లెక్కలు తేలాయి... చిక్కులే మిగిలాయి..!

Update: 2018-10-26 00:30 GMT

తెలంగాణలో ప్రజాకూటమి ఏర్పాటుకు ఎట్టకేలకు ఒక అడుగు ముందుకు పడింది. నెల రోజులుగా సాగుతున్న పొత్తుల లెక్కలు ఇప్పటికి తేలాయి. ఏయే పార్టీకి ఎన్ని స్థానాలు కేటాయించాలో ఓ మాట అనేసుకున్నారు. కూటమిలో పెద్దన్నగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి 90 స్థానాలు, టీడీపీకి 15, తెలంగాణ జన సమితికి 10, సీపీఐకి 4 స్థానాలు తీసుకోవాలని నిర్ణయించారు. కేసీఆర్ ను గద్దె దింపడమే ఏకైక లక్ష్యంగా ఏర్పాటైన కూటమిలో సీట్ల కేటాయింపు పట్ల అన్ని పార్టీల్లోనూ అసంతృప్తి ఉన్నా లక్ష్యాన్ని గుర్తు తెచ్చుకుని సర్దుకుపోయారు. ఎట్టకేలకు లుకలుకలు బయటపడకుండా లెక్కలు తేల్చుకున్నారు. అయితే, సీట్ల లెక్కలు తేలినా అసలు చిక్కులు మాత్రం ముందున్నాయి. ఏయే పార్టీకి ఏయే స్థానాలు కేటాయించాలనేదే ఇప్పుడు కూటమి ముందున్న పెద్ద సవాల్.

20 స్థానాలపై పీటముడి

సీట్ల లెక్కలు తేలడంతో మూడు నాలుగు రోజుల్లో మొదటి విడత అభ్యర్థుల జాబితా విడుదల చేయాలని పార్టీలు నిర్ణయించాయి. అయితే, ఐక్యతను చాటే విధంగా సుమారు 60 మంది అభ్యర్థులతో ఉమ్మడి లిస్టును రిలీజ్ చేయాలనుకున్నారు. అన్ని పార్టీల అభ్యర్థులు మొదటి లిస్టులో ఉండనున్నారు. అయితే, కనీసం 20 స్థానాల విషయంలో కూటమి పార్టీల మధ్య పోటీ నెలకొనే అవకాశం ఉంది. కొన్ని స్థానాలను రెండు పార్టీలు, కొన్ని స్థానాలను మూడు పార్టీలు తమకు కావాలంటే తమకంటున్నాయి. అయితే, సర్ధుబాట్లలో పార్టీ పెద్దలు కొంత పట్టు విడుపులు ప్రదర్శించినా ఆయా స్థానాల్లోని ఆశావహులు మాత్రం అంత సులువుగా వదులుకునేలా కనిపించడం లేదు. చాలా రోజులుగా నియోజకవర్గాల్లో పని చేసుకుంటుండటం, కొందరు ప్రచారం కూడా ప్రారంభించడంతో ఇప్పుడు వెనకడుగు వేయలమంటున్నారు. దీంతో అసలు సమస్య ఇప్పుడు మొదలైంది.

