ఓటమి టీడీపీది.. ఓడింది చంద్రబాబు కాదు..!

ఓ సినిమాలో రజనీకాంత్..‘‘పెళ్లి కొడుకు ఇతడే.. కానీ ఇతడు వేసుకున్న బట్టలు మాత్రం నావి’’ అనే డైలాగ్ పదే పదే చెబుతుంటాడు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అనుబంధ [more]

Update: 2019-05-28 00:30 GMT

ఓ సినిమాలో రజనీకాంత్..‘‘పెళ్లి కొడుకు ఇతడే.. కానీ ఇతడు వేసుకున్న బట్టలు మాత్రం నావి’’ అనే డైలాగ్ పదే పదే చెబుతుంటాడు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అనుబంధ మీడియా కూడా ఇదే ఫాలో అవుతోంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి చరిత్రలో ఇంతవరకు లేని దారుణ ఓటమి ఎదురైంది. రాష్ట్రవ్యాప్తంగా జగన్ సునామీలో ఆ పార్టీ కకావికళం అయ్యