అందరి ఆశలూ ఆ సీటు పైనే

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత ఆ పార్టీ నేతలంతా పార్లమెంటు ఎన్నికలపై దృష్టి సారించారు. అసెంబ్లీ కలిసిరాకపోయినా పార్లమెంటు ఎన్నికల్లో అయినా సత్తా చాటాలని [more]

Update: 2019-02-19 00:30 GMT

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత ఆ పార్టీ నేతలంతా పార్లమెంటు ఎన్నికలపై దృష్టి సారించారు. అసెంబ్లీ కలిసిరాకపోయినా పార్లమెంటు ఎన్నికల్లో అయినా సత్తా చాటాలని భావిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన సీనియర్ నేతలు సైతం పార్లమెంటు ఎన్నికల్లో టిక్కెట్ల కోసం అధిష్ఠానానికి అర్జీ పెట్టుకుంటున్నారు. అయితే, రాష్ట్రంలోని మొత్తం 17 పార్లమెంటు స్థానాల్లో ఎక్కువ డిమాండ్ మాత్రం ఖమ్మం సీటుకే ఉంది. ఈ స్థానం నుంచి పోటీ చేసేందుకు స్థానిక నేతలతో పాటు స్థానికేతర నాయకులు కూడా ఉత్సాహం చూపుతుండటంతో ఆ పార్టీలో విభేదాలు మొదలయ్యాయి. ఈ స్థానాన్ని ఆశిస్తున్న సీనియర్ నాయకురాలు రేణుక చౌదరి అయితే ఏకంగా ఖమ్మం పార్లమెంటు టిక్కెట్ తనకు ఇవ్వకపోతే పార్టీలో ఉండి కూడా లాభం లేదని, పార్టీకి రాజీనామా చేయడమే మేలన్నట్లుగా సీరియస్ కామెంట్స్ చేశారు. పార్టీకి నమ్మకస్థురాలైన ఆమె ఇంత సీరియస్ వ్యాఖ్యలు చేయడానికి కారణం ఈ టిక్కెట్ కోసం పోటీ ఎక్కువ కావడమే అంటున్నారు.

రేసులోకి కొత్త వారు రావడంతో…

అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ అనుకూల పవనాలు వీచినా ఖమ్మంలో మాత్రం కాంగ్రెస్ విజయబావుటా ఎగరేసింది. దీంతో ఖమ్మం స్థానం నుంచి పోటీ చేస్తే విజయం సులువవుతుందని కాంగ్రెస్ నేతలు చాలా మంది భావిస్తున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన రేణుకా చౌదరి ముందు నుంచే ఈ స్థానం తనదే అన్న ధీమాతో ఉన్నారు. అయితే, ఇటీవల వరంగల్ ఈస్ట్ స్థానం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిన వద్దరాజు రవిచంద్ర(గాయత్రి రవి)కి ఈ ఈ టిక్కెట్ కేటాయిస్తారన్న ప్రచారం జరుగుతోంది. పీసీసీ పెద్దలతో సన్నిహిత సంబంధాలు ఉన్న ఆయన పార్టీకి అనేక విధాలుగా సహకరించారు. పైగా ఆర్థికంగానూ బలంగా ఉన్నారు. దీంతో ఈ స్థానం ఈయనకు దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

స్థానికేతర నేతలు సైతం

ఇక, తాజాగా సీనియర్ నేత వి.హనుమంతరావు ఏకంగా హైదరాబాద్ నుంచే ఖమ్మం సీటును టార్గెట్ చేశారు. ఖమ్మం టిక్కెట్ తనకు ఇవ్వాలంటూ అధిష్ఠానానికి దరఖాస్తు చేసుకున్నారు. 2014 ఎన్నికల్లో అంబర్ పేట నుంచి పోటీ చేసి నాలుగో స్థానంలో నిలిచిన ఆయన 2018 ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. ఇప్పుడు అవకాశం వస్తే పార్లమెంటులో అడుగుపెట్టాలనుకుంటున్నారు. ఇక, రాష్ట్ర కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్ పర్సన్ గా ఉన్న విజయశాంతి కూడా ఇక్కడి నుంచి పోటీ చేసి గెలవాలనుకుంటున్నారట. ఇక, ఖమ్మం జిల్లా నేత, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి అయితే ఏకంగా పార్టీ అధినేత రాహుల్ గాంధీనే ఇక్కడి నుంచి పోటీ చేయాలని కోరారు. మరికొందరు సీనియర్లు కూడా ఖమ్మం టిక్కెట్ కోసం అధిష్ఠానం వద్ద ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించారట. మొత్తానికి ఖమ్మం పార్లమెంటు సీటు కాంగ్రెస్ హాట్ సీట్ గా మారింది.

Tags:    

Similar News