అందులో మాత్రం వైసీపీ కంటే టీడీపీయే బెటరట

వైసీపీలో పరిస్థితులు చూస్తుంటే టీడీపీయే చాలా బెటర్ అనిపిస్తుంది. రెండు ప్రాంతీయ పార్టీలే. అయినా అధికారంలో ఉన్నప్పుడు టీడీపీలో ఉన్న క్రమశిక్షణ వైసీపీలో కనిపించడం లేదు. లెక్కకు [more]

Update: 2020-12-27 14:30 GMT

వైసీపీలో పరిస్థితులు చూస్తుంటే టీడీపీయే చాలా బెటర్ అనిపిస్తుంది. రెండు ప్రాంతీయ పార్టీలే. అయినా అధికారంలో ఉన్నప్పుడు టీడీపీలో ఉన్న క్రమశిక్షణ వైసీపీలో కనిపించడం లేదు. లెక్కకు మించిన నేతలు ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణం కావచ్చు. కానీ ఎక్కడా విభేదాలను పరిష్కరించే ప్రయత్నాలు అధిష్టానం చేయకపోవడంతో వైసీపీలో రోజురోజుకూ విభేదాలు ముదురుతున్నాయి. వీధినపడుతున్నారు. పోలీస్ స్టేషన్ల గడప తొక్కుతున్నారు. ప్రజల్లో ఇది పలచనగా మారింది.

23 మందిని చేర్చుకున్నా…..

చంద్రబాబు ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్నారు. 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకున్నారు. కానీ ఏ నియోజకవర్గంలోనూ పెద్దగా విభేదాలు తలెత్తలేదు. ఎన్నికలకు ముందు కొంత విభేదాలు టీడీపీలో కన్పించాయి కాని మూడేళ్ల పాటు అనేక నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు సమన్వయంతోనే పనిచేశారు. ఇక వైసీపీ విషయానికొస్తే కేవలం అధికారంలోకి వచ్చిన 19 నెలల కాలంలోనే విభేదాలతో నేతలు రోడ్డున పడ్డారు.

చర్యలు తీసుకోకపోవడంతోనే….

ఇందుకు హైకమాండ్ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడమే కారణమంటున్నారు. వైసీపీ ఎంపీగా గెలిచిన రఘురామ కృష్ణంరాజు పార్టీపైనా, ప్రభుత్వంపైనా నిత్యం విమర్శలు చేస్తున్నా ఆయనపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇది మిగిలిన నియోజకవర్గాలలో నేతలకు అలుసుగా మారిందంటున్నారు. అందుకే ఎమ్మెల్యేల దగ్గర నుంచి ఎంపీల వరకూ తమ వర్గాన్ని కాపాడుకునే ప్రయత్నంలో తమ పార్టీలోని వైరి వర్గంతో ఢీ కొడుతున్నారు. అంబటి రాంబాబు విషయమే తీసుకుంటే సొంత పార్టీ నేతలే ఆయనపై హైకోర్టులో పిటీషన్ వేసిన సంగతి తెలిసిందే.

ఏ నియోజకవర్గంలో చూసినా…..

ఇక ఏ నియోజకవర్గంలో చూసినా ఆధిపత్య పోరు నడుస్తుంది. పదవులు పెద్దయెత్తున భర్తీ చేస్తున్నా, సంక్షేమ కార్యక్రమాలను ఇబ్బడి ముబ్బడిగా అమలు చేస్తున్నా ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉండటమే ఇందుకు కారణం. పదవులపై హోప్స్ పెట్టుకున్న నేతలు ఎక్కువ కావడం కూడా రచ్చ కావడానికి ప్రధాన కారణమని చెబుతున్నారు. విభేదాలను పరిష్కరించడానికి సీనియర్ నేతలను జగన్ నియమించినా ఫలితం లేకుండా పోయింది. మొత్తంమీద వైసీపీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారిందనే చెప్పాలి.

Tags:    

Similar News