కళ్లల్లో కళ ఏదీ........??

Update: 2018-12-09 15:30 GMT

ఎన్నికలు ముగిశాయి. ఉత్కంఠకు తెరపడిపోతుందని అంతా ఆశించారు. కానీ జరిగింది వేరు. మరింత ఉద్విగ్నత చోటు చేసుకుంది. తెలంగాణలో ఏం జరగబోతోంది? అన్న సందిగ్ధతకు తెర లేచింది. ప్రసారమాధ్యమాలు సృష్టించిన గందరగోళంతో రాజకీయపార్టీలు సైతం అయోమయంలో పడిపోయాయి. అధికార తెలంగాణ రాష్ట్రసమితి విజయం ఖాయమనేది మెజార్టీ చానళ్ల ఒపీనియన్. అదే సమయంలో అదేంకాదంటూ ఆంధ్రా అక్టోపస్ ఇచ్చిన రిపోర్టు. ఈ రెంటి మధ్య అభిప్రాయం చీలిపోయింది. ఎవరూ సంబరాలు చేసుకోలేని విచిత్ర పరిస్థితి ఏర్పడింది. ఏకపక్షంగా విజయం సాధిస్తామని తెలంగాణ రాష్ట్రసమితి మనసా,వాచా,కర్మణా విశ్వసించింది. అందుకే సెంచరీ జపం ఎప్పటికప్పుడు పఠిస్తూ వచ్చింది. ముందస్తు ఎన్నికలకు వెళ్లడంలోనే తమ అనుకూలతను దృష్టిలో పెట్టుకుంది. ప్రజాకూటమి ఏర్పాటులో జాప్యం, ప్రత్యర్థి పార్టీల అభ్యర్థుల జాబితా చివరిక్షణాల వరకూ బయటికి రాకపోవడం తమకు లాభిస్తుందని అధికారపార్టీ నూటికి నూరుశాతం నమ్మింది. ఎగ్జిట్ పోల్స్ రూపంలో జాతీయ మీడియా సైతం అదే విషయాన్ని ధృవపరిచింది. మరోవైపు కూటమి కట్టిన పార్టీలకు ఓటు బదిలీ బాగానే జరిగిందనే వార్తలు వినవచ్చాయి. దాంతో తాము ఏదోరకంగా గట్టెక్కేస్తామనే భరోసా ప్రతిపక్ష కూటమికి ఏర్పడింది. కానీ ఎగ్జిట్ రూపంలో భిన్నత్వం కనిపించడం, గ్రామ,పట్టణ ఓటర్లలో పోల్ వ్యత్యాసాలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. దాంతో ముఖాముఖి తలపడిన టీఆర్ఎస్, ప్రజాకూటమి ఇంకా బహిరంగ సవాళ్లు విసురుకుంటున్నాయి. కానీ లోలోపల భయం వెన్నాడుతోంది.

ప్రజల్లోకి వెళ్లేందుకు...

ఈ ఎన్నికల విషయంలో జాతీయ మీడియా చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. ఒపీనియన్ పోల్సు మొదలు ఎగ్జిట్ పోల్స్ వరకూ అంతా తామే అన్నట్లుగా వ్యవహరించారు. ప్రాంతీయ మీడియా మాత్రం ఈవిషయంలో కొంత సంయమనం పాటించిందనే చెప్పాలి. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా తమకు ఎదురయ్యే పర్యవసనాలు దృష్టిలో పెట్టుకుని సర్వేల వంటి వాటికి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు. కొన్ని మీడియా సంస్థలు ముందుగా సర్వేలు చేసినప్పటికీ షెడ్యూలు వచ్చిన తర్వాత వాటికి దూరంగానే ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో మార్కెట్ కోసం ప్రయత్నిస్తున్న ఇంగ్లిషు చానళ్లు మాత్రం హడావిడి చేశాయి. అతితక్కువ శాంప్లింగ్ తో ఫలితాలను అంచనా వేసేశాయనే విమర్శలు ఉన్నాయి. అందులోనూ ఇక్కడ సొంత నెట్ వర్క్, ఫలితాలను స్క్రూటినీ చేసే వ్యవస్థ లేకుండానే తూతూమంత్రంగా నమూనాలు తీసుకుని ఆదరాబాదరాగా వాటిని విశ్లేషించారు. ఫలితాల విశ్వసనీయత కంటే ప్రజల్లోకి వెళ్లాలనే తపనతోనే మీడియా ఈ రకమైన గందరగోళానికి దారితీసిందని చెప్పుకోవాలి. నిజానికి సర్వేలు చేసేందుకు స్థానిక మీడియాకు అత్యధికంగా యంత్రాంగం ఉంటుంది. ప్రజల నాడిని పట్టుకోగలుగుతుంది. జాతీయ మీడియా లోకల్ నాడి పట్టుకోవడం అంత సులభం కాదు. అయినా సాహసం చేసింది. ఫలితం భిన్నంగా వస్తే తూచ్ అంటూ దులిపేసుకునే వెసులుబాటు ఎలాగూ ఉంటుంది.

