ఆల్ హ్యాపీస్.. ఆ రెండూ తప్ప...!

Update: 2018-06-01 13:30 GMT

కొత్త గొంతుక.. నూతన అస్తిత్వం మొదలై నాలుగేళ్లు. మహోద్యమం స్థానంలో మొలచిన ఆశల రెక్కలు. ఆకాశం ఎత్తున అంచనాలు. అలల్లా దూసుకొచ్చే కొత్త డిమాండ్లు. అన్నిటినీ నిభాయించుకుని పరిపాలన రథాన్ని గాడిలో పెట్టడం ఒక అద్భుతం. నిత్యచైతన్య స్రవంతిలా ప్రవహించే ఉద్యమాల పురుటిగడ్డ తెలంగాణలో శాంతిభద్రతల పరిరక్షణ కత్తిమీద సామే. భిన్న సంస్కృతులు, సంప్రదాయాల మేలు కలయికగా విరాజిల్లే మినీభారత్. ఆంధ్రా ప్రాంతం నుంచి వచ్చి స్థిరపడిన వారిలో ఒక భరోసాకల్పించడమొక పరీక్ష. విభజనతో తమకేదో అన్యాయం జరిగిందనే భావనలో ఉన్నవారిని సముదాయించి ఇది కేవలం భౌగోళిక విభజనే అని చర్యల ద్వారా చాటిచెప్పడం అసిధారావ్రతం. వీటన్నిటినీ నెగ్గుకుని రాగలిగింది కాబట్టే తెలంగాణ నేడు ఒక ఫలవంతమైన రాష్ట్రంగా నిలిచింది. పరిపాలన, ప్రజాసంక్షేమం, ప్రగతి విషయాల్లో ఫస్టు క్లాసు మార్కులు తెచ్చుకోగలిగింది. నూటికి అరవైపాళ్లు అనుకున్న లక్ష్యాల దిశలో అడుగులు వేస్తోంది. పాలకునిగా కేసీఆర్ కు తోడు ప్రతి పనిలోనూ సహకరించిన ప్రజలదే ఈ విజయం.

సంక్షేమం..సాధికారత..

కొత్త రాష్ట్రం ప్రస్థానం అంటే పురుటి నుంచి పిల్లాడు ఎదగడం వంటిదే. బాలారిష్టాలు అనేకం ఉంటాయి. ఉద్యోగుల పంపకాలు మొదలు ఆస్తుల విభజన వరకూ అన్నీ సమస్యలే. అందులోనూ ఒకరు పోరాడి సాధించుకున్న రాష్ట్రం. మరొకరికి ఇష్టం లేని కష్టం. అందుకే గిల్లికజ్జాలు, పేచీలు, చిక్కుముడులు చాలానే ఉంటాయి. అయినప్పటికీ వాటన్నిటినీ ఒక్కటొక్కటిగా పరిష్కరించుకుంటూ నిలదొక్కుకోగలిగింది. సంక్షేమ పథకాల అమలు విషయంలో కేసీఆర్ రికార్డు సృష్టించారనే చెప్పవచ్చు. పెళ్లిళ్లకు ఆర్థిక సాయం మొదలు పింఛన్ల వరకూ అన్నిటా కొత్త ఒరవడి. ప్రతి ఇంటికీ ఏదో ఒక సర్కారు పథకం లబ్ధి చేకూరాలనే లక్ష్యంతో సంక్షేమ పథకాలను సంతృప్తస్థాయికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. అమలులో చిన్నచితక లోపాలున్నప్పటికీ ఆశయం గొప్పది కావడంతో పెద్దగా ఆటంకాలు ఎదురుకాలేదు. గొర్రెల పంపిణీ వంటి స్కీముల విషయంలో ప్రభుత్వం ఆశించినదానికి భిన్నంగా జరిగింది. కానీ రైతుబంధు పథకం వ్యవసాయరంగానికి నూతన దిశానిర్దేశం చేసింది. పదిహేను శాతం వరకూ ఉన్న పెద్ద రైతులు, భూమి ఉండి ఉద్యోగ,వ్యాపారాలు చేస్తున్న వర్గాలకు అనుచిత లబ్ధి కలిగిందనే విమర్శలున్నాయి. అయినప్పటికీ 85 శాతం లబ్ధిదారులు అర్హులే కావడం రైతుబంధు గొప్పతనం. ఇతర రాష్ట్రాలు సైతం ఈపథకం అమలుకు సంబంధించి అధ్యయనం చేయకతప్పని అనివార్యతను తెలంగాణ కల్పించింది. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వంటి పథకాలు తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తుకు సాధికారత కల్పించే అంశాలు. కాళేశ్వరం వంటి భారీ ప్రాజెక్టులూ నీటి కడగండ్లకు శాశ్వత పరిష్కారం సూచించే దిశలో రూపకల్పన చేసినవే.

ఉపాధి..ఉత్సాహం...

