దేవుడున్నాడు అంటున్న తెలుగు తమ్ముళ్లు

రాష్ట్రంలో నలభైశాతం ఓట్లు తెచ్చుకున్న పార్టీ ఈరోజున దీనంగా దిక్కుతోచని స్థితిలో నిస్సహాయంగా ఎదురుచూస్తోంది. నలభై సంవత్సరాల పైచిలుకు అనుభవం ఉన్న రాజకీయనేత నాయకత్వం ఉన్నప్పటికీ ఆత్మస్థైర్యం [more]

Update: 2019-06-22 16:30 GMT

రాష్ట్రంలో నలభైశాతం ఓట్లు తెచ్చుకున్న పార్టీ ఈరోజున దీనంగా దిక్కుతోచని స్థితిలో నిస్సహాయంగా ఎదురుచూస్తోంది. నలభై సంవత్సరాల పైచిలుకు అనుభవం ఉన్న రాజకీయనేత నాయకత్వం ఉన్నప్పటికీ ఆత్మస్థైర్యం కోల్పోతోంది. రాజకీయ అవకాశవాదమన్న మాటే తప్పు. కచ్చితంగా నాయకులు తమకు ఉన్న అవకాశాలు, అవసరాల మేరకే ప్రవర్తిస్తారు. అందులో కొత్తేమీ లేదు. కానీ స్వయంగా ఎన్టీయార్ ఓడిపోయిన 1989లో సైతం ఇంతటి దీనావస్థ కనిపించలేదు. పార్టీ నైతికమూలాలను కోల్పోవడం వల్ల అయ్యో అని వినిపించే సానుభూతి కనిపించడం లేదు. ఏ ఎండకాగొడుగు పట్టినట్లుగా రెండేళ్లుగా సాగుతున్న కప్పగంతులు పార్టీకి ప్రస్తుతం ముందరికాళ్లకు బంధం వేస్తున్నాయి.ఎన్టీయార్ టైమ్ లోనే తెలుగుదేశం పార్టీ లో నియంతృత్వం ఉండేది. కానీ కొనుగోళ్ల సంస్క్రుతి లేదు. దాంతో అధినేత పట్ల భయభక్తులుండేవి. మరోసారి టిక్కెట్టు రాదేమోననే సంశయం ఉంటుండేది. వాటన్నిటికీ తెర దింపేసి 1995లో చంద్రబాబు తెలుగుదేశం పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత పార్టీ ప్రచారం, ఎన్నికల్లో ఖర్చును మూడు నాలుగింతలు చేసేశారు. 2014 పునరధికారం తర్వాత ఎన్నికైన ఇతర పార్టీల సభ్యులను ప్రలోభపెట్టి చేర్చుకోవడంతో పార్టీ జనంలో మరింత పలచనైపోయింది. అందుకే పార్టీ నెత్తిన పెట్టుకున్న రాజ్యసభ సభ్యులు గంపగుత్తగా గోడ దూకేసినా ఎక్కడా నిరసన స్వరం వినిపించడం లేదు. లక్షలాది కార్యకర్తల్లో స్పందన లేదు. ఆందోళన మాటే ఎత్తడం లేదు.

ఒకడున్నాడు…

దేవుడున్నాడా? లేడా? అంటే నమ్మకాన్ని బట్టి ఉంటుంది. హేతువాదులు చూపించమంటారు. శాస్త్ర నిరూపణ కోరతారు. ఆస్తికులు సర్వాంతర్యామి అంటారు. కానీ వైసీపీ, తెలుగుదేశం పార్టీ ల్లో ఈ మధ్యకాలంలో దేవుడి సెంటిమెంటు బాగా పెరిగిపోయింది. వైసీపీ విజయంలో దేవుని ఆశీర్వచనం ఉందని జగన్ చెప్పడంలో పెద్దగా ఆశ్చర్యపోవాల్సినది ఏమీ లేదు. కానీ తెలుగుదేశం పార్టీ నేతల్లోనే చాలామంది పశ్చాత్తాపాన్ని ప్రకటిస్తున్నారు. ఒంటిచేతిమీద కష్టపడి జగన్ 2014లో గెలిపించుకున్న 23 మంది ఎమ్మెల్యేలను టీడీపీ కలిపేసుకుంది. ముగ్గురు ఎంపీలను లాగేసుకుంది. 2019 ఎన్నికలు వచ్చేసరికి కచ్చితంగా ఆ సంఖ్యకు మాత్రమే తెలుగుదేశం పార్టీ పరిమితమవ్వడాన్ని ఒక మిరాకిల్ గా చూస్తున్నారు. యాదృచ్ఛికంగా జరిగినప్పటికీ సెంటిమెంటును దీనికి జోడిస్తున్నారు. కచ్చితంగా అదే నంబరు రావడమేమిటని నోళ్లు వెళ్లబెడుతున్నారు. అంతేకాదు. అధినాయకత్వం చెప్పకపోయినా వైసీపీకి దేవుడి ఆశీస్సులున్నాయనే టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. పైపెచ్చు జగన్ మోహన్ రెడ్డి హిందూ ధార్మిక కార్యక్రమాలు, మఠాధిపతుల పదవీ స్వీకారాల్లో సైతం పాలు పంచుకోవడాన్ని కూడా ప్రజలతో పాటు తెలుగుదేశం వర్గాలు ఆసక్తిగా వ్యాఖ్యానిస్తున్నాయి. అయితే ఇదే సందర్భంలో ఒక డిమాండును మాత్రం వినిపిస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానాల వంటి ధార్మిక పదవుల నియామకాల్లో రాజకీయ నాయకులకు పదవులు పంచిపెట్టడాన్ని ఈసారైనా పక్కనపెట్టాలని కోరుతున్నారు.

