అక్షరం అబ్బకపోయినా.....!

Update: 2018-06-08 18:29 GMT

తేజస్వీ యాదవ్.... బీహార్ రాజకీయాల్లో తెరపైకి వచ్చిన కొత్తతరం నాయకుడు. విపక్ష నేతగా వెలుగులీనుతూ ప్రభుత్వాన్ని ఉరుకులు, పరుగులు పెట్టిస్తున్నారు. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత, మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ రెండో కుమారుడైన తేజస్వీ యాదవ్ రాష్ట్ర రాజకీయాల్లో కేంద్ర బిందువుగా మారారు. జాతీయ రాజకీయాల్లో గుర్తింపు పొందుతున్నారు. ఇటీవల జరిగిన కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరై జాతీయ నేతల దృష్టిలో పడ్డారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రులు సోనియా గాంధీ, మమత బెనర్జీలకు పాదాభివందనం చేసి వారి ఆశీస్సులు అందుకున్నారు. బీహార్ లో రేపటి రాజకీయం అంతా తేజస్వీ యాదవ్ దేనని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

సంక్షోభాలను అవకాశంగా......

మూడేళ్ల క్రితం వరకూ కూడా తేజస్వీ యాదవ్ ఎవరో ఎవరికీ పెద్దగా తెలియదు. లాలూ కుమారుడిగా, రంజీ క్రికెటర్ గా కొంతమందికి మాత్రమే ఆయన సుపరిచితం. 2015లో ఆర్జేడీ, జేడీయూ సంకీర్ణ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఒక్కసారి వెలుగులోకి వచ్చారు. గత ఏడాది ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆర్జేడీతో స్నేహానికి గుడ్ బై చెప్పి, ఎన్డీఏ కూటమిలో చేరడంతో తేజస్వీ సంక్షోభాన్ని ఎదుర్కొన్నారు. సీబీఐ, ఈడీ ఆయనపై అక్రమార్జన, మనీ లాండరింగ్ వంటి కేసులు మోపడంతో ఉప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని నితీష్ ఆయన్నుకోరారు. ఇందుకు తేజస్వి ససేమిరా అన్నారు. ఇదే అవకాశంగా తీసుకున్న నితీష్ ఆర్జేడీతో తెగదెంపులు చేసుకుని బీజేపీ మద్దతుతో మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. వాస్తవానికి అప్పటినుంచే తేజస్వీకి ఇబ్బందులు మొదలయ్యాయి. ఒక పక్క కేసులు, తండ్రి పశుదాణా కుంభకోణం కేసులో జైలు పాలు కావడం, తన ఉప ముఖ్యమంత్రి పదవి ఊడిపోవడం వంటి సమస్యలు ఒక్కసారిగా చుట్టుముట్టాయి. మరో పక్క పార్టీ దిక్కులేని అనాధగా మారిపోయింది. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో ఏ నాయకుడయినా..అందునా రాజకీయ అనుభవం ఏమాత్రం లేని వారు తడబడుతుంటారు. తెర వెనక్కు వెళ్లిపోతుంటారు. కానీ తేజస్వీ ఈ సమస్యను సవాల్ గా తీసుకున్నారు. సంక్షోభాన్ని అవకాశంగా మలచుకున్నారు. పార్టీ, తాను రాజకీయంగా నిలదొక్కు కోవడానికి అరుదైన అవకాశంగా భావించారు. ఈ ప్రయత్నంలో తేజస్వి విజయవంతమయ్యాడని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కేవలం 9వ తరగతితో చదువుకు స్వస్తి చెప్పి రంజీ క్రికెట్ పై ఆసక్తి పెంచుకున్న తేజస్వీ కొన్ని మ్యాచ్ లను కూడా ఆడారు. కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో 2015లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రఘోపూర్ స్థానం నుంచి అసెంబ్లీకి ఎన్నికై ఏకంగా ఉప ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. పాతికేళ్ల యువకుడు, అతి చిన్న వయస్సులో పెద్ద పదవి చేపట్టిన నేత భారత రాజకీయాల్లో ఆయన ఒక్కరే కావడం విశేషం. చిన్న వయస్సులో విపక్ష నాయకుడైందీ ఆయనే.

విజయపథాన నడుపుతూ......

తండ్రి జైలు పాలు కావడంతో తేజస్వీకి కష్టాలు ఎదురయ్యాయి. రాజకీయంగా కష్టకాలం మొదలయింది. ఒకపక్క సీబీఐ, ఈడీ కేసులు, మరోపక్క పార్టీ అనాధగా మారడంతో తేజస్వి లోని సమర్థత వెలుగు చూసింది. ఈ సమస్యలను అధగమించడంలో విజయవంతమయ్యారు. ఈ ఏడాది మార్చిలో అరారియా లోక్ సభ, జెహనాబాద్, భభువా అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో పార్టీని విజయపథాన నడిపారు. అరారియా, జెహానాబాద్ స్థానాల్లో పార్టీ అభ్యర్థులను, భభువాలో కాంగ్రెస్ అభ్యర్థిని పోటీకి నిలిపారు. అరారియా, జెహనాబాద్ ల్లో విజయంతో తేజస్వీ ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కారు. అదే ఊపుతో గత నెలలో జరిగిన జోకీహాట్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో జేడీయూ అభ్యర్థిని మట్టి కరిపించడంతో తేజస్విలోని నాయకత్వ లక్షణాలు, సమర్థత వెలుగు చూశాయి. బీజేపీతో జట్టు కట్టడాన్ని నిరసిస్తూ జేడీయూ ఎమ్మెల్యే సర్ఫరాజ్ ఆలమ్ రాజీనామా చేయడంతో ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఆలమ్ ను అంతకుముందు పార్టీలోకి చేర్చుకుని అరారియా లోక్ సభ స్థానం నుంచి గెలిపించుకున్న తేజస్వీ జాకీహాట్ లో ఆయన సోదరుడిని రంగంలోకి దించారు. ఈ సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకునేందుకు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ విశ్వ ప్రయత్నం చేశారు. సగం మంది మంత్రులను ప్రచారానికి పురమాయించారు. అయినా ఫలితం లేక పోయింది. 41 వేల భారీ మెజారిటీతో తన అభ్యర్థి షాన్ వాజ్ ఆలమ్ ను గెలిపించుకున్నారు తేజస్వీ. ఉప ఎన్నికల ఫలితాల తర్వాత ఒక్కసారిగా హీరోగా మారి పోయారు తేజస్వీ యాదవ్. జాతీయ నాయకుల దృష్టిలో పడ్డారు. వరుస విజయాలతో పార్టీ శ్రేణుల్లో ధైర్యాన్ని, ధీమాను కల్పించారు. రాష్ట్రంలోని బీజేపీయేతర పార్టీలకు పెద్ద దిక్కుగా మారారు. పెద్దగా చదువుకోకపోయినప్పటికీ పదునైన ప్రసంగాలతో ప్రజలను ఆకట్టుకునే తేజస్వీ ప్రత్యర్థులను ఎండగట్టడంలోనూ ముందుంటారు. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కు సెక్యులరిజం పట్లగల నిబద్ధతను సూటిగా ప్రశ్నిస్తూ మైనారిటీలను ఆకట్టుకుంటున్నారు. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో అధికార సాధనే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఈ ప్రయత్నంలో విజయం తథ్యమన్నది ఆయన ధీమా. చూద్దాం.. ఏం జరుగుతుందో....!

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News