టిక్కెట్లు ఇస్తే ఓటమి ఖాయమా?

Update: 2018-04-16 15:30 GMT

గెలుపు గుర్రాలకే ఎవరైనా రాజకీయంగా పెద్దపీట వేస్తారు. కచ్చితంగా విజయం సాధించి పార్టీ అధికారంలోకి రావడానికి పనికొస్తారని భావించిన వారిని అక్కున చేర్చుకుంటారు. ఈ యుద్దంలో దయాదాక్షిణ్యాలకు తావుండదు. సొంతమనుషులను, అవసరమైతే బంధువులను సైతం పక్కనపెట్టేస్తారు. పరాజితులను, లేదా అపజయం తప్పదని భావించిన వారిని దూరంగా పెట్టడంలో ఎటువంటి మొహమాటాలు ఉండవు. అందులోనూ ప్రాంతీయపార్టీల అధినేతలు ఈ లెక్కలు పక్కాగా పాటిస్తారు. ఎందుకంటే ఎమ్మెల్యేలు నెగ్గితే అధికారంలోకి వచ్చేది తామే కాబట్టి. వారి ఓటమి తమ ఓటమి పద్దులోకే పడుతుంది కాబట్టి. సవాలక్ష అవలక్షణాలున్నప్పటికీ ప్రాంతీయ పార్టీలు నెగ్గుకు రావడంలో ఈ జాగ్రత్తలే కీలకమవుతున్నాయి. తాజాగా తెలుగు రాష్ట్రాల్లో అధికారపార్టీల అధినేతలు ఈ కసరత్తును మొదలు పెట్టారు. తమ వద్ద ఇప్పటికే పార్టీ పరంగా ఉన్న సమాచారాన్ని క్రోడీకరించుకోవడంతోపాటు సర్వేసంస్థలు ఇచ్చిన సమాచారంతో సరిపోల్చి చూసుకుంటున్నారు. పరీక్షల్లో మార్కుల తరహాలో వెయిటేజీ కూడా పెట్టుకోవాలని యోచిస్తున్నారు. అంతర్గత సమావేశాల్లో ఈ విషయాలను ఇప్పటికే ఎమ్మెల్యే స్థాయి నాయకులకు సూచనప్రాయంగా చెప్పేశారు.

తెదేపా సామాజిక త్రాసు...

తెలుగుదేశం పార్టీ శాసనసభ ఎన్నికలకు అభ్యర్థులపై దృష్టి పెట్టింది. వైసీపీ నుంచి పార్టీలో చేరినవారితో కలిపి 125 మంది ఎమ్మెల్యేలున్నారు. వీరందరికీ యథాతథంగా టిక్కెట్లు ఇస్తే పార్టీ పుట్టిమునిగిపోతుందని చంద్రబాబు నాయుడికి తెలుసు. 40 సీట్లలో అభ్యర్థులను మార్చకపోతే పరాజయం తప్పదని ఇంటిలిజెన్సు, మీడియా, సర్వేల ద్వారా సేకరించిన సమాచారాన్ని బట్టి పార్టీ అధినాయకత్వం గుర్తించింది. వైసీపీ నుంచి 23 మంది పార్టీ తీర్థం తీసుకున్నారు. వీరిలో తొమ్మిది మంది తిరిగి గెలవడం అసాధ్యమనేది టీడీపీ అంచనా. అలాగని వారిని వదిలించుకుని పక్కనపెడితే పార్టీకి సహకరించకుండా నష్టం చేకూర్చే ప్రమాదం ఉంది. పార్టీలోనే దీర్ఘకాలంగా పనిచేస్తూ అధిష్టానం ఆశీస్సులతో ఎమ్మెల్యేలైన మరో 31 మంది సొంత ఎమ్మెల్యేలు సైతం నియోజకవర్గంలో ఎదురీదుతున్నారనేది సమాచారం. పార్టీ పట్ల వీరి లాయల్టీ తిరుగులేనిది. కానీ ఎన్నికలలో గెలుపు కోసం వీరిని నొప్పించకతప్పదంటున్నారు. వీరిలో ఒక 17 మంది వరకూ పెద్దగా తిరుగుబాటు చేయకపోవచ్చని అధిష్టానం చెప్పినట్లు నడుచుకుంటారని భావిస్తున్నారు. మరో 14 మంది తమకు టిక్కెట్టు దక్కకపోతే ఏదో ఒక స్థాయిలో పార్టీకి నష్టం చేకూర్చే అవకాశాలున్నాయని ప్రమాద సంకేతాలు అందుతున్నాయి. కులపరమైన సమీకరణలకూ తెలుగుదేశం పెద్దపీట వేయాలని చూస్తోంది. 2014 ఎన్నికల్లో కమ్మ సామాజిక వర్గానికి అత్యధిక సీట్లు కేటాయించకతప్పలేదు. పార్టీ వెంట అండగా నిలిచే ఈసామాజిక వర్గాన్ని 2019లోనూ నెత్తిన పెట్టుకోకతప్పదు. అయితే సీట్ల సంఖ్యను కుదించకపోతే చెడు సంకేతాలు వెళతాయని ఇతర వర్గాల నాయకులు చెబుతున్నారు. టిక్కెట్లు నిరాకరించే ఎమ్మెల్యేలకు ఇతర పదవులు అప్పగిస్తామని బుజ్జగించి తిరుగుబాటు రాకుండా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉన్న స్థానాలు, ఎమ్మెల్యేలకు టిక్కెట్టు నిరాకరించే స్థానాలన్నిటినీ కలిపి చూస్తే 62 నియోజకవర్గాల్లో టీడీపీకి అసంతృప్తుల గండం ఉండొచ్చనేది ప్రాథమిక అంచనా.

