ఇంకా కోలుకోకుంటే ఎలా…?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్న కాంగ్రెస్ పార్టీ నెలన్నర గడిచినా ఇంకా కోలుకోవడం లేదు. ఓటమికి కారణాలను సైతం పూర్తిగా విశ్లేషించలేకపోయిన ఆ పార్టీ పార్లమెంటు [more]

Update: 2019-01-27 02:30 GMT

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్న కాంగ్రెస్ పార్టీ నెలన్నర గడిచినా ఇంకా కోలుకోవడం లేదు. ఓటమికి కారణాలను సైతం పూర్తిగా విశ్లేషించలేకపోయిన ఆ పార్టీ పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్నా తేరుకోవడం లేదు. ఊహించని స్థాయిలో ఓటమి ఎదురవడంతో పార్టీ ముఖ్య నేతలు సైతం ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక, క్యాడర్ అయితే పూర్తి నైరాశ్యంలో ఉంది. ఇక, గ్రామ పంచాయితీలకు జరుగుతున్న ఎన్నికల్లోనూ అసెంబ్లీ ఎన్నికల వంటి ఫలితాలే వస్తున్నాయి. ఇప్పటివరకు ముగిసిన రెండు విడతల పంచాయితీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ మద్దతుదారులు 60 శాతానికి పైగా గ్రామాలను దక్కించుకున్నారు. ఇక, గ్రామస్థాయిలో బలంగా ఉండే కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు సుమారు 20 శాతం స్థానాలను మాత్రమే గెలుచుకున్నారు. అయితే, పంచాయితీ ఎన్నికలను పట్టించుకోకున్నా… త్వరలో జరిగే పార్లమెంటు ఎన్నికలను కూడా ఆ పార్టీ పెద్దగా పట్టించుకోవడం లేదు. మరో మూడు నెలల్లో ఎన్నికలు జరగనున్నా ఇంతవరకు అందుకు సన్నద్ధమవుతున్న పరిస్థితి లేదు.

నాయకత్వ మార్పు ఉండదా..?

అసెంబ్లీ ఎన్నికలపై భారీగా ఆశలు పెట్టుకున్న ఆ పార్టీ ఓడిపోయింది. అయితే, ఎందుకు ఓడిపోయాము..? తప్పు ఎక్కడ జరిగింది..? అనే దిశగా ఆ పార్టీ పెద్దగా ఆలోచన చేయలేదు. కేవలం ఒకటి రెండు సార్లు మాత్రం సమీక్షలు జరిపి ఊరుకున్నారు. ఇక, నేతలు మాత్రం ఒటమికి తలా ఒక కారణం చెబుతున్నారు. ఇక, కొందరు నేతలు పీసీసీ నాయకత్వాన్ని మార్చాలంటున్నారు. మరికొందరేమో తమకు పీసీసీ చీఫ్ పదవి కావాలనుకుంటున్నారు. అయితే, ఇప్పటికిప్పుడు పీసీసీ నాయకత్వాన్ని మార్చే సాహసం కాంగ్రెస్ అధిష్ఠానం చేసే అవకాశం లేదు. ఉత్తమ్ సారథ్యంలోనే పార్లమెంటు ఎన్నికలకు వెళ్లాలి. అయినా ఆయన కూడా పార్లమెంట్ ఎన్నికలను పెద్దగా పట్టించుకోవడం లేదు. ఎక్కువ ఆయన స్వంత నియోజకవర్గం హుజుర్ నగర్ కి పరిమితం అవుతున్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లానే చేస్తే కష్టమేనా..?

కాంగ్రెస్ పార్టీకి ఈ పార్లమెంటు ఎన్నికలు చాలా కీలకం కానున్నాయి. కేంద్రంలో అధికారంలోకి రావాలంటే తెలంగాణ నుంచి ఎన్నో కొన్ని ఎంపీ సీట్లు గెలవాల్సిన అవసరం ఉంది. గత ఎన్నికల్లో కేవలం 2 స్థానాలకు మాత్రమే ఆ పార్టీ పరిమితం అయ్యింది. ఇక, ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్లను బట్టి చూస్తే ఈసారి కూడా ఖమ్మం, మహబూబాబాద్ మినహా మిగతా స్థానాలను గెలుచుకునే అవకాశాలు కాంగ్రెస్ కి తక్కువ ఉన్నాయి. అయితే, అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ను గెలిపించినందున పార్లీమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ వైపు ప్రజలు కొంత మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ సరిగ్గా ప్రయత్నిస్తే ఓట్ల శాతమైనా పెరిగే అవకాశం ఉంది. అయితే, ఆ దిశగా పార్టీ కృషి చేయడం లేదు. ఇక, ఎంపీ టిక్కెట్ల విషయంలోనూ కాంగ్రెస్ ఇటీవలి అసెంబ్లీ టిక్కెట్ల మాదిరి చివరి నిమిషం వరకు తేల్చకుండా నష్టపోయేలా ఉంది. ఎంపీ అభ్యర్థులను ముందే ప్రకటిస్తే కొంతమేర ప్రయోజనం కలిగే అవకాశముంది. ఓ పక్క కాంగ్రెస్ పరిస్థితి ఇలా ఉంటే టీఆర్ఎస్ మాత్రం దూకుడుగా ఉంది. 17 స్థానాల్లో 16 స్థానాలు కైవసం చేసుకునే దిశగా ఆ పార్టీ కసరత్తు చేస్తోంది. ఇక, కాంగ్రెస్ తేరుకోకపోతే మాత్రం తెలంగాణపై ఆ పార్టీ ఆశలు వదులుకోవల్సిందే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

Tags:    

Similar News