టీడీపీ ఆశిస్తున్న స్థానాల్లో ఎక్కువ పోటీ

తెలుగుదేశం పార్టీ ఆశిస్తున్న స్థానాల్లో శేరిలింగంపల్లి ఒకటి. ఇక్కడి నుంచి ఆ పార్టీ ఆధినేత అభ్యర్థిని కూడా ఖరారు చేశారు. అయితే, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచ మాజీ ఎమ్మెల్యే బిక్షపతి యాదవ్ టిక్కెట్ ఆశిస్తున్నారు. ఇక టీడీపీ ఆశిస్తున్న రాజేంద్రనగర్ లో కాంగ్రెస్ నుంచి సబిత ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్ రెడ్డి బలంగా ఉన్నారు. అయితే, ఒక కుటుంబానికి ఒకే టిక్కెట్ నిబంధన అమలు చేస్తే ఓకే కానీ లేదంటే కాంగ్రెస్ ఈ స్థానాన్ని వదులుకునే పరిస్థితి లేదు. ఇక ఎల్బీనగర్ స్థానంలో కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, టీడీపీ నుంచి సామ రంగారెడ్డి ఇప్పటికే ప్రచారం ప్రారంభించారు. టీడీపీ ఆశిస్తున్న జూబ్లీహిల్స్ స్థానంలో కాంగ్రెస్ నుంచి విష్ణువర్ధన్ రెడ్డి ఉన్నారు. ఇక టీడీపీ ఆశిస్తున్న కొత్తగూడెం స్థానాన్ని కాంగ్రెస్ తో పాటు సీపీఐ కూడా అడుగుతోంది. మహేశ్వరం, కుత్బుల్లాపూర్ స్థానాలనూ టీడీపీ ఆశిస్తున్నా అక్కడ కాంగ్రెస్ కి బలమైన అభ్యర్థులు ఉన్నారు. ఇక నర్సంపేటలో రేవూరి ప్రకాశ్ రెడ్డి టీడీపీ టిక్కెట్ పై ఆశలు పెట్టుకోగా అక్కడ కాంగ్రెస్ కి సిట్టింగ్ ఎమ్మెల్యేగా దొంతి మాధవ రెడ్డి ఉన్నారు. రేవూరిని పరకాల పంపించాలనుకుంటే అక్కడ ఈ మధ్యే చేరిన కొండా సురేఖ ప్రచారం ప్రారంభించేశారు. ఇలా టీడీపీ ఆశిస్తున్న సుమారు 10 స్థానాలపై చిక్కుముళ్లు ఉన్నాయి.

అధ్యక్షుల సీట్లే ఖాళీగా లేవా..?

తెలంగాణ జన సమితి, సీపీఐ ఆశిస్తున్న స్థానాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి ఆశిస్తున్న హుస్నాబాద్ స్థానంలో కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి ప్రచారం కూడా ప్రారంభించారు. ఆయితే హుస్నాబాద్ తప్పించి ఇంకా ఎక్కడి నుంచి పోటీ చేసేది లేదని వెంకట్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు. ఇక సీపీఐ గత ఎన్నికల్లో పోటీ చేసిన మునుగోడు, దేవరకొండ మళ్లీ ఆశిస్తుండగా మునుగోడులో కాంగ్రెస్ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బలమైన అభ్యర్థిగా ఉన్నారు. దేవరకొండలో జెడ్పీ ఛైర్మన్ బాలూనాయక్ తో పాటు మరికొందరు కాంగ్రెస్ టిక్కెట్ ఆశిస్తున్నారు. ఇక ఖమ్మంలో గత ఎన్నికల్లో సీపీఐకి కేటాయించిన సీట్ల వల్ల తమకు అన్యాయం జరిగిందని ఆ జిల్లా నేతలు ఇప్పటికే అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు. ఈసారి ఖమ్మంలో సీపీఐ కి సీట్లు కేటాయించవద్దని డిమాండ్ చేస్తున్నారు. టీజేఎస్ విషయంలోనూ ఇదే గందరగోళం నెలకొంది. టీజేఎస్ ఆశిస్తున్న మల్కాజిగిరి, అంబర్ పేట, పాతబస్తీలోని రెండు స్థానాల విషయంలో మిగతా పార్టీల నుంచి పెద్దగా పోటీ లేకున్నా మిగతా స్థానాల విషయంలో పోటీ ఉంది. స్వయంగా కోదండరాం పోటీ చేస్తారని భావిస్తున్న వరంగల్ వెస్ట్ లేదా ఈస్ట్ లోనూ కాంగ్రెస్, టీడీపీ నుంచి పోటీ ఉంది. వెస్ట్ లో కాంగ్రెస్ నుంచి నాయిని రాజేందర్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి టిక్కెట్ ఆశిస్తున్నారు. ఇక ఈస్ట్ టీడీపీకి కేటాయించిన సీనియర్ నేత రేవూరి ప్రకాశ్ రెడ్డిని బరిలో దింపాలని భావిస్తున్నారు. ఇలా ఎవరికి ఎన్ని సీట్లో తేల్చుకోవడానికి ప్రజా కూటమికి నెల రోజులు పట్టగా... ఏయే పార్టీకి ఏ సీటో తేల్చుకోవాలంటే ఎన్ని రోజులు పడుతుందో. అందుకే ప్రజా కూటమి పార్టీలు సీట్లు పంచుకునే లోపే మా అభ్యర్థులు స్వీట్లు పంచుకుంటారని పదేపదే టీఆర్ఎస్ నేత కేటీఆర్ ఎద్దేవా చేస్తున్నారు.

Similar News