సెగ మామూలుగా లేదుగా..?

మహారాష్ట్ర ఎన్నికలు ముఖ్యంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ కు సవాల్ గా మారాయి. ఐదేళ్ల కాలం ముఖ్యమంత్రిగా పూర్తి చేసుకున్న ఘనత దేవేంద్ర ఫడ్నవిస్ [more]

Update: 2019-09-28 18:29 GMT

మహారాష్ట్ర ఎన్నికలు ముఖ్యంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ కు సవాల్ గా మారాయి. ఐదేళ్ల కాలం ముఖ్యమంత్రిగా పూర్తి చేసుకున్న ఘనత దేవేంద్ర ఫడ్నవిస్ కే దక్కింది. మరోసారి తానే ముఖ్యమంత్రి నంటూ దేవేంద్ర ఫడ్నవిస్ ప్రకటించుకున్నారు. కానీ ఫడ్నవిస్ కు రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న నియోజకవర్గాల నుంచి వత్తిడి పెరుగుతుంది. ముఖ్యంగా మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉండి తెలంగాణ రాష్ట్రం పక్కనే ఉన్న నియోజకవర్గాల నుంచి వత్తిడి పెరుగుతోంది. తెలంగాణ పథకాలను మహారాష్ట్రలోనూ అమలు చేయాలని నియోజకవర్గాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

తెలంగాణ పథకాలను….

తెలంగాణ సరిహద్దుల్లో ఐదు నియోజకవర్గాలున్నాయి. ఈ నియోజకవర్గాల ప్రజలు తెలంగాణ ప్రభుత్వ పథకాల పట్ల ఆకర్షితులయ్యారు. వీరంతా గతంలో తమను తెలంగాణలో కలిపేయాలంటూ కోరారు. కేసీఆర్ ను కలసి అప్పట్లో ఈ మేరకు వినతి పత్రం సమర్పించారు. అయితే ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రంలో ప్రాంతాలను కలపడం అంత సులువు కాదు. దీంతో ఆ ప్రాంత ప్రజలంతో నిరాశతో వెనుదిరిగి వెళ్లిపోయారు. మహారాష్ట్రలో ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదని వారి భావన. అందుకోసమే తాము తెలంగాణలో కలుస్తామని ముందుకు వచ్చారు.

ఇక్కడ అమలు చేయాలంటూ….

తెలంగాణ పథకాలు మహారాష్ట్ర ఎన్నికల్లో హాట్ టాపిక్ గా మారాయి. తెలంగాణ సరిహద్దు ఉన్న జిల్లాల్లో ఈ సెగ ఎక్కువగా ఉంది. తెలంగాణలో కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయానికి 24 గంటల విద్యుత్తు సరఫరా, రైతు బంధు, రైతు బీమా, ఆసరా, మిషన్ భగీరథ వంటి పథకాలు సరిహద్దు ప్రాంత ప్రజలను ఆకర్షితులను చేశాయి. దీంతో వీరంతా ఇప్పుడు ఆ పథకాలను అమలుచేయాలని లేకుంటే తాము పోటీకి దిగుతామని మహరాష్ట్రలోని పార్టీలకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

పోటీకి దిగుతామని…..

అంతటితో ఆగకుండా తెలంగాణ రాష్ట్ర సమితి నుంచే పోటీ చేస్తామని చెబుతున్నారు. ఈ మేరకు నిజామాబాద్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్థన్ తో కలసి ఇటీవల ఆ ప్రాంత ప్రజలు ముఖ్యమంత్రి కేసీఆర్ ను కూడా కలిశారు. తాము నిజాం పాలనలో తెలంగాణలోనే కలిసి ఉన్నామని, తర్వాతే తమను మహారాష్ట్రలో చేర్చారని వారు చెబుతున్నారు. అసెంబ్లీ లో తమ వాయిస్ వినపడాలంటే టీఆర్ఎస్ తరుపున బరిలోకి దిగాల్సిందేనని వారంటున్నారు. ఈ ప్రాంత ప్రజలు బీజేపీ, శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ నేతలను కూడా కలసి తమ గోడును వివరించనున్నారు. తమను తెలంగాణలోనైనా కలపండి, లేదంటే అక్కడి పథకాలను అమలు చేయమని కోరుతున్నారట. దీంతో తెలంగాణ రాష్ట్రం అమలు చేస్తున్న పథకాల ప్రభావం మహారాష్ట్ర ఎన్నికలపై చూపే అవకాశముందంటున్నారు. తక్కువ నియోజకవర్గాల్లో ఈ ప్రభావం ఉన్నప్పటికీ ప్రధాన పార్టీల్లో మాత్రం తెలంగాణ పథకాలు గుబులు రేకెత్తిస్తున్నాయి.

Tags:    

Similar News