తేజస్వికి అంత తొందరగా ఉందా?

బీహార్ ప్రభుత్వం ఏర్పడి ఇంకా నెలలు కూడా దాటలేదు. అప్పుడే సంక్షోభం తలెత్తింది. అతి తక్కువ స్థానాలతో అధికారానికి దూరమైన ఆర్జేడీ ఎలాగైనా ముఖ్యమంత్రి పదవిని చేపట్టాలని [more]

Update: 2021-01-08 17:30 GMT

బీహార్ ప్రభుత్వం ఏర్పడి ఇంకా నెలలు కూడా దాటలేదు. అప్పుడే సంక్షోభం తలెత్తింది. అతి తక్కువ స్థానాలతో అధికారానికి దూరమైన ఆర్జేడీ ఎలాగైనా ముఖ్యమంత్రి పదవిని చేపట్టాలని ఉవ్విళ్లూరుతుంది. జేడీయూలో ఉన్న అసంతృప్తిని సొమ్ము చేసుకునే ప్రయత్నంలో తేజస్వి యాదవ్ ఉన్నారు. అందుకే మైండ్ గేమ్ మొదలు పెట్టారు. బీహార్ లో 17 మంది జేడీయూ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని, త్వరలోనే ప్రభుత్వం కుప్ప కూలడం ఖాయమని పెద్దయెత్తున ప్రచారం జరుగుతుంది.

జేడీయూలో అసంతృప్తితో….

ఇటీవల జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏపార్టీకి స్పష్టమైన మెజారిటీ రాలేదు. 75 స్థానాలతో బీజేపీ అతి పెద్ద పార్టీగా ఉంది. ఆ తర్వాత 74 స్థానాలతో ఆర్జేడీ ఉంది. 48 స్థానాలను కైవసం చేసుకున్న జేడీయూ ముఖ్యమంత్రి పదవిని దక్కించుకుంది. అయితే ఈ నేపథ్యంలో అరుణాచల్ ప్రదేశ్ లో జేడీయూకు చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలను బీజేపీ చేర్చుకోవడంతోనే ఈ రచ్చ స్టార్టయింది. జేడీయూ నేతలను చేర్చుకోవడాన్ని నితీష్ కుమార్ తప్పుపట్టడంతో తేజస్వి యాదవ్ ఈ ప్రచారాన్ని ప్రారంభించారంటున్నారు.

తక్కువ స్థానాలతో…..

బీహార్ లో ప్రస్తుతం బీజేపీ కూటమికి 127 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. ఆర్జేడీ కూటమికి 116 మంది ఎమ్మెల్యేలున్నారు. ఇద్దరి మధ్య తేడా 11 మంది మాత్రమే. అయితే జేడీయూ సభ్యులను 17 మందిని చేర్చుకునే అవకాశం లేదు. వారిపై అనర్హత వేటు పడే అవకాశముంది. స్పీకర్ బీజేపీ కూటమికి చెందిన వారు కావడంతో ఎమ్మెల్యేలు అంత సులువుగా రారు. మళ్లీ ఎన్నికలంటే ఏ ఎమ్మెల్యే కూడా సుముఖంగా ఉండరు. మరి తేజస్వి యాదవ్ ఎందుకు సవాల్ విసురుతున్నారన్నది ప్రశ్న.

కష్టమేనంటున్నారు…..

17 మంది ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకునేందుకు న్యాయనిపుణులతో చర్చిస్తున్నామని కూడా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో నితీష్ కుమార్ తన ఎమ్మెల్యేలతో సమావేశమయినట్లు తెలిసింది. తేజస్వి యాదవ్ మైండ్ గేమ్ ఆడుతున్నారని, ఎవరూ పార్టీలో అసంతృప్తిగా లేరని ఆయన చెబుతున్నారు. పైగా బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండటంతో జేడీయూ ఎమ్మెల్యేలు నితీష్ కుమార్ ను కాదని తేజస్వి యాదవ్ వైపు చేరే అవకాశం లేదని అంటున్నారు. మొత్తం మీద తేజస్వి యాదవ్ కు తొందరగా ముఖ్యమంత్రి పదవిని దక్కించుకోవాలన్న ఆరాటంలో ఉన్నారు.

Tags:    

Similar News