ఎవరిని ఎంచుకుంటారు...??

Update: 2018-12-03 15:30 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వారసుడు, టీఆర్ఎస్ ముఖ్యనేత కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు పార్టీలో చర్చకు దారితీస్తున్నాయి. ప్రతిపక్షంలోనూ భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇది పార్టీకి మంచి చేస్తుందా? చెడు తలపెడుతుందా? తెలంగాణ రాష్ట్రసమితి గురించి ఆంధ్రాలో ఏమనుకుంటున్నారు? కేసీఆర్ రంగప్రవేశం చేస్తే ఏపీలో ఫలితాలు తారుమారవుతాయా? ఏపీలో ప్రస్తుతం టీడీపీ, వైసీపీ ప్రధాన పక్షాలుగా నిలుస్తున్నాయి. జనసేన కూడా తానూ ఉన్నానంటూ వైసీపీ,టీడీపీలకు సవాల్ విసురుతోంది. వైసీపీ,జనసేన రెండు పార్టీలతోనూ కేసీఆర్ కు మంచి టర్మ్స్ ఉన్నాయి. ఏదో ఒక పార్టీకే మద్దతు ఇవ్వాల్సి ఉంటుంది. ఫెడరల్ ఫ్రంట్ పేరిట ఆయన ప్రచారానికి దిగితే ఒకరినే ఎంచుకోవాలి. అవన్నీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత సంగతులు. ముందుగా మీరాష్ట్రంలో వేలు పెడతామనడాన్ని తెలంగాణలో సెటిల్ అయిన సీమాంధ్రులు ఏవిధంగా తీసుకుంటారనే చర్చ మొదలైంది.

ఆ ఓట్లు చాలా కీలకం...

ఏపీ విభజన తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో తెలంగాణలో స్థిరపడిన సీమాంధ్రులు టీడీపీ,బీజేపీ కూటమికి మద్దతు గా నిలిచారు. ఈరెండు పార్టీలు కలిసి 20 స్థానాల్లో గెలిచాయి. మరో 21 స్థానాల్లో రెండో స్థానానికి చేరుకున్నాయి. ఇందులో సీమాంధ్ర సెటిలర్ల ప్రభావం చాలా ఎక్కువని చెప్పాలి. ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత క్రమేపీ వారి ఆలోచనధోరణిలో మార్పు వచ్చింది. టీడీపీ ఇక్కడ గెస్టు రోల్ మాత్రమే పోషించగలుగుతుంది తప్పితే ప్రధానపార్టీగా నిలవలేదన్న వాస్తవం వారికి అర్థమైంది. ఏదో ఒకపార్టీకి మద్దతుగా మాత్రమే టీడీపీ బలం ఉపయోగపడుతుంది. దీనిని గ్రహించిన తర్వాతనే గ్రేటర్ హైదరాబాదు మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఏకపక్షంగా సీట్లు కట్టబెట్టారు. అప్పటికే బీజేపీ, టీడీపీ మైత్రి తెలంగాణలో చెడిపోయింది. ఒంటరిగానే బరిలోకి దిగాయి. రెండుపార్టీలు చావు దెబ్బతిన్నాయనే చెప్పాలి. ప్రస్తుతం తెలంగాణ లో కాంగ్రెసుతో కలిసి నడుస్తున్న టీడీపీ మరోసారి 2014 మేజిక్ ను రిపీట్ చేయాలని భావిస్తోంది. అందుకు సీమాంధ్రుల ఓట్లు చాలా కీలకం. గ్రేటర్ ఎన్నికల్లో దూరమైన ఈ ఓటర్లు తిరిగి టీడీపీ, కాంగ్రెసుల వైపు వస్తారా? లేదా? అన్నది ఉత్కంఠ భరితంగా మారుతోంది.

నిర్ణయాత్మక నియోజకవర్గాలు...

ఏపార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందో నిర్ణయించే నియోజకవర్గాలు 24 వరకూ ఉన్నట్లు గా రాజకీయవర్గాలు భావిస్తున్నాయి. అసెంబ్లీ రద్దు తర్వాత మీడియా సంస్థలు , రాజకీయ పార్టీలు రాష్ట్రస్థాయిలో ఇప్పటికే పదివరకూ సర్వేలు నిర్వహించాయి. అక్టోబర్ మొదటివారం వరకూ టీఆర్ఎస్ కు క్లియర్ ఎడ్జ్ ఉన్నట్లుగా నివేదికలు వచ్చాయి. 75 నియోజకవర్గాల్లో విజయానికి ఢోకా లేదనే అంచనాలు వెలువడ్డాయి. మరో 18 నియోజకవర్గాల్లో గట్టిగా కష్టపడితే చేజిక్కించుకోవచ్చని సర్వేలు చాటిచెప్పాయి. మొత్తం 93 సీట్లను టీఆర్ఎస్ గెలుచుకోవచ్చనే అంచనాలతోనే కేసీఆర్ దూకుడుగా ప్రచారాన్ని ప్రారంభించారు. ఏకపక్షంగా పాత అభ్యర్థులందరికీ టిక్కెట్లు ఇచ్చేశారు. సెంచరీ కొట్టబోతున్నామని చెప్పేశారు. ఆతర్వాతనుంచే టీఆర్ఎస్ బలహీనతలు ఒక్కటొక్కటిగా బయటపడటం మొదలైంది. టీఆర్ఎస్ జాబితాలోని అభ్యర్థుల్లో 42 మంది పట్ల ప్రజలు తీవ్రమైన వైముఖ్యంతో ఉన్నట్లుగా తేలింది. కేసీఆర్ పై అభిమానం ఉన్నప్పటికీ ఈ క్యాండిడేట్ల కారణంగా రెండు నుంచి మూడు శాతం ఓట్లు చేజారబోతున్నట్లుగా చెబుతున్నారు. దీంతో 93 సీట్ల టీఆర్ఎస్ బలం 51 స్థానాలకు పడిపోయినట్లుగా రాజకీయవర్గాల అంచనా. దీంతో సులభంగా అధికారం చేజిక్కించుకోవాల్సిన పరిస్థితి నుంచి చెమటోడ్చి గెలవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే గ్రేటర్ హైదరాబాదు పరిధిలోని 24 నియోజకవర్గాలకు గాను 17 నియోజకవర్గాలు కీలకంగా మారుతున్నాయి. హైదరాబాదు పాతబస్తీలోని ఏడు నియోజకవర్గాల్లో ఎంఐఎంకు ఎటూ తిరుగులేదు. అర్బన్ ఓటర్లు ప్రాముఖ్యం వహించే మిగిలిన ఓట్లు ఎవరికి పడతాయనేదే ప్రధానాంశంగా మారింది.

కేటీఆర్ ’కీ‘ ఫ్యాక్టర్ ...

టీఆర్ఎస్ లోని మిగిలిన నేతలతో పోలిస్తే కేటీఆర్ కు సీమాంధ్రుల్లో మంచి పలుకుబడి ఉంది. విద్యాభ్యాసం మొదలు వృత్తివ్యాపారస్నేహాల వరకూ ఆయనకు ఏపీతో అనుబంధం ఉంది. విద్యాధికుడు కావడానికి తోడు అర్బన్ ఓట్లను ఆకట్టుకోగల నేర్పు ఉంది. అందువల్ల ఎప్పుడైనా సీమాంధ్రుల ను మచ్చిక చేసుకోవాలనుకున్నా, వారికి భరోసా ఇవ్వాలన్నా కేటీఆర్ రంగంలోకి దిగుతుంటారు. ఉద్యమంలో భాగంగా కేసీఆర్, హరీశ్ రావులు సీమాంధ్రుల విషయంలో కొంత కఠినమైన వ్యాఖ్యలు చేస్తుండేవారు. కేటీఆర్ బ్యాలెన్సింగ్ ఫాక్టర్ గా ఉండేవారు. అందుకే గతంలో గ్రేటర్ మునిసిపల్ బాధ్యతలు కూడా అప్పగించారు. ఇప్పుడు అత్యంతకీలకంగా మారిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ లో వేలు పెడతామనడం ప్రాముఖ్యమున్న పరిణామం. దీనిని ఇక్కడ సెటిల్ అయినవారు ఏరకంగా తీసుకుంటారనే దానిపై కొంతమేరకు ఓటింగు ఆధాపడి ఉంటుంది. కులాలవారీ చీలిపోయిన ఏపీ సామాజిక సమీకరణల్లో వైసీపీకి మద్దతిచ్చే కొన్ని వర్గాలు దీనిని ఆహ్వానించే అవకాశం ఉంది. అదే సమయంలో ప్రస్తుతం ఏపీలో రాజకీయాధికారంలో భాగస్వామిగా ఉన్న మరోసామాజిక వర్గం తీవ్రంగా వ్యతిరేకించే పరిస్థితి ఉంది. ఆయా వర్గాల ప్రజలు లక్షల సంఖ్యలో హైదరాబాదులో నివసించడం తో ఈ చర్చ రక్తి కడుతోంది.

 

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News