బ్లాక్ మెయిల్ పాలిటిక్స్... ట్టిస్ట్ ల మీద ట్విస్ట్ లు.....!

Update: 2018-10-13 14:30 GMT

రౌతు మెత్తనయితే గుర్రం రెండు కాళ్లపై దౌడు తీస్తుందని సామెత. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెసు పరిస్థితి అలాగే ఉంది. పార్టీ పై ఏ ఒక్కరికీ పట్టులేదు. అధిష్ఠానం సరైన మార్గదర్శకత్వం చేయలేకపోతోంది. స్థానిక నాయకుల్లో ఐక్యత కరవైంది. వర్గ విభేదాలు, ఆధిపత్య ధోరణితో ఎవరికి వారే పెత్తందారులు. ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం కోరుకోవడంలో తప్పులేదు. అందరినీ కలుపుకుని పోవడం ద్వారా నాయకత్వం సాధించగలిగితే మంచిదే. కానీ గ్రూపు తత్వాన్ని ప్రోత్సహించడం ద్వారా నాయకులుగా ఎదగగలమనే తప్పుడు భావనతో కాంగ్రెసు మట్టికొట్టుకుపోతోంది. తాజాగా ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెసు క్రమశిక్షణరాహిత్యం కొత్తపుంతలు తొక్కుతోంది. పార్టీనే బ్లాక్ మెయిల్ చేస్తున్నారు కొందరు నాయకులు. టిక్కెట్లిస్తే సరే లేదంటే ప్రత్యర్థి పార్టీలకు సహకరిస్తామని సంకేతాలు పంపుతున్నారు. ప్రత్యర్థిపార్టీలో చేరిపోతే తప్పులేదు. కానీ కాంగ్రెసులో కొనసాగుతూనే ఇతర పార్టీకి మద్దతిస్తామని చెబుతుండటంతో పార్టీ శ్రేణులు గందరగోళంలో పడుతున్నాయి. అధికార తెలంగాణ రాష్ట్రసమితి తలపై పాలు పోస్తోంది హస్తం పార్టీ అసమ్మతి.

బెదిరింపులే బెటర్...

మాజీ ఉపముఖ్యమంత్రి, టీపీసీసీ ఎలక్షన్ మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్ దామోదర రాజనరసింహ సతీమణి బీజేపీలో చేరడం సంచలనం రేకెత్తించింది. మళ్లీ ఆమె అదే రోజు సాయంత్రానికి కాంగ్రెసు గూటికి తిరిగి వచ్చేసింది. అది మరో సంచలనంగా మారింది. ఈ కప్పల తక్కెడ వ్యవహారం ఇప్పుడు కాంగ్రెసు ను పట్టి కుదిపేస్తోంది. అసలేం జరిగిందనే ఆసక్తి సర్వత్రా వ్యక్తమవుతోంది. అసలు నిజాలు వెలికి తీస్తే పార్టీలోని బలహీనతలు బయటపడతాయని పార్టీ నేతలు వాపోతున్నారు. నిజానికి దామోదర రాజనర్శింహ భార్యకు బీజేపీలో చేరే యోచన తొలుత లేదు. కాంగ్రెసులో భాగంగానే అసెంబ్లీకి తలపడాలనేది ఆమె ఆలోచన. అందులో భాగంగా పాత మెదక్ జిల్లాలో ఒక నియోజకవర్గాన్ని ఎంచుకుని కొంతకాలంగా అక్కడ పనిచేసుకుంటూ వస్తున్నారు. కాంగ్రెసు పార్టీ తీసుకున్న విధానపరమైన నిర్ణయాల్లో భాగంగా ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు ముగ్గురికి టిక్కెట్లు ఇచ్చేది లేదని తేల్చి చెప్పేశారు. అయితే గత ఎన్నికల్లో టిక్కెట్లు పొంది పోటీ చేసి గెలిచిన వారి విషయంలో మినహాయింపు ఉంటుంది. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అతని సతీమణికి ఈ రకమైన వెసులుబాటు లభించింది. వారిద్దరూ ఇప్పటికే ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు. మిగిలిన వారి కుటుంబ సభ్యులెవరికీ ఈ రకమైన మినహాయింపు రాదు. అయితే దామోదరరాజనర్సింహ తనతోపాటు భార్యకూ టిక్కెట్టు ఆశిస్తున్నారు. అది సాధ్యం కాదని తేలడంతో పార్టీపై ఒత్తిడి పెంచే క్రమంలో బాగంగా బీజేపీని పావుగా వాడుకున్నారని ప్రచారం సాగుతోంది. సాయంత్రం సమయానికే పార్టీ నుంచి బలమైన హామీ లభించడంతో మళ్లీ సొంతగూటికి వచ్చేశారు.

