ఉత్తమ్ కు మరో ఆరు నెలలు రిలాక్స్ టైమ్

కాంగ్రెస్ అసలే కష్టాల్లో ఉంది. అంతర్గత కుమ్ములాటలతో అల్లాడిపోతోంది. సీినియర్లు, జూనియర్ల మధ్య వార్ బాగా ముదిరిపోయింది. దీంతో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్ష్య పదవిపై ఇప్పుడప్పుడే [more]

Update: 2020-09-01 09:30 GMT

కాంగ్రెస్ అసలే కష్టాల్లో ఉంది. అంతర్గత కుమ్ములాటలతో అల్లాడిపోతోంది. సీినియర్లు, జూనియర్ల మధ్య వార్ బాగా ముదిరిపోయింది. దీంతో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్ష్య పదవిపై ఇప్పుడప్పుడే నిర్ణయం తీసుకునే అవకాశం కన్పించడం లేదు. మరో ఆరు నెలల్లో ఏఐసీసీ ప్లీనరీ జరుగుతుంది. ఆ ప్లీనరీలో కొత్త అధ్యక్షుడిగా రాహుల్ గాంధీని ఎన్నుకునే అవకాశాలున్నాయి. అప్పడే తెలంగాణ పీసీసీ అధ్యక్ష్య పదవిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశముందంటున్నారు.

తెలంగాణపై దృష్టి పెట్టే…..

ప్రస్తుతం సోనియా గాంధీ కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షుడిగా ఉన్నారు. అసలే అనారోగ్యంతో ఉన్న సోనియా గాంధీ త్వరలో ఎన్నికలు జరగనున్న బీహార్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు వంటి వాటిపై తప్ప ఇతర రాష్ట్రాలపై దృష్టి సారించే అవకాశాలు లేవు. దీంతో తెలంగాణ పీసీసీ కి నూతన అధ్యక్షుడి నియామకం కూడా ఇప్పట్లో జరిగేలా లేదు. తెలంగాణలో సాధారణ ఎన్నికలు మరో మూడేళ్లు ఉండటంతో ఇప్పట్లో పీసీపీ చీఫ్ ను మార్చే ఉద్దేశ్యం లేదు.

రాహుల్ వచ్చిన తర్వాతనే…

రాహుల్ గాంధీ బాధ్యతలను చేపట్టిన తర్వాతనే తెలంగాణకు నూతన అధ్యక్షుడి నియామకం ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుత పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పదవీకాలం ఎప్పుడో పూర్తయింది. ఆయన కూడా పీసీసీ చీఫ్ గా కొనసాగేందుకు ఇష్టం లేదు. ఈ విషయాన్ని హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీగా ఎన్నిక కావడంతో రాష్ట్ర రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. కానీ కాంగ్రెస్ అధిష్టానం కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేయకపోవడంతో ఆయనే కంటిన్యూ అవుతున్నారు.

పోటీ ఎక్కువగానే ఉన్నా……

పీసీసీ అధ్యక్ష పదవికి చాలా మంది పోటీ పడుతున్నారు. పీసీసీ అధ్యక్ష పదవికి సరైన నేత దొరకకపోవడం వల్లనే కాంగ్రెస్ అధిష్టానం ఇన్నాళ్లూ నాన్చిందంటున్నారు. పొరుగునే ఉన్న ఏపీకి కొత్త అధ్యక్షుడని నియమించి ఆరు నెలలు అవుతుంది. కానీ తెలంగాణ విషయంతో కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకోక పోవడానికి సరైన నేత లేకపోవడం, అందరిని కలుపుకుని వెళ్లే నాయకుడు కరువవ్వడతోనే ఆలస్యం చేస్తూ వస్తుంది. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో మరో ఆరునెలలు పీసీసీ అధ్యక్షుడిని మార్చే అవకాశాలు కన్పించడం లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కొనసాగనున్నారు.

Tags:    

Similar News