తేజస్వీలో అంత జోష్ ఎందుకో?

బీహార్ లో రాష్ట్రీయ జనతా దళ్ లో ఆశలు పెరుగుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అధికార పార్టీలో జరుగుతున్న పరిణామాలు తమకు కలసి వచ్చే అంశంగా మారతాయని [more]

Update: 2020-02-14 17:30 GMT

బీహార్ లో రాష్ట్రీయ జనతా దళ్ లో ఆశలు పెరుగుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అధికార పార్టీలో జరుగుతున్న పరిణామాలు తమకు కలసి వచ్చే అంశంగా మారతాయని ఆ పార్టీ అధినేత తేజస్వియాదవ్ విశ్వసిస్తున్నారు. బీహార్ లో ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్నాయి. ప్రధానంగా కూటములతోనే అన్ని పార్టీలు ఈ ఎన్నికలకు వెళ్లనున్నాయి. బీజేపీ, జేడీయూలు ఒక కూటమిగా, రాష్ట్రీయ జనతా దళ్, కాంగ్రెస్ పార్టీలు కలసి మరో కూటమిగా ఎన్నికల బరిలోకి దిగనున్నాయి.

ఘోరంగా దెబ్బతిన్నా….

ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో తేజస్వియాదవ్ నాయకత్వంలోని ఆర్జేడీ ఘోరంగా దెబ్బతినింది. అధికార కూటమి అధిక స్థానాలను దక్కించుకుంది. అయితే అసెంబ్లీ ఎన్నికలు తమకు అనుకూలంగా మారబోతున్నాయని తేజస్వియాదవ్ అభిప్రాయపడుతున్నారు. మహారాష్ట్ర, హర్యానా, జార్భండ్, ఢిల్లీ ఎన్నికల ఫలితాలను తేజస్వి యాదవ్ గుర్తు చేస్తున్నారు. బీహార్ లో కూడా అధికార పార్టీకి ఎదురుదెబ్బ తప్పదని ఆయన ధీమాగా ఉన్నారు.

అధికార పార్టీపై…

ప్రధానంగా పౌరసత్వ చట్టం, అధికార బీజేపీ, జేడీయూ కూటమిపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నిజానికి 2015 అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ సత్తా చాటింది. అప్పట్లో ఆర్జేడీ, జేడీయూ, కాంగ్రెస్ లు కలసి మహుగడ్బందన్ గా ఏర్పడ్డాయి. ఆ ఎన్నికల్లో కూటమి 178 స్థానాల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత నితీష్ కుమార్ ఆర్జేడీతో విభేదించి బీజేపీతో చేతులు కలిపారు. రానున్న ఎన్నికల్లో కూడా తమకే ప్రజలు పట్టం కడతారని తేజస్వి యాదవ్ పూర్తి విశ్వాసంతో ఉన్నారు.

త్వరలోనే సీట్ల సర్దుబాటు….

నితీష్ కుమార్ పార్టీలో విభేదాలు తమకు అనుకూలిస్తాయని చెబుతున్నారు. ప్రశాంత్ కిషోర్ తో పాటు ముఖ్యనేతలు జేడీయూ నుంచి బయటకు వెళ్లిపోవడంతో తేజస్వి యాదవ్ కొత్త ఉత్సాహంతో ఉరకలేస్తున్నారు. ప్రతి నియోజకవర్గం వారీగా కార్యకర్తలు, నేతలతో సమావేశం అవుతున్నారు. త్వరలోనే కూటమిలో సీట్ల సర్దుబాటు చేసుకుని ముందుగానే ప్రచారంలోకి వెళతామని తేజస్వి యాదవ్ చెబుతున్నారు.

Tags:    

Similar News