కుమ్మక్కు వాదన...

అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా తెలుగుదేశం వైపు దృష్టి సారిస్తోంది. సెంచరీ కొడతామంటూ ఘనంగా బహిరంగ సభల్లో ప్రకటిస్తున్నప్పటికీ రోజురోజుకీ పోటీ వాతావరణం ఉత్కంఠ భరితంగా మారుతోంది. తెలుగుదేశం, సీపీఐ, జనసమితితో కాంగ్రెసు జట్టు కడుతోందన్న భావన ప్రజల్లోకి బలంగా వెళ్లింది. సమీకరణల్లో కొంతమేరకు సైకలాజికల్ అడ్వాంటేజీ మొదలైంది. క్షేత్రస్థాయిలో దీని ప్రభావాన్ని టీఆర్ఎస్ అంచనా వేస్తోంది. తెలుగుదేశం పార్టీ నుంచి కొందరు సీనియర్లు, ద్వితీయశ్రేణి నాయకులు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. పదవులు, ఇతర అవసరాలు ముడిపడటంతోనే ఎక్కువ మంది జంప్ చేసేశారు. అయితే వారి కోర్కెలు అన్నిటినీ టీఆర్ఎస్ తీర్చలేకపోయింది. పార్టీ మారిన వారిలో సైతం అసంతృప్తి మొదలైంది. పార్టీ సిద్ధాంతాలు, భావజాలం పట్ల ఆకర్షితులై టీడీపీకి పనిచేసే దిగువస్థాయి కార్యకర్తలు చాలామంది సానుభూతిపరులుగా ఇప్పటికీ మిగిలే ఉన్నారు. తెలుగుదేశం వైభవంగా ఉన్న రోజులతో పోలిస్తే వీరి సంఖ్య 20 శాతానికి పడిపోయినట్లు పార్టీ వర్గాల అంచనా. అలాగే తెలుగుదేశానికి సంప్రదాయబద్ధంగా ఉన్న ఓటు బ్యాంకు బాగా క్షీణించింది. కానీ కనుమరుగు కాలేదు. పునరుద్ధరింప చేసుకునే యత్నంలో భాగంగానే తెలుగుదేశం కాంగ్రెసుతో చేతులు కలుపుతోంది. ఈ కలయికను తిప్పికొట్టడం ఎలాగో అర్థం కాక తెలంగాణ రాష్ట్రసమితి మల్లగుల్లాలు పడుతోంది. ఆంధ్రా పార్టీతో కాంగ్రెసు కుమ్మక్కు కావడం తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధమనే వాదనను పైకి తెస్తోంది.

ఎదురుచూపులు...

కాంగ్రెసు, టీడీపీల్లో బలమైన నాయకులను ఆకర్షించేందుకు మరో విడత ప్రయత్నాలు ప్రారంభించింది టీఆర్ఎస్. గతంలో విడతల వారీగా ఈ రెండు పార్టీలను ఖాళీ చేసే ప్రయత్నాలు చేసింది. చాలా వరకూ టీడీపీ విషయంలో సక్సెస్ అయ్యింది. కాంగ్రెసు పార్టీ విషయంలో పూర్తి విజయాన్ని టీఆర్ఎస్ సాధించలేకపోయింది. ఇంకా ఆ పార్టీ పట్ల తెలంగాణ సమాజంలో పూర్తిగా ఆశలుడిగిపోకపోవడం వల్ల బలమైన శక్తిగానే నిలిచింది. సమర్థ నాయకత్వం, మంచి మిత్రుడు దొరికితే టీఆర్ఎస్ కు పోటీ ఇవ్వడం పెద్ద కష్టమేమీ కాదు. టీడీపీ, సీపీఐ, జనసమితి మద్దతును ఆ కోణంలోనే చూస్తోంది. అందులో భాగంగానే గతంలో పార్టీ విడిచి పెట్టి వెళ్లిపోయిన వారిని తిరిగి చేర్చుకోవాలనే యత్నాలు చేస్తోంది. కాంగ్రెసు రివర్స్ ఆకర్ష మంత్రాన్ని ప్రయోగిస్తోంది. టీఆర్ఎస్ లో టిక్కెట్లు రావని కచ్చితంగా తేలిపోయిన వారు ప్రత్యామ్నాయంగా కాంగ్రెసు వైపు ఎదురుచూస్తున్నారు. కానీ కాంగ్రెసు,టీడీపీల్లో అసంతృప్తులకు వల వేసేందుకు టీఆర్ఎస్ ఎదురుచూస్తోంది. బలమైన పార్టీ ఏమిటా? అని అసెస్ చేసుకునే పనిలో ఉన్నారు తిరుగుబాటు చేయాలనుకుంటున్న రెబల్స్.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News