లాలూ కొడుకు అదిరే షాక్ ఇచ్చాడే... నేష‌న‌ల్ పాలిటిక్స్‌లో క‌ల‌క‌లం

Update: 2018-06-04 17:00 GMT

తేజ‌స్వియాద‌వ్‌.. ఇప్పుడీ పేరు తెలియ‌ని వారుండ‌రు.. అతిపిన్న వ‌య‌స్సులోనే ఉప ముఖ్య‌మంత్రిగా బాధ్య‌తులు చేప‌ట్టిన వ్య‌క్తిగా.. రాష్ట్రీయ జ‌న‌తాద‌ల్ నేత లాలూప్ర‌సాద్ కుమారుడిగా కంటే.. మొన్న‌టి ఉప ఎన్నిక‌ల్లో బీజేపీ-జేడీయూ అభ్య‌ర్థిని మ‌ట్టిక‌రిపించి త‌న అభ్య‌ర్థిని గెలిపించుకున్న నేత‌గానే ఎక్కువ‌గా పాపుల‌ర్ అయ్యారు. త‌న తండ్రి లాలూప్ర‌సాద్ జైలులో ఉన్నా పార్టీ బాధ్య‌త‌లు చేప‌ట్టి విజ‌య‌వంతంగా ముందుకు తీసుకెళ్తున్న‌డీ యువ సంచ‌ల‌నం.

సవాల్ విసిరి మరీ...

సోష‌ల్ మీడియాను ప్ర‌ధాన అస్త్రంగా చేసుకుని ప్ర‌త్య‌ర్థుల ఎత్తుల‌ను చిత్తుచేశాడు. గెల‌వ‌డానికి ఎవ‌రేం చేసుకుంటారో చేసుకోండి.. చివ‌ర‌కు గెలిచేది మాత్రం మేమే.. అంటూ బీజేపీ-జేడీయూ కూట‌మికి స‌వాల్ విసిరి ఔరా అనిపించుకున్నాడు. జోకీహాట్ అసెంబ్లీ ఉప ఎన్నిక‌ల్లో త‌న అభ్య‌ర్థిని 40వేల మెజారిటీతో గెలిపించుకుని జాతీయ నేత‌ల దృష్టిని త‌న‌వైపు తిప్పుకున్నాడు తేజ‌స్వియాద‌వ్‌. ఇప్పుడా యువ‌నేత కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్‌కు జైకొట్టాడు.

కాంగ్రెస్ తో నడిచేందుకే...

దేశ‌వ్యాప్తంగా బీజేపీకి వ్య‌తిరేక ప‌వ‌నాలు వీస్తున్న త‌రుణం... బీజేపీయేత‌ర ప‌క్షాల‌న్నీ ఏక‌మ‌వుతున్న వేళ‌.. ఆర్జేడీ నేత తేజ‌స్వియాద‌వ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. బీజేపీయేత‌ర ప‌క్షాల‌తో ఏర్ప‌డే కూట‌మిలో కాంగ్రెస్ పార్టీ కీల‌కంగా వ్య‌వ‌హ‌రించే అవ‌కాశాలు ఉన్నాయి. ఇప్ప‌టికే ఆ పార్టీతో తృణ‌మూల్ కాంగ్రెస్‌, ఎన్సీపీ, బీఎస్పీ, ఎస్పీ, ఆర్ఎల్‌డీ, డీఎంకే త‌దిత‌ర ప‌క్షాలు కాంగ్రెస్ తో క‌లిసి న‌డిచేందుకు సుముఖ‌త‌ను వ్య‌క్తం చేస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే క‌ర్ణాట‌క ఎన్నిక‌ల ప్ర‌చారంలో కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్ త‌నకు ప్ర‌ధాని కావాల‌న్నఆకాంక్ష ఉంద‌ని వెల్ల‌డించారు. దీనిపై ప్ర‌ధాని మోడీ సెటైర్లు వేసి తీవ్ర విమ‌ర్శ‌ల పాల‌య్యారు.

రాహుల్ వ్యాఖ్యలకు మద్దతు...

ఇప్పుడు ఇదే విష‌యంపై తేజ‌స్వియాద‌వ్ కూడా స్పందించారు. 2019 లోక్‌ సభ ఎన్నికల్లో రాహుల్‌ ప్రధాని కావాలనుకోవడంలో ఎంతమాత్రం తప్పులేదని అభిప్రాయ పడ్డారు. రాహుల్‌ ప్రధాని కావాలని ప్రజలు కోరుకుంటే ఆయనని ఎవరూ ఆపలేరని స్ప‌ష్టం చేశారు. ఎవరికి ఏ పదవి దక్కాలో నిర్ణయించేది ప్రజలేన‌ని స్ప‌ష్టం చేశారు. వాళ్లే కావాలనుకుంటే వచ్చే ఎన్నికల్లో రాహుల్‌ ఎందుకు ప్రధాని కాకూడదు? అంటూ ప్ర‌శ్నించారు. మూడో కూటమి ప్రభుత్వాలు గ‌తంలో నిలబడలేదేమో.. ఇకముందు అవి విజయవంతంగా ముందుకు సాగుతాయనీ ఆయ‌న పేర్కొన్నారు.

గెలుపుపై ధీమా...

ఇంతకు ముందు మూడో కూటమి ప్రభుత్వాల్లో కాంగ్రెస్‌ లేదు కాబట్టే అవి మనుగడ సాగించలేకపోయాయ‌ని.. ఎప్పుడైతే కాంగ్రెస్‌ నేతృత్వంలో యూపీఏ ఏర్పడిందో అప్పటినుంచి వరుసగా పదేళ్లు అధికారంలో నిలిచిందని ఆయ‌న గుర్తు చేశారు. ఇప్పుడు ప్రాంతీయ పార్టీలన్నీ ఒకే వేదికపై వచ్చి కాంగ్రెస్ నేతృత్వంలో ముందుకు వెళ్తే దేశానికి మంచి రోజులొస్తాయ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. అన్ని పార్టీలు తమతమ ఇగోల‌ను ప‌క్క‌న ప‌డేసి ఏక‌తాటిపైకి వ‌స్తే గెలిచే అవ‌కాశాలు ఉన్నాయ‌ని తేజ‌స్వి ధీమా వ్య‌క్తం చేశారు. ఈ వ్యాఖ్య‌ల‌ను బ‌ట్టి చూస్తే ఆర్జేడీ కాంగ్రెస్‌తో జ‌ట్టుక‌ట్ట‌డం ఖాయంగానే క‌నిపిస్తోంది. ఈ వ్యాఖ్య‌లు జాతీయ రాజ‌కీయాల్లో ప‌లు ప్రాంతీయ పార్టీల చూపు కాంగ్రెస్ వైపే ఉన్న‌ట్టు కూడా స్ప‌ష్టం చేస్తున్నాయి. తేజ‌స్వి వ్యాఖ్య‌లు కాంగ్రెస్‌కు మంచి బూస్ట‌ప్ ఇచ్చేలా ఉన్నాయి.

Similar News