మంత్రులయ్యేది వీళ్లేనట…!!

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. ప్రభుత్వం ఏర్పడి రెండున్నర నెలలు గడుస్తున్న మంత్రివర్గం ఏర్పాటు మాత్రం వాయిదా వేస్తూ వచ్చారు. దీంతో [more]

Update: 2019-02-16 09:30 GMT

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. ప్రభుత్వం ఏర్పడి రెండున్నర నెలలు గడుస్తున్న మంత్రివర్గం ఏర్పాటు మాత్రం వాయిదా వేస్తూ వచ్చారు. దీంతో అధికార టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మంత్రివర్గ విస్తరణ తేదీ కోసం ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా మంత్రివర్గంలో స్థానం ఆశిస్తున్న వారు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అయితే, ముహూర్తాలు పక్కాగా నమ్మే ముఖ్యమంత్రి కేసీఆర్ ఎట్టకేలకు మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు చేశారు. ఈ నెల 19వ తేదీన మాఘశుద్ధ పౌర్ణమి నాడు ఉదయం 11.30 గంటలకు కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీంతో మంత్రివర్గంలో స్థానం ఎవరికి దక్కుతుందనే ఉత్కంఠ ఆశావహుల్లో తారస్థాయికి చేరింది.

హైదరాబాద్, రంగారెడ్డిలో ఎవరికి..?

సామాజకవర్గ సమీకరణలతో పాటు జిల్లాలను పరిగణలోకి తీసుకొని ఎవరికి మంత్రి వర్గంలో స్థానమివ్వాలనేది కేసీఆర్ సుదీర్ఘ కసరత్తు చేశారు. అయితే, మొదట 10 మందిని మాత్రమే మంత్రివర్గంలోకి తీసుకొని పార్లమెంటు ఎన్నికలు, ఇతర పార్టీల నుంచి చేరికల తర్వాత మిగతా స్థానాలను భర్తీ చేసే అవకాశం ఉంది. గతసారి కూడా ఆయన ఇదే పద్ధతి అవలంభించారు. మరి, ఈ 10 మందిలో ఎవరు ఉంటారనేది ప్రశ్నగా మారింది. మొదట హైదరాబాద్ విషయానికి వస్తే ఇప్పటికే మహమూద్ అలీకి స్థానం దక్కింది. ఇంకొకరికి ఫస్ట్ ఫేజ్ లో అవకాశం ఇవ్వవచ్చు. ఈ ఒక్క స్థానానికి మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు గౌడ్ రేసులో ఉన్నారు. ఇక, రంగారెడ్డి జిల్లా నుంచి మాజీ మంత్రి మహేందర్ రెడ్డి ఓడిపోవడంతో ఆయన స్థానంలో ఎవరిని తీసుకుంటారనేది తెలియడం లేదు. అయితే, ఆయన తప్పుడు నరేందర్ రెడ్డి కొడంగల్ లో రేవంత్ ను ఓడించినందున ఆయనను క్యాబినెట్ లోకి తీసుకునే అవకాశం ఉందంటున్నారు. ఇక మహబూబ్ నగర్ జిల్లాలో జూపల్లి కృష్ణారావు ఓడిపోవడంతో రేసులోకి నిరంజన్ రెడ్డి వచ్చారు. ముఖ్యమంత్రికి సన్నిహితులుగా పేరున్న ఆయనకు క్యాబినెట్ బెర్త్ పక్కా అంటున్నారు. ఇదే జిల్లా నుంచి మాజీ మంత్రి లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ గౌడ్ కూడా రేసులో ఉన్నారు.

సీనియర్ ఎమ్మెల్యేలకు ఛాన్స్….

నల్గొండ జిల్లాలో జగదీశ్ రెడ్డికి మరోసారి బెర్త్ ఖాయం అంటున్నారు. ఆయనతో పాటు గుత్తా సుఖేందర్ రెడ్డికి కూడా అవకాశం దక్కుతుందనే ఊహాగానాలు ఉన్నాయి. పార్టీలో చేరినప్పుడు ఆయనకు ఈమేరకు కేసీఆర్ హామీ ఇచ్చి ఉన్నారు. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డికి కూడా ఛాన్స్ ఖాయం అంటున్నారు. ఖమ్మం జిల్లాలో ఓడిపోయిన తుమ్మల నాగేశ్వరరావుకు మరోసారి ఛాన్స్ దక్కకపోవచ్చు. జిల్లాలో టీఆర్ఎస్ కు పువ్వాడ అజయ్ ఒక్కరే ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే, టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య టీఆర్ఎస్ లో చేరితే మంత్రిపదవి ఇస్తారని ప్రచారం ఉంది. కానీ, మొదటి విడతలో ఆయనకు దక్కే అవకాశం లేదు. వరంగల్ జిల్లాలో సీనియర్ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావుకు బెర్త్ ఖాయంగా తెలుస్తోంది. అయితే, చందూలాల్ స్థానంలో రెడ్యా నాయక్ ను తీసుకుంటారనే ప్రచారమూ ఉంది. ఇక, టీఆర్ఎస్ లో మొదటి నుంచీ ఉంటున్న వినయ్ భాస్కర్ కూడా మున్నూరుకాపు కోటాలో రేసులో ఉన్నారు. కడియంను ఈసారి పక్కకు పెడతారని తెలుస్తోంది. కరీంనగర్ జిల్లాలో ఈటెల రాజేందర్ కు మరోసారి అవకాశం దక్కనుంది. ఇక, ఎస్సీ కోటాలో కొప్పుల ఈశ్వర్ కూడా రేసులో ఉన్నారు. కేటీఆర్ ను మొదటి విడతలో క్యాబినెట్ లోకి తీసుకునే అవకాశం లేదంటున్నారు.

మెదక్ లో తీవ్ర పోటీ…

మెదక్ జిల్లాలో క్యాబినెట్ భర్తీ కోసం పోటీ తీవ్రంగా ఉంది. హరీష్ రావుకు క్యాబినెట్ బెర్త్ కన్ఫర్మ్. మరో స్థానం కోసం దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి, మహిళా కోటాలో పద్మా దేవేందర్ రెడ్డి మంత్రిపదవులు ఆశిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో పోచారం శ్రీనివాస్ రెడ్డిని స్పీకర్ గా తీసుకోవడంతో ఆయన స్థానంలో ప్రశాంత్ రెడ్డిని క్యాబినెట్ లోకి తీసుకుంటారనే ప్రచారం ఉంది. బాజిరెడ్డి గోవర్ధన్, గంప గోవర్ధన్ కూడా రేసులో ఉన్నారు. ఇక, అదిలాబాద్ జిల్లాలో ఇంద్రకరణ్ రెడ్డి, జోగు రామన్న మరోసారి క్యాబినెట్ బెర్త్ ఆశిస్తున్నారు. వీరిలో ఒకరికే ఫస్ట్ ఫేజ్ లో అవకాశం దక్కనుంది. మొత్తానికి 10 మందిని క్యాబినెట్ లో తీసుకుంటారని తెలుస్తుండగా కనీసం 20 మందికి పైగా ఎమ్మెల్యేలు క్యాబినెట్ రేసులో ఉన్నారు.

Tags:    

Similar News