తెరాస తిరకాసు...

తెలంగాణ రాష్ట్రసమితి ఎమ్మెల్యేల్లో మూడొంతుల మందికి సొంత ఇమేజ్ లేదు. ఉద్యమ ప్రభావం, కేసీఆర్ ప్రచారంపై ఆధారపడి గెలిచారు. గడచిన నాలుగు సంవత్సరాలుగా వీరిలో చాలామంది ఆర్థికంగా బలపడ్డారే తప్ప ప్రజాబలం సంపాదించలేకపోయారు. మరోవైపు టీడీపీ, కాంగ్రెసుల నుంచి వచ్చిన ఎమ్మెల్యేలకు సొంత పరపతి అంతంతమాత్రమే. అప్పట్లో టీడీపీ సీమాంధ్రుల ఓట్ల ప్రభావంతో గ్రేటర్ హైదరాబాదులో అధిక స్థానాలు సంపాదించింది. 12 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరిపోయారు. వీరెవరికీ సొంతబలం లేకపోవడం ఇప్పుడు టీఆర్ఎస్ కు నష్టదాయకంగా మారుతోంది. అప్పట్లో విపక్షాలను పూర్తిగా నిర్వీర్యం చేసే లక్ష్యంతో టీడీపీ, కాంగ్రెసుల నుంచి ఫిరాయింపులను అధికారపార్టీ ప్రోత్సహించింది. ఇప్పుడు వీరంతా భారంగా మారారు. ఈ ఫిరాయింపుదారుల్లో ఎక్కువమంది గెలిచే అవకాశాల్లేవని కేసీఆర్ మూడు సర్వేల ద్వారా నిర్ధారించుకున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల్లో కూడా 23 మంది నియోజకవర్గాల్లో బాగా వెనకబడి ఉన్నారని సర్వేల్లో తేలింది. ఇంటిలిజెన్సు నివేదికలు సైతం దాదాపు అదే సంఖ్యను ధృవీకరిస్తున్నాయి. మొత్తమ్మీద అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో ఈ విషయాలు గుబులు రేకెత్తిస్తున్నాయి. సూచన ప్రాయంగా అధిష్టానం కూడా ఈ అంశాన్ని ఆయా ఎమ్మెల్యేల దృష్టిలో పెట్టినట్లు తెలిసింది. నియోజకవర్గాల్లో రానున్న మూడు నెలల్లో విస్తృతంగా పర్యటించి ఇమేజ్ మేకోవర్ కు ప్రయత్నించకపోతే సీటు గల్లంతేనని టీఆర్ఎస్ అధిష్ఠానం తేల్చి చెప్పినట్టుగా పార్టీలో ప్రచారం సాగుతోంది. నియోజకవర్గాల్లో ప్రజలకు అందుబాటులో ఉండటం, ప్రభుత్వ పథకాలపై ప్రజలలో సానుకూల స్పందన రాబట్టడం అనేది ఎమ్మెల్యేల వెయిటేజీలో భాగంగా చెబుతున్నారు. జులై, ఆగస్టు నాటికి మరో సర్వే నిర్వహించి ప్రజాభిమానం లేని ఎమ్మెల్యేల చిట్టా చింపేయనున్నట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో 2019 జాబితాలో ఎందరి పేర్లు గల్లంతవుతాయో తెలియని అయోమయం నెలకొంది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News