అభ్యర్థులు కావలెను..!

పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ కాంగ్రెస్ లో అతివృష్ట.. అనావృష్టి కనిపిస్తోంది. కొన్ని పార్లమెంటు స్థానాల నుంచి పోటీ చేయడానికి నేతల మధ్య పోటీ ఎక్కువగా [more]

Update: 2019-02-07 18:29 GMT

పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ కాంగ్రెస్ లో అతివృష్ట.. అనావృష్టి కనిపిస్తోంది. కొన్ని పార్లమెంటు స్థానాల నుంచి పోటీ చేయడానికి నేతల మధ్య పోటీ ఎక్కువగా ఉంటే మరికొన్ని స్థానాల్లో పోటీకి అభ్యర్థులే కరువయ్యేలా ఉన్నారంట. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే ఇందుకు కారణంగా. ఆ ఫలితాలను బేరీజు వేసుకుంటున్న నేత కాస్తోకూస్తో కష్టపడితే గెలచే అవకాశం ఉందని అనుకున్న పార్లమెంటు స్థానాల్లో పోటీకి ఎక్కువ మంది ఉత్సాహం చూపుతున్నారు. ఎట్టి పరిస్థితిలో గెలిచే అవకాశం లేదనుకుంటున్న స్థానాల్లో మాత్రం పోటీకి ఎవరూ మొగ్గు చూపడం లేదట. అధిష్ఠానం ఒత్తిడి చేసే నిలబెడితే తప్ప ఎన్నికల్లో నిలిచేందుకుకు ఎవరూ ముందుకు రాకపోవచ్చు అంటున్నారు.

గెలుస్తామన్న చోట్లనే…

అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను బట్టి చూస్తే ఖమ్మం పార్లమెంటు స్థానంలో ప్రజా కూటమికి ఎక్కువ ఓట్లు వచ్చాయి. ఇక, మహబూబాబాద్, భువనగిరి స్థానాల్లో టీఆర్ఎస్ కంటే 50 వేల లోపు ఓట్లు కాంగ్రెస్ కు తక్కువొచ్చాయి. ఇక, నల్గొండలో లక్ష ఓట్ల తేడా ఉంది. దీంతో ఈ స్థానాలు కష్టపడితే గెలిచే అవకాశం ఉందని నేతలు భావిస్తున్నారు. ఇక్కడి నుంచి పోటీకి ఆశావహులు పెరుడుతున్నారు. ఖమ్మం స్థానాన్ని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి, మాజీ ఎంపీ రేణుకా చౌదరి ప్రయత్నిస్తున్నారు. ఇక, మహబూబాబాద్ లో మాత్రం మళ్లీ మాజీ కేంద్రమంత్రి బలరాంనాయక్ పోటీ చేసే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీకి పట్టున్న నల్గొండ జిల్లాలోని రెండు సీట్లకూ పోటీ బాగానే ఉంది. నల్గొండ స్థానాన్ని మాజీ మంత్రలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జానారెడ్డి, సూర్యాపేట అసెంబ్లీ టిక్కెట్ ఆశించి భంగపడ్డ పటేల్ రమేష్ రెడ్డి ఆశిస్తున్నారు. కోమటిరెడ్డి ఇప్పటికే తాను ఎంపీగా బరిలో ఉంటానని ప్రకటించారు. అయితే, అధిష్ఠానం పటేల్ రమేష్ రెడ్డికి ఈ టిక్కెట్ పై మాటిచ్చిందని తెలుస్తోంది.

నల్గొండ, మహబూబ్ నగర్ లో పోటీ…

ఇక, నల్గొండ జిల్లాలోనే ఉన్న భువనగిరి స్థానానికి కూడా గట్టి పోటీనే ఉంది. కోమటిరెడ్డికి నల్గొండ ఇవ్వకపోతే భువనగిరి స్థానం కావాలంటున్నారని సమాచారం. ఇక, ఇప్పటికే ఆ స్థానాన్ని పీసీసీ కోశాధికారి గుడూరు నారాయణరెడ్డి, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి తనయుడు సర్వోత్తం రెడ్డి ఆశిస్తున్నారు. ఇక, మహబూబ్ నగర్ జిల్లాలోని రెండు స్థానాలకు కాస్తోకూస్తో పోటీ ఉంది. మహబూబ్ నగర్ లో ఇప్పటికే జైపాల్ రెడ్డి పోటీకి సిద్ధంగా ఉన్నారు. అయితే, ఇటీవలి ఎన్నికల్లో ఓడిపోయిన రేవంత్ రెడ్డి, డీకే అరుణ కూడా ఇక్కడి నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారట. ఇక, నాగర్ కర్నూల్ ఎస్సీ రిజర్వుడ్ స్థానం నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన మల్లు రవితో పాటు సంపత్ కుమార్ ఆశిస్తున్నారు. వీటికి మినహా మిగతా స్థానాల్లో అభ్యర్థులు దొరకడమే కష్టంగా ఉందట.

మాజీ ఎంపీలు రంగంలోకి దిగుతారా..?

అయితే, మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్(కరీంనగర్), మధు యాషి(నిజామాబాద్), అంజన్ కుమార్ యాదవ్(సికింద్రాబాద్) మళ్లీ పోటీ చేయనున్నారు. ఇక, వరంగల్, మల్కాజిగిరి స్థానాలకు అభ్యర్థులు లేరు. సర్వే సత్యనారాయణ పార్టీలో ఉన్నారా లేదా చెప్పలేని పరిస్థితి. టీఆర్ఎస్ కు అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దఎత్తున మెజారిటీ వచ్చిన స్థానాల్లో పోటీ చేయడానికి నేతలంతా జంకుతున్నారు. పోటీ చేసే పరువు పోగొట్టుకోవడం కంటే సైలెంట్ గా ఉంటేనే మేలని చూస్తున్నారు. మరి, ఏం జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News