ఈటెల చెప్పింది కరెక్టేగా ?

సమాజంలో మార్పు రాకుండా చట్టాలు చేసినా, ఎన్ కౌంటర్లు చేసినా ప్రయోజనం లేదు. మొబైల్, టివి లు అందుబాటులోని సాంకేతిక విజ్ఞానం పిల్లల భవిష్యత్తు నాశనం చేస్తుంది. [more]

Update: 2019-12-15 09:30 GMT

సమాజంలో మార్పు రాకుండా చట్టాలు చేసినా, ఎన్ కౌంటర్లు చేసినా ప్రయోజనం లేదు. మొబైల్, టివి లు అందుబాటులోని సాంకేతిక విజ్ఞానం పిల్లల భవిష్యత్తు నాశనం చేస్తుంది. తల్లితండ్రులు వీటికి పరిష్కారాలు వెతకాలి. ఇంటి నుంచి బయటకు వెళ్ళి తిరిగి వచ్చే వరకు గ్యారంటీ లేదు. ఈ మాటలు అన్నది తెలంగాణ మంత్రి ఈటెల రాజేందర్. నిర్భయ చట్టం వున్నా, దిశా ఘటన చోటు చేసుకుంది. ఆ తరువాత ఆ కేసులో నిందితుల్ని పోలీసులు కాల్చి పారేశారు. అయినా కానీ ఆడపిల్లలపై అఘాయిత్యాలు ఏ మాత్రం ఆగకపోవడం ఇప్పుడు అందరిని కలవరపరుస్తోంది.

మూలాల్లోకి వెళితేనే….

ఈ నేపథ్యంలోనే మంత్రి ఈటెల రాజేందర్ నిర్మొహమాటంగా ఈ అంశాలను ఒక సభలో ప్రస్తావించి చర్చకు తెరతీశారు. ఏ ప్రభుత్వం అధికారంలో వున్నా, చట్టాలు ఎన్ని వచ్చినా పోలీసులు ఎన్ కౌంటర్లు చేస్తున్నా నేరాలు అదుపులోకి రావడంలేదు. దీనికి ప్రధాన కారణం ఏమిటి ? ఈ సమస్య మూలాల్లోకి వెళ్ళి పరిష్కారాన్ని వెతకాలిసిన సమయం ఆసన్నం అయ్యిందని ఈటెల రాజేందర్ సూటిగానే చెప్పారు.

ఏపీలో దిశా చట్టం వచ్చినా ….

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్ట్టించిన దిశా ఘటన తరువాత ఎపి లోని జగన్ సర్కార్ సీరియస్ గా స్పందించింది. మహిళలపై అత్యాచారాల నిరోధానికి అత్యంత కఠినమైన చట్టాన్ని తీసుకువచ్చి దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ చట్టం ప్రకారం పూర్తి ఆధారాలు దర్యాప్తులో లభిస్తే 21 రోజుల్లో అత్యాచారానికి ఉరి శిక్ష పడుతుంది. ఈ చట్టం పై ఎపి శాసనసభలో సుదీర్ఘ చర్చే నడిచింది. విస్తృతంగా ప్రజల్లో ప్రసారమాధ్యమాలు ద్వారా ప్రచారం సాగింది.

ఆందోళనే కదా మరి….

అయినప్పటికీ ఎపి లో మహిళలపై అత్యాచారాల ప్రకంపనలు కొనసాగుతున్నాయి. ప్రకాశం జిల్లాలో మూగ బాలిక పై అత్యాచార ఘటన, గుంటూరు జిల్లాలో చిన్నారిపై అత్యాచారం, కృష్ణా జిల్లాలో తల్లే మైనర్ కూతురు ని ప్రియుడితో అత్యాచారం చేయించిన ఘటన, పాడేరులో గిరిజన విద్యార్థిని అనుమానాస్పద మృతి ఇలా ఒకటి రెండు రోజుల్లోనే దిశా చట్టం వచ్చాక జరగడం ఆందోళన రేకెత్తిస్తుంది. ఈ నేపథ్యంలో సమాజంలో ప్రభుత్వాల బాధ్యతే కాకుండా తల్లితండ్రుల బాధ్యత ముఖ్యంగా పిల్లల పెంపంకం నైతిక విలువలతో సాగేలా చూడటం మొబైల్, టివి ఇంటర్నెట్ ల వంటి వాటి వాడకంలో చిన్నారుల తీరు గమనిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలిసి వుంది.

Tags:    

Similar News