నగరీకరణ అత్యంత వేగంగా సాగుతున్న రాష్ట్రం తెలంగాణ. వలసవచ్చే వారికి ఉపాధి, చదువుకున్న వారికి సరైన అవకాశాలు, మౌలిక వసతుల కల్పన రాష్ట్రానికి సవాల్ . దీనిని అధిగమించేందుకు స్టార్టప్ ఆలోచనలు ప్రోత్సహించేందుకు ప్రత్యేక కేంద్రాలు నెలకొల్పారు. పెట్టుబడులను ఆకర్షించడానికి పరిశ్రమల స్థాపనకు సులభమైన విధానాలు ప్రవేశపెట్టారు. ఇక్కడ ఉన్న వాతావరణ అనుకూలత, సర్కారు అందచేస్తున్న సాయంతో వినూత్నమైన ప్రాజెక్టులను ఆకట్టుకోవడం లో ఇతర రాష్ట్రాల కంటే తెలంగాణ ముందంజలో ఉంది. హైదరాబాదు వంటి నగరంలోని వినియోగదారులను ద్రుష్టిలో పెట్టుకుని సర్వీసు సెక్టార్ లో ఉపాధి అవకాశాలు విస్త్రుతంగా పెరిగాయి. ఈజ్ ఆప్ డూయింగ్ బిజినెస్ వంటి అంశాల్లో అగ్రశ్రేణి రాష్ట్రంగా నిలిచింది. విద్య, వైద్య రంగాల్లో సైతం స్వరాష్ట్రం వచ్చిన తర్వాత రికార్డు స్థాయి మెరుగుదల సాధ్యమైంది. ప్రభుత్వ రంగంలో ఉద్యోగాల భర్తీ అంతవేగంగా సాగకపోయినప్పటికీ ప్రయివేటు కంపెనీలు దానిని భర్తీ చేస్తున్నాయి. దేశంలోని నిరుద్యోగతతో పోలిస్తే తెలంగాణలో ఉపాధి అవకాశాలు బాగానే ఉన్నట్లు సర్వేలు వెల్లడిస్తున్నాయి. నూతన రాష్ట్రం సొంతకాళ్లపై నిలబడుతున్న అపూర్వఘట్టానికి ఇది నిదర్శనం.

అటక దిగని హామీల మూట...

ఎన్ని సాధించినా కేసీఆర్ ప్రభుత్వాన్ని రెండు కలలు ఇంకా వెన్నాడుతూనే ఉన్నాయి. టు బెడ్ రూమ్ పథకం , దళితులకు మూడెకరాల భూమి పంపిణీ . ఈ రెండు పథకాల్లో పదిశాతం కూడా ఇంతవరకూ సర్కారు పూర్తి చేయలేకపోయింది. నియోజకవర్గాల స్థాయిలో ఎంతగా పట్టుపట్టినా రెండు పడకల ఇళ్ల పథకం పట్టాలపైకి ఎక్కడం లేదు. ఏవో నమూనా గ్రుహాలు మినహా అమలుకు నోచుకోవడం లేదు. పెరిగిన ఇళ్ల నిర్మాణ వ్యయానికి అనుగుణంగా కేటాయింపులు లేవు. దాంతో తీవ్రంగా నష్టపోతామనే ఉద్దేశంతో కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రావడం లేదు. అనేకచోట్ల స్థలాల సమస్య వెంటాడుతోంది. ఊరికి దూరంగా ఇళ్లు కడతామంటే వెళ్లేందుకు ప్రజలు సిద్దంగా లేరు. ఎమ్మెల్యేలు నియోజకవర్గాల వారీ పథకాన్ని దత్తత తీసుకుని మండల స్థాయి అధికారులకు విడివిడిగా లక్ష్యాలను నిర్దేశించకపోతే పని జరిగేట్లు కనిపించడం లేదు. దళితులకు మూడెకరాల భూమి పంపిణీ చేసేందుకు తగినంత ల్యాండ్ బ్యాంకు ప్రభుత్వం వద్ద లేదు. కొనుగోలు చేసి కేటాయిద్దామనుకున్నప్పటికీ ప్రభుత్వం నిర్ణయించే రేటుకు ఎవరూ అమ్మరు. దీంతో ఈ రెండు పథకాలూ అటకెక్కేసినట్లే కనిపిస్తున్నాయి. ప్రతినియోజకవర్గంలోనూ వేలాదిమందితో ముడిపడిన పథకాలుకావడం వల్ల రాజకీయంగా ప్రభుత్వానికి నష్టం వాటిల్లే సూచనలున్నాయి. రాజకీయంగా టీఆర్ఎస్ ఎన్నికల ప్రణాళిక అమలు, వైఫల్యాల కంటే ..ఎన్నో ఆశలతో, ఆకాంక్షలతో, ఆశయాలతో ఆవిర్భవించిన రాష్ట్ర ప్రస్థానం ఎలా సాగుతోందన్నదే ముఖ్యం. ఆ విషయంలో భావోద్వేగాల బంగారు తెలంగాణ తనను తాను తీర్చిదిద్దుకుంటూ బులిబులి అడుగులతో మురిపిస్తోంది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News