సోషల్ ..స్లోగన్....పనిచేస్తుందా...?

Update: 2018-10-24 15:30 GMT

రాజకీయ పార్టీలకు ఎన్నికల సమయంలో సామాజిక అసమానతలు, అన్యాయాలు గుర్తుకు వస్తాయి. బడుగు,బలహీన వర్గాల మీద ఎనలేని ప్రేమ పుట్టుకొస్తుంది. పేదల జీవితాన్ని ఉద్దరించాలనే సంకల్పం చెప్పుకుంటాయి. సగటు మనిషికి సాధికారత కల్పించాలని శపథం పడతాయి. మధ్యతరగతి పట్ల ఎనలేని కరుణ కురిపిస్తాయి. ఇదంతా ఓట్ల కాలం. చకోరపక్షిలా ఎదురుచూసే పార్టీలకు వర్షంలా ఓట్లు కురవాలనేది ఆకాంక్ష. అందుకోసమే ఆయా వర్గాలపై హఠాత్తుగా ఆదరణ పెరిగిపోతుంది. డెబ్బై ఏళ్ల స్వాతంత్ర్యం తర్వాత సైతం పేద, బడుగు వర్గాలు ఇంకా దారిద్ర్యంలోనే ఎందుకున్నాయన్న ప్రశ్నలకు పార్టీల వద్ద సమాధానం ఉండదు. ఆయావర్గాలు ఎక్కువగా ఉన్న కులాలు ఇప్పుడు మరోసారి చర్చల్లోకి వస్తాయి. వాటి చుట్టూ రాజకీయం నడుస్తుంది. సోషల్ ఇంజినియరింగ్ అంటూ కొన్ని పార్టీలు నినాదం ఎత్తుకుంటాయి. ఇదంతా పక్కా పాలిటిక్స్. తాజాగా తెలంగాణలోముందస్తు ముచ్చట్లలో భాగంగా మరోసారి సోషల్ స్లోగన్ జోరందుకుంది.

టీఆర్ఎస్ ముందు చూపు...

ముందుగా అభ్యర్థులను ప్రకటించి ధీమాగా రాజకీయ పొలికేక పెట్టింది టీఆర్ఎస్. దీంట్లో ఒక ఎత్తుగడ దాగి ఉంది. ఇతర పార్టీలకు అందనంత దూరంలో తమ క్యాండిడేట్లు ప్రచారంలో దూసుకుపోవాలనేది లక్ష్యం. ప్రత్యర్థులుగా ఉన్నవారు ఇంకా కూటమి చర్చలలో మునిగి ఉండగానే టీఆర్ఎస్ అభ్యర్థులు ప్రజల్లో తమ అజెండాతో ప్రచారం చేసుకొనే వెసులుబాటును కల్పించారు. అభ్యర్థులను ఒకేసారి ప్రకటించడం వల్ల శషభిషలు, తర్జనభర్జనలకు తావుండదు. అదే సమయంలో అధిష్టానం దృఢంగా వ్యవహరిస్తోందన్న సంకేతమూ క్యాడర్ లోకి వెళుతుంది. అసమ్మతి,అసంతృప్తుల వంటివాటిని బుజ్జగించేందుకు తగినంత సమయం ఉంటుంది. రాజకీయంగా నష్టం జరిగే చోట్ల దిద్దుబాటు చర్యలకు వీలుంటుంది. ఈ అంచనాలతోనే కేసీఆర్ ఏక్ దమ్ 105 మంది జాబితా విడుదల చేసేశారు. తీవ్రస్థాయిలోనే అసమ్మతి తలెత్తింది. అయితే కాంగ్రెసు స్థాయిలో తిరుగుబాట్లు రాలేదు. అభ్యర్థుల పేర్లు మార్చే ప్రసక్తి లేదంటూ నాయకత్వం ఒకింత దృఢంగానే నిలిచింది. కానీ పార్టీ అంతర్గత వ్యవహారాలు పూర్తిగా సద్దుమణగలేదు.

