లస్టర్ ఏర్పాటులోని ఉద్దేశం. సాధారణంగా అధికారులు రాజకీయ పార్టీల కార్యకర్తలు, నాయకులు తమపై పెత్తనం చేయడాన్ని సహించలేరు. ఏదో రూపంలో కొంతమేరకు గండి కొ్ట్టేఅవకాశాలుంటాయి. నిబంధనల సాకుతో నీరుగార్చే ప్రమాదం ఉంటుంది. అందువల్లనే నేరుగా హరీశ్ రావు మంత్రిగా సమీక్షలో ఉంటూ అధికారులకు అనివార్యత కల్పిస్తున్నారు. నిబంధనలు, నియమాలు అంటూ తాత్సారం చేయకుండా ప్రభుత్వ ఉద్దేశం మేరకు పనిచేసేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. స్కీముల విషయంలో అర్హతల పేరుతో ఫైళ్లను పక్కనపెట్టకుండా దరఖాస్తు చేసుకున్న వారందరికీ ఉదారంగా మంజూరు చేయాలనే మౌఖిక ఆదేశాలు ఇప్పటికే జారీ అయిపోయాయి. లబ్దిదారులను గుర్తించి, దరఖాస్తు చేయించే బాధ్యతను ద్వితీయశ్రేణి నాయకులు, సామాజిక వర్గాల నేతలు తీసుకుంటున్నారు. జాబితాను పైనల్ చేసి, మంజూరు చేయించడం హరీశ్ రావు నేతృత్వంలో సాగుతోంది. ఈ మొత్తం క్రమంలో ఇతర నియోజకవర్గాల ప్రజాప్రతినిధులపై ఒత్తిడి పెరిగేందుకు అవకాశం ఉంది. దళిత బంధు సృష్టించిన ప్రకంపనలు అవే. అందువల్లనే ఇతర స్కీములను పెద్దగా ప్రచారం జరగకుండానే వ్యక్తిగతంగా నియోజకవర్గంలో అందరికీ చేరేలా చూస్తున్నారు. దీనివల్ల రాష్ట్రంలోని మిగిలిన ఎమ్మెల్యేలు ఒత్తిడికి గురికారు. తమ ప్రజలనుంచి ప్రజాప్రతినిధులపై డిమాండ్లు పెరగవు. అదికార టీఆర్ఎస్ కు విషమపరీక్షగా మారిన హుజూరాబాద్ ను అన్నిపథకాల సమీకృత అమలుకు ఒక మోడల్ గా మలుస్తున్నారు.

అన్ని దారులూ అక్కడికే..

బీజేపీ, కాంగ్రెసులు హుజూరాబాద్ విషయంలో కిందుమీదులవుతున్నాయి. బీజేపీ అభ్యర్థిగా ఉన్న ఈటల రాజేందర్ పై ఒత్తిడి పెరుగుతోంది. వ్యక్తిగత ప్రతిష్ఠతో పాటు కమలం పార్టీకి రాష్ట్రంలో మంచి ఊపు తెచ్చే ఎన్నిక ఇది. ఇతర ప్రాంతాలనుంచి చేపట్టే పాదయాత్రలు, కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రచారం వంటివి హుజూరాబాద్ లో ముగిసేట్లుగా ప్లాన్ చేసుకుంటోంది బీజేపీ. రాజేందర్ రాజీనామా చేసే సమయానికి ఇక్కడ ఆయనదే పై చేయి. దాదాపు 70 శాతం మంది ప్రజలు ఆయనకు మద్దతిస్తున్నట్టుగా టీఆర్ఎస్ అంతర్గతంగా నిర్వహించుకున్న సర్వేలో తేలింది. అయితే ప్రభుత్వం జోరు పెంచిన తర్వాత క్రమేపీ పరిస్థితుల్లో మార్పు వస్తోంది. అధికారపార్టీ హరీశ్ నేతృత్వంలో పుంజుకొంటోంది. ఈటల మళ్లీ నెగ్గాలని కోరుకుంటున్న ప్రజల సంఖ్య తాజా సర్వేల ప్రకారం 55 శాతానికి పడిపోయినట్లు చెబుతున్నారు. కాంగ్రెసు పార్టీ అయిదు శాతం ఓట్లు తెచ్చుకోవచ్చని అంచనా. మొత్తం 60 శాతం ఓట్లు ప్రత్యర్థుల చేతిలో ఉంటే, టీఆర్ఎస్ చేతిలో 40 శాతం ఓట్లు ఉన్నాయి. దీనిని మరో 15 శాతం పెంచుకోగలిగితే రాజేందర్ పరాజయం పాలుకాక తప్పదని అధికారపార్టీ అంచనా వేసుకుంటోంది. ఈటల ప్రాబల్యం క్రమేపీ తగ్గుతుంటే, టీఆర్ఎస్ పలుకుబడి పెరుగుతోంది. కాంగ్రెసు ఇంకా పూర్తిగా దృష్టి పెట్టలేదు. సరైన అభ్యర్థిని ఎంచుకుని సామాజికంగా తలపడితే కాంగ్రెసు నిర్ణయాత్మకపాత్రలోకి మారుతుందంటున్నారు. ఏదేమైనా ఈ బరి.. వచ్చే ఎన్నికల నాటికి రాజకీయాల గురిగా చెప్పుకోవాలి.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News