ప్చ్...బ్యాడ్ డేస్...!!!

Update: 2018-12-01 15:30 GMT

ఒకరిని మించి మరొకరు హామీలు గుప్పిస్తున్నారు. ప్రజలను కూర్చోబెట్టి పోషించేస్తామంటున్నారు. మాకు ఓటు వేయండి చాలు, మీ ఇంటికే సమస్తం తెచ్చిపెట్టేస్తామంటున్నారు. సంక్షేమ పథకాల రూపంలో సాగుతున్న సంతర్పణకు అడ్డూ అదుపు లేదు. ఇప్పటికే ఖజానాపై పెనుభారంగా మారిన ఖర్చును కాసింత కూడా పట్టించుకోవడం లేదు. ఓట్లు నొల్లుకోవడమొక్కటే లక్ష్యంగా నేలవిడిచి సాము చేస్తున్నారు. ప్రజల అవసరాలు, జీవనప్రమాణాలతో సంబంధం లేకుండా సాగుతున్న నిధుల వితరణ దుర్వినియోగానికి దారితీస్తోంది. ఖజానాను కొల్లగొడుతోంది. మౌలిక వసతుల కల్పన, దీర్ఘకాల అవసరాలు, భవిష్యత్తు తరాలకు పెట్టుబడి వంటివాటిని పార్టీలు పూర్తిగా విస్మరిస్తున్నాయి. వాగ్దానాల వరదలో కొట్టుకుపోతున్నాయి. అధికారంలో ఉన్నవారు, అధికారంలోకి రావాలని భావిస్తున్నవారు పోటాపోటీ హామీలతో ఆర్థిక పరిస్థితిని అస్తవ్యస్తం చేయాలని చూస్తున్నారు. ఎన్నికల ముంగిట్లో తెలంగాణలో సాగుతున్న ఈజాతర జనంపై మాయల వల విసురుతోంది.

సొమ్మెక్కడిది...?

తెలంగాణ చిన్నరాష్ట్రమే. అదృష్టం కొద్దీ ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోవడంతో మిగులు బడ్జెట్ దక్కింది. దేశంలోని చాలా తక్కువ రాష్ట్రాలకు మాత్రమే లోటు లేని ఆర్థిక వ్యవస్థ ఉంది. వారసత్వంగా పరిపుష్టమైన వనరులు తెలంగాణకు లభించాయి. సేవారంగం నుంచి వేల కోట్ల రూపాయల ఆదాయం. హైదరాబాదు వంటి అతిపెద్ద నగరం నుంచి లభించే వివిధ రూపాల ఆదాయం. విద్య, వైద్య సౌకర్యాల సమ్రుద్ధి, నగరీకరణ ఫలితాల వంటివన్నీ మంచి శకునాలే. 15 నుంచి 20 వేల కోట్ల రూపాయల మిగులుతో చక్కని ప్రణాళికను తయారు చేసుకునే అవకాశం తెలంగాణకు దక్కింది. రాజకీయాధికారాన్ని సుస్థిరపరచుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పక్కదారి పట్టింది. పార్టీ పగ్గాల నుంచి పట్టుజారిపోకుండా చూసుకొనే లక్ష్యంతో నిధుల ప్రవాహాన్ని పారించారు. సంక్షేమ పథకాలు, రాయితీల పద్దును బడ్జెట్లో మూడోవంతుకు చేర్చేశారు. ఉద్యోగుల జీతభత్యాలు దీనికి అదనం. మౌలిక వసతుల కల్పన, విద్య,వైద్యరంగాలపై వెచ్చింపు వంటివాటిని పక్కన పెట్టేశారు. దీంతో భవిష్యత్ తరాల ప్రగతికి పెట్టుబడిగా భావించాల్సిన రంగాలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. తాజాగా మేనిఫెస్టోల్లో అన్ని పార్టీలు ఏటా 70 వేల కోట్ల రూపాయల పైచిలుకు వ్యయమయ్యే వాగ్దానాలను గుప్పించాయి. నిధులు ఎక్కడ్నుంచి తెచ్చిపెడతారనేదే ఇప్పుడు సమస్య. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఒడిదొడుకులతోనే ఆర్థికప్రస్థానం మొదలు కాబోతోంది.

అప్పుల కుప్ప...