రూటే సెపరేటు...

ఎగ్జిట్ పోల్స్ లో అత్యధికంగా టీఆర్ఎస్ కే ఓటు వేశాయి. వీటిని ప్రామాణికంగా తీసుకుంటే కచ్చితంగా అధికారపార్టీ మరోసారి అందలం ఎక్కడం ఖాయమని నిర్ధారించుకోవచ్చు. ముఖ్యమంత్రి మొదలు వారసుల వరకూ అదే విషయాన్ని ప్రకటించారు కూడా. కానీ ఈ విజయోత్సాహానికి లగడపాటి రాజగోపాల్ బ్రేకులు వేశారు. దాదాపు దశాబ్దమున్నర కాలంగా ఎన్నికల సర్వేలు చేయడంలో ఆయన ఆరితేరిపోయారు. జాతీయంగా సైతం అనేక సర్వేల్లో తన ప్రామాణికతను నిరూపించుకున్నారు. ఫ్లాష్ టీమ్ ల పేరిట చేసే సర్వేల్లో నమూనా సేకరణ పక్కాగా ఉండటం రాజగోపాల్ ప్రత్యేకత. అంతేకాకుండా అప్పటికప్పుడు హడావిడిగా శాంపిల్ తీసుకోవడం కంటే రెండు మూడు నెలలపాటు వివిధ వర్గాలనుంచి శాంప్లింగ్ తీసుకుంటూ ప్రజల నాడిని దశలవారీగా కాలక్రమంలో పట్టుకోవడం ఈ టీమ్ ల స్పెషాలిటీ. ప్రజలు ఏమనుకుంటున్నారనే అభిప్రాయాన్ని కూడా ఈ టీం తీసుకుంటుంది. వివిధ వర్గాల్లో నెలకొన్న అభిప్రాయం, మారుతూ వస్తున్న ధోరణులు, ప్రభుత్వ వ్యతిరేకత, ప్రతిపక్షాలకు లభిస్తున్న ఆదరణ, సంక్షేమ పథకాల లబ్ధి వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని విశ్లేషించడం తో దాదాపు ఎగ్జాక్ట్ ఫలితాలకు, లగడపాటి ఎగ్జిట్ ఫలితాలు చాలావరకూ సరిపోలుతున్నాయి. ఇప్పుడు సైతం జాతీయ మీడియా అంతా టీఆర్ఎస్ కు మొగ్గు చూపిస్తే తన రూటే సెపరేటు అంటూ ప్రజాకూటమి వస్తోందని ప్రకటించారు రాజగోపాల్.

సంబరాలకు చెల్లు...

దాదాపు అన్ని పార్టీల నాయకులు ప్రచారంలో బాగా అలసిపోయారు. ఎవరికి వారు తాము నెగ్గబోతున్నాం. తమ పార్టీ అధికారంలో వస్తుందనే ఆశల పల్లకిలోనే ఉన్నారు. ఎగ్జిట్ పోల్స్ కు తోడు గ్రౌండ్ లెవెల్ లో తమ అనుచరుల ద్వారా సమాచారాన్ని సేకరిస్తున్నారు. సర్వేల తరహాలోనే మిశ్రమ ఫలితాలు రావడంతో అంతా ఆందోళనలోనే ఉన్నారు. టీఆర్ఎస్, ప్రజాకూటమి అభ్యర్థులందరూ దాదాపు ఇదే రకమైన అయోమయంలో మునిగిపోతున్నారు. గ్రామప్రాంతాల్లో పోలింగు పెరిగింది కాబట్టి అది టీఆర్ఎస్ కు అనుకూలమంటూ అధికారపార్టీ వాదిస్తోంది. ప్రభుత్వ వ్యతిరేకత ప్రబలంగా ఉంది. కాబట్టి ఓటింగు పెరిగింది. అది మాకే సానుకూలమంటోంది ప్రజాకూటమి. మోడీ మొదలు అగ్రనాయకులంతా రంగంలోకి దిగారు కాబట్టి బీజేపీ గాలి వీస్తోంది ఇది కమల పరిమళం అంటోంది బీజేపీ. సకల జన సమ్మేళనంగా బహుజన లెఫ్ట్ ఫ్రంట్ కట్టడం వల్లే ఓటింగు పెరిగిందని వామపక్ష సీపీఎం విశ్వసిస్తోంది. గెలుపు తమదే అని చెబుతున్నప్పటికీ ఎవరి కళ్లల్లోనూ కళ కనిపించడం లేదు. దీనికి ప్రధానకారణం వైవిధ్యభరితమైన , చైతన్యపూరితమైన తీర్పులకు తెలంగాణ ఓటరు పెట్టింది పేరు కావడమే.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News