కాసింత కష్టమే....

పర్యవసనాలు ఆలోచించకుండా టీఆర్ఎస్ దాదాపు పూర్తి జాబితాను విడుదల చేసింది. చాలా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులపై తీవ్రస్థాయిలో ప్రజల్లో వ్యతిరేకత ఉంది. దీనిని పరిగణనలోకి తీసుకోకుండా మొండి పట్టుదలతో అధిష్టానం చిట్టాను వెలువరించింది. అయితే ఇప్పుడు ఆజాబితానే తమకు అనుకూలంగా మార్చుకోవాలనే ఎత్తుగడలో ఉన్నాయి ప్రతిపక్షాలు. రాజ్యాంగ ప్రకారం రిజర్వేషన్లు వర్తించే ఎస్సీఎస్టీలను మినహాయిస్తే బీసీలకు దక్కిన సీట్లు స్వల్పమే. తెలంగాణలో పక్కనున్న ఏపీతో పోలిస్తే బీసీ కులాల సంఖ్య, జనాభా ఎక్కువ. కానీ టీఆర్ఎస్ జాబితాలో వారికి రాజకీయంగా న్యాయం జరగలేదు. టీఆర్ఎస్ చిట్టాలో కులాలకు జరిగిన అన్యాయాన్ని బహిరంగంగా ప్రకటిస్తూ ప్రచారం చేయాలనే ఎత్తుగడతో కాంగ్రెసు, విపక్షాలు వ్యూహరచన చేస్తున్నాయి. కాంగ్రెసు పార్టీ ఢిల్లీ స్థాయిలో సోషల్ ఇంజినియరింగ్, కులాలకు సమప్రాధాన్యం పేరిట నినాదం ఎత్తుకుంది. తెలంగాణలో తమ పార్టీ పరంగా బీసీలకు ఇచ్చే సీట్లపై ఒక స్పష్టత నిచ్చే కసరత్తు ప్రారంభించింది. టీఆర్ఎస్ కంటే వెనకబడిన తరగతులకు అధికంగా సీట్లు కేటాయించి ఘనతను చాటుకోవాలని కాంగ్రెసు చూస్తోంది.

పులిస్వారీ...

వెనకబడినతరగతులకు అధిక సీట్లు కేటాయించడం అంతసులభమైన విషయం కాదు. కాంగ్రెసుపార్టీలో సామాజికవర్గ పరంగా చూస్తే రెడ్లకు అధికప్రాధాన్యం ఉంది. పార్టీలో ప్రతిచోట్ల నలుగురైదుగురు బలమైన అభ్యర్థులున్నారు. వీరంతా టిక్కెట్లు ఆశిస్తున్నారు. వారిలో సర్దుబాటు చేసి ఒకరికి సీటు కేటాయించడమే తలకు మించినభారం. అటువంటిది వీరందర్నీ కాదని వేరే వెనకబడినతరగతుల అభ్యర్థికి కేటాయించడమంటే సాహసమే. ఒక్కో సందర్భంలో భారీ రాజకీయ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. అనుకున్నదొకటి అయినది మరొకటి అన్నట్లుగా పరిస్థితి వికటించినా ఆశ్చర్యపోనవసరం లేదు. పైపెచ్చు కాంగ్రెసు మహాకూటమి కట్టి, టీడీపీ, టీజేఎస్, సీపీఐలతో కలిసి వెళ్లాలనుకుంటోంది. ఆయా పార్టీలకూ నియోజకవర్గాల వారీ పంపిణీ సాగితే సామాజిక న్యాయం చేయడానికి కాంగ్రెసులో మిగిలే సీట్లు అత్యల్పమే. అటువంటి స్థితిలో ఇప్పటికే ఎత్తుకున్న సామాజిక న్యాయం..సోషల్ ఇంజినీరింగ్ నినాదం వట్టిమాటగానే మిగిలిపోవచ్చు. కాంగ్రెసు పార్టీకి పులిమీద స్వారీగా మారిపోవచ్చు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News