ఎన్నికలు జరిగిన వెంటనే అధికారంలోకి వచ్చే సర్కారుకు తొలి సవాలు బడ్జెట్ మేనేజ్ మెంట్. డిసెంబరు నెల నుంచే బడ్జెట్ కు సంబంధించి నిధుల కేటాయింపుపై కసరత్తు చేయాల్సి ఉంటుంది. డిసెంబరు 12 వ తేదీనాటికి కొత్త ప్రభుత్వం ఏ పార్టీదో తేలిపోతుంది. ఇప్పటికే వివిధ శాఖలు తమ అవసరాలకు సంబంధించిన డిమాండ్లను ఆర్థిక శాఖకు సమర్పించాయి. నూతన సర్కారు కొలువుదీరాక మళ్లీ రివైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రాధాన్యతలు మారతాయి. రైతు రుణమాఫీ, నిరుద్యోగభృతి, పింఛన్ల మొత్తం పెంపుదల వంటివాటికి పెద్దమొత్తాల్లోనే కేటాయింపులు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి పాత లెక్కల ఆధారంగానే ఆయా శాఖలు డిమాండ్లు ఇచ్చాయి. రైతు రుణమాఫీకి కొత్తగా పద్దు పెట్టాలి. 20 వేల కోట్ల రూపాయల వరకూ అవసరమవుతాయని అంచనా. వెయ్యిరూపాయలు ఇస్తున్న ఆసరా, ఇతర పింఛన్లను రెండు వేల రూపాయల పైచిలుకు చేయాల్సి ఉంటుంది. నిరుద్యోగులకు ఇచ్చేందుకు కనీసం అయిదు వేల కోట్ల రూపాయలు అవసరమవుతాయని అంచనా. రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణకు అరవై వేల కోట్ల రూపాయల అప్పు వచ్చింది. ఈ నాలుగున్నర సంవత్సరాల్లో దానిని మరో రెండు రెట్లు పెంచేశారు. అప్పుల పద్దు దాదాపు రెండు లక్షల కోట్లకు చేరింది. కొత్త ప్రణాళికలకు నిధులు ఎలా తెస్తారనేది సమస్య.

అర్థరహితం....

అన్నిపార్టీలు ఇంచుమించు ఒకే రకమైన మేనిఫెస్టోలతో ముందుకు వచ్చాయి. రైతురుణమాఫీ, నిరుద్యోగభృతి, పింఛన్ల వంటివాటిలో ఒకే భావన వ్యక్తమైంది. ఎంతమొత్తంలో ఇవ్వాలనే విషయంలో తేడాలున్నాయి తప్పితే, ఇవ్వడం ఖాయమని పార్టీలు కంకణం కట్టుకున్నాయి. ఇంటికోసం దరఖాస్తు పెట్టుకుంటే చాలు అయిదువేల రూపాయల అద్దె చెల్లిస్తామంటూ కేంద్రంలో అధికారంలో ఉన్న జాతీయపార్టీ హామీ ఇవ్వడం అనేది విచిత్రమైన విషయం. రెండు పడకల ఇల్లు కట్టి ఇచ్చేవరకూ ఏడాదికి 50వేల రూపాయలు ఇస్తామంటూ మరొక జాతీయ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది. అమరవీరుల కుటుంబాలనూ మరోసారి గుర్తు చేసుకున్నాయి. బాధితులకు తగు సాయాన్ని ఇప్పటికే ప్రభుత్వం అందచేసింది. కొత్తగా మళ్లీ వారి విషయాన్ని ప్రస్తావనకు తేవడం ద్వారా సెంటిమెంటును రగిలించే ప్రయత్నం చేశారు. పార్టీలు నేల విడిచి సాము చేస్తున్న తీరుకు ఎన్నికల ప్రణాళికలు అద్దం పట్టాయి. రోడ్లు, మంచినీరు, విద్య,వైద్యం, ఉపాధి అవకాశాలు, పరిశ్రమల వంటివి ప్రజల జీవనప్రమాణాలు పెంచుతాయి. భవిష్యత్తు తరాలకు బాసటగా నిలుస్తాయి. వాటిని విస్మరించి అప్పు చేసి పప్పుకూడు తరహాలో వ్యక్తిగత సంక్షేమ పథకాలకు వేల కోట్ల నిధులను వెచ్చించాలనుకోవడం దురదృష్టకరం.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News