తమ్ముళ్ళకు షాకేనట… ?

తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం తాజాగా హై కోర్టు వెలువరించిన ఒక నిర్ణయం వల్ల ఆనందంగా ఉంది. పరిషత్తు ఎన్నికలను రద్దు చేస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుని [more]

Update: 2021-06-12 02:00 GMT

తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం తాజాగా హై కోర్టు వెలువరించిన ఒక నిర్ణయం వల్ల ఆనందంగా ఉంది. పరిషత్తు ఎన్నికలను రద్దు చేస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుని ఆ పార్టీ స్వాగతించింది. ఇది ప్రజాస్వామ్యానికి ఘన విజయం అని కూడా గట్టిగా చెప్పుకుంది. మళ్లీ రీ నోటిఫికేషన్ ఇచ్చి ఎన్నికలు జరిపించాలని కోర్టు చెప్పినందుకు హర్షం వ్యక్తం చేస్తూ ఆ విధంగా ముందుకు సాగాలని జగన్ సర్కార్ ని డిమాండ్ చేస్తోంది. సరే ఇది టీడీపీ పెద్దలకు సంతోషంగా ఉన్నా కూడా జిల్లాలలో ఉన్న తమ్ముళ్లకు మాత్రం షాకింగ్ న్యూసే అంటున్నారు. మరి అధినాయకత్వం ఖుషీ గా ఉంటే క్యాడర్ ఎందుకు అలా రివర్స్ లో రియాక్ట్ అవుతోంది అంటే దాని వెనక పెద్ద కధే ఉంది మరి.

మళ్లీ ఎన్నికలా…?

ఇదీ తమ్ముళ్లు వ్యక్తం చేస్తున్న అభిప్రాయం. మొత్తానికి కోర్టులో కేసులు వేసి ఎన్నికల రద్దుని టీడీపీ హై కమాండ్ చేయించగలిగినా మళ్ళీ ఎన్నికలు అంటే మాత్రం తమ్ముళ్ళకు అసలు రుచించడంలేదుట. ఇప్పటికే రెండేళ్ళుగా అన్ని రకాలుగా పోరాడి ఆరిపోయి ఉన్నామని, పైగా పంచాయతీ, మునిసిపల్ ఎన్నికల్లో చేదు ఫలితాలు వచ్చాక మరింత డీలా చెందామని తమ్ముళ్ళు అంటున్నారు. రీ నోటిఫికేషన్ ఇచ్చి ఎన్నికలు పెట్టించినా పోటీకి తయారుగా ఉన్న వారు ఎవరు అని తమ్ముళ్ళు ప్రశ్నిస్తున్నారు. మరోసారి ఎన్నికలు పెట్టినా గెలుస్తామన్న నమ్మకం లేదు కదా అని వారు వైరాగ్యం కూడా ప్రదర్శిస్తున్నారు.

అదే రిపీట్ …?

ఇపుడు ఏపీలో వైసీపీ బలంగా ఉంది. పైగా ఆ పార్టీ అధికారంలో ఉంది. వరస ఎన్నికల్లో విజయాలు కూడా ఆ పార్టీ నేతల్లో కొత్త జోష్ ని నింపుతున్నాయి. అందువల్ల మళ్ళీ ఎన్నికలకు వెళ్ళినా ఫలితాల్లో పెద్దగా మార్పు ఉండకపోవచ్చు అని తమ్ముళ్ళు చెబుతున్నారు. ఇదంతా అధినాయకత్వం ఆరాటం తప్ప మరోటి కాదని కూడా పెదవి విరుస్తున్నారు. ఇక స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీనే జనాలు గెలిపిస్తారు అన్నది కూడా చూశాక ఎందుకు పోటీ అంటూ చాలా మంది వెనకడుగు వేస్తున్నారు.

ఏం సాధించినట్లు …?

పరిషత్తు ఎన్నికలను బాయ్ కాట్ చేయమని చంద్రబాబు గతంలో పిలుపు ఇచ్చారు. దాంతో చాలా మంది తమ్ముళ్ళు బతికాం అనుకున్నారు. బాబు పిలుపు వెనక చాలా మంది తమ్ముళ్ళ నిరాసక్తత ఉంది అని గుర్తు చేస్తున్నారు. ఇది సమయం కాదు, ఎదురు నిలిచి గెలిచే సీన్ కూడా లేదు అని అంతా చెప్పాకనే బాబు ఆ నిర్ణయం తీసుకున్నారు అంటున్నారు. ఇక కొంతమంది మాత్రం తమకు బలం ఉన్న చోట నిలబడ్డారు. దాంతో పరిషత్తు ఎన్నికల తంతు ముగిసింది అని భావించారు. కానీ ఇపుడు మళ్లీ ఎన్నికలను తెచ్చి ముంగిట నిలిపిన తీరుకు తమ్ముళ్ళు మండిపడుతున్నారు. మరో మూడేళ్ల వరకూ తాము ఏ రకమైన ఎన్నికల సమరానికి సన్నద్ధం కాలేమని కూడా వారు తెగేసి చెబుతున్నారు. అయినా టీడీపీ పెద్దలు బలవంతంగా ఎన్నికలను తెచ్చి పెడితే మాత్రం చేదు ఫలితాలే మరోసారి నమోదు అవుతాయని కూడా హెచ్చరిస్తున్నారు. మరి పరిషత్ ఎన్నికల రద్దు మీద కోర్టుకు వెళ్ళి ఏదో గెలిచేశామనుకుంటున్న టీడీపీ సహా విపక్షాలు ఇంతకీ ఏం సాధించినట్లు అన్నదే క్షేత్ర స్థాయిలో సీన్ చూస్తే అర్ధమవుతున్న మ్యాటర్.

Tags:    

Similar News