గ్రేట‌ర్ ఎన్నిక‌ల‌కు ముందే టీఆర్ఎస్ మేయ‌ర్ విన్‌

గ్రేట‌ర్ హైద‌రాబాద్ పీఠం ఎన్నిక‌లు కాకుండానే టీఆర్ఎస్ ఖాతాలో ప‌డిపోయింది. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ గ్రేట‌ర్ పీఠం టీఆర్ఎస్‌ను దాటి వెళ్లే ప‌రిస్థితి లేదు. మ‌రి హీనంగా ఏ [more]

Update: 2020-11-25 09:30 GMT

గ్రేట‌ర్ హైద‌రాబాద్ పీఠం ఎన్నిక‌లు కాకుండానే టీఆర్ఎస్ ఖాతాలో ప‌డిపోయింది. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ గ్రేట‌ర్ పీఠం టీఆర్ఎస్‌ను దాటి వెళ్లే ప‌రిస్థితి లేదు. మ‌రి హీనంగా ఏ 10 లేదా 20 సీట్లకు ప‌రిమితం అయితే త‌ప్ప గ్రేట‌ర్ పీఠం ఎట్టి ప‌రిస్థితుల్లోనూ టీఆర్ఎస్ చేతికి ఇప్పటికే చిక్కేసిన‌ట్టే. గ్రేట‌ర్ పీఠం ద‌క్కించుకోవాలంటే కేవ‌లం మెజార్టీ కార్పొరేట‌ర్లు మాత్రమే వ‌స్తే స‌రిపోదు. ఎక్స్ అఫీషియో స‌భ్యులు కూడా ఓట్లేయాలి. రాజశేఖ‌ర్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు త‌మ‌కు న‌చ్చిన మున్సిపాల్టీ / కార్పొరేష‌న్లో ఎక్స్ అఫీషియో ఓటు వేసే అవ‌కాశం క‌ల్పించారు. ఆ త‌ర్వాత చాలా ఎన్నిక‌ల్లో మెజార్టీ కౌన్సెల‌ర్ / కార్పొరేట‌ర్ సీట్లు గెలుచుకున్న పార్టీలు కూడా ఎక్స్ అఫీషియో ఓట్లు లేక పీఠాలు పోగొట్టుకున్న సంఘ‌ట‌న‌లు అనేకం.

యాభై సీట్లను గెలిస్తే….

ఇక్కడ మొత్తం 150 డివిజ‌న్లు ఉన్నాయి. మేజిక్ ఫిగ‌ర్ 76. అంటే ఈ సీట్లు వ‌చ్చిన వారికే మేయ‌ర్ పీఠం ద‌క్కుతుంది. అయితే 76 సీట్లు ఉన్న వారికి మేయ‌ర్ పీఠం ద‌క్కుతుంద‌న్న గ్యారెంటీ లేదు. ఎలాగంటే గ్రేట‌ర్ మొత్తం మీద 150 డివిజ‌న్లతో పాటు 56 మందికి ఎక్స్ అఫీషియో ఓట్లు ఉన్నాయి. ఇవి మొత్తం క‌లిస్తే 206. ఇప్పుడు మేజిక్ ఫిగ‌ర్ 103. ఈ సంఖ్య సాధించిన వారికే మేయ‌ర్ పీఠం ద‌క్కుతుంది. ఈ 56 మంది స‌భ్యుల్లో టీఆర్ఎస్‌కు ఇప్పటికే 42 మంది స‌భ్యులు ఉన్నారు. మ‌జ్లిస్‌కు 10కు పైగానే స‌భ్యులు ఉన్నారు. అంటే ఈ కూట‌మి చేతుల్లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌కుండానే 55 వ‌ర‌కు ఓట్లు ఉన్నాయి. ఇక ప్రజాక్షేత్రంలో మ‌రో 50 సీట్లు గెలిస్తే టీఆర్ఎస్ – మ‌జ్లిస్ క‌లిసి మేయ‌ర్ పీఠం సొంతం చేసుకోవ‌చ్చు.

కనీసం 20 స్థానాల్లో…..

పాత‌బ‌స్తీలో ఎంఐఎం హీన‌ప‌క్షంలో 40 డివిజ‌న్లు గెలుస్తుంది. ఇంకా చెప్పాలంటే టీఆర్ఎస్‌కు హీన‌ప‌క్షంలో 20 కార్పొరేట‌ర్ సీట్లు వ‌చ్చినా ఆ పార్టీ మేయ‌ర్ సీటు గెలుచుకుంటుందంటున్నారు. ఇప్పటికే మంచి అండ‌ర్ స్టాండింగ్‌తో గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో పోటీ చేస్తోన్న టీఆర్ఎస్ – బీజేపీ మ‌ధ్య మేయ‌ర్ – డిప్యూటీ మేయ‌ర్ ప‌ద‌వుల పంప‌కాల‌పై ఓ అవ‌గాహ‌న ఉందంటున్నారు. ఏదేమైనా పై ఈక్వేష‌న్ల ప్రకారం గ్రేట‌ర్ మేయ‌ర్ పీఠం టీఆర్ఎస్‌ను దాటి వెళ్లే ప‌రిస్థితి లేదు.

సులువుగానే….

అదే కాంగ్రెస్‌, లేదా బీజేపీ గ్రేట‌ర్ లో విజ‌యం సాధించాలంటే మాత్రం చాలా క‌ష్టప‌డాలి. ఈ రెండు పార్టీల‌కు క‌నీసం 103 సీట్లు రావాలి. అది క‌నుచూపు మేర‌ల్లో కూడా క‌న‌ప‌డ‌డం లేదు. ఇక బీజేపీ కూడా గెలుపుపై ఆశ‌ల్లేక‌పోయినా క‌నీసం 30 – 40 సీట్లలో గెలిచి స‌త్తా చాటాల‌ని చూస్తోంది. కాంగ్రెస్ క‌నీసం డ‌బుల్ డిజిట్ స్థాయిలో అయినా డివిజ‌న్లు గెలుస్తుందా ? అంటే సందేహంగానే క‌నిపిస్తోంది. ఇక టీఆర్ఎస్‌కు మేయ‌ర్ కుర్చీ ఇంత సులువుగా క‌నిపిస్తున్నా దుబ్బాక దెబ్బతో నానా హైరానా ప‌డుతోంది.

Tags:    

Similar News