పంఖా భయం…

తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, సానుభూతిపరుల్లో స్తబ్ధత కనిపిస్తోంది. నాయకుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. నియోజకవర్గాల్లో , గ్రామాల్లో కార్యకర్తలకు భరోసా ఇవ్వలేకపోతున్నామంటున్నారు. తెలుగుదేశం హయాంలో అధికారిక పదవుల పంపిణీపై అధినాయకత్వం చురుకుగా వ్యవహరించలేదనేది ద్వితీయశ్రేణి నాయకుల ఆరోపణ. చాలా పదవులను అలా ఖాళీగానే ఉంచేశారు. వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధికారంలోకి వచ్చి నెలరోజులు కూడా గడవకుండానే నియోజకవర్గాల్లోని ముఖ్యపదవులు అన్నిటికీ జాబితాలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఈ పద్ధతి కారణంగానే కార్యకర్తలను కాపాడుకోగలమా? అన్న సందేహం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ నాయకులను వెన్నాడుతోంది. రాజ్యసభ సభ్యులు, పెద్ద నాయకుల పార్టీ మార్పిడులు మాత్రమే పైకి కనిపిస్తాయి. కానీ గ్రామ, మండల, జిల్లా స్థాయుల్లో చాలా వేగంగా రాజకీయ కదలికలు ఉన్నట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీకి అరవై లక్షల మందివరకూ కార్యకర్తలున్నట్లుగా అధికారికంగా చెబుతుంటారు. ఎమ్మెల్యేలు, నాయకులు తమ సొంత గుర్తింపు కోసం చేర్చేసిన పేర్లే వీటిలో ఎక్కువ. నిజంగా పార్టీ కోసం పనిచేసేవారు ఏడు నుంచి ఎనిమిది లక్షల మంది వరకూ ఉంటారని సీనియర్ నాయకులు పేర్కొంటున్నారు. వారిని కాపాడుకోవడమనేది ప్రస్తుతం పెద్ద సమస్యగా మారింది.

భవిష్యత్తుపై బెంగ…

తెలుగుదేశం నాయకులకు భవిష్యత్తుపై బెంగ మొదలైంది. పార్టీకి కొత్తతరం కనెక్టు కావడం లేదన్న చేదునిజం కొందరు నాయకులు చేయించుకున్న సర్వేల్లో తేలింది. రాష్ట్రవ్యాప్తంగా కులసమీకరణలు బలంగా పనిచేశాయి. అదే వర్గాల వారీ లెక్కలు తీసినప్పుడు యువతరం కేవలం 15శాతం మాత్రమే తెలుగుదేశం పార్టీ కి ఓటు వేసినట్లుగా టీడీపీవర్గాలు అంచనా వేస్తున్నాయి. మిగిలిన 85 శాతం ఓటింగులో మెజార్టీ వైసీపీ తీసేసుకుంది. కొత్తగా ఓటు హక్కు వచ్చినవారు, 25 ఏళ్లలోపు యువతను ప్రామాణికంగా తీసుకుంటే ఇందులో 25 శాతం వరకూ జనసేన వైపు మొగ్గు చూపితే, 60 శాతం వైసీపీకి ఓటేసినట్లుగా తేలింది. ఈ లెక్కలు తెలుగుదేశం నాయకులను భయాందోళనలకు గురి చేస్తున్నాయి. రాజకీయాల్లో కొత్త ఒరవడికి , కొత్త రక్తానికి పునాదులు వేసిన తెలుగుదేశం పార్టీ ఈరోజున నూతన తరానికి అనుసంధానం కాకపోవడంపై తీవ్రమైన చర్చ మొదలైంది. ఈ గ్యాప్ ను అందిపుచ్చుకునే లీడర్షిప్ రావాల్సి ఉంది. 12 మంది వారసులను మినహాయిస్తే విద్యార్థి, యువజన విభాగాల నుంచి వచ్చిన నాయకత్వం గడచిన దశాబ్దమున్నర కాలంగా టీడీపీలో ప్రత్యేకంగా పైస్థాయికి ఎదగలేదు. అందువల్ల ఫీల్డు లెవెల్ లో యూత్ తో సంబంధాలు తెగిపోయాయి. ఈ గణాంకాలు విస్త్రుతంగా బహిరంగం కాకుండా తెలుగుదేశం పార్టీ జాగ్రత్త పడుతోంది. కానీ చేతులు కాలిన చందమే.

Tags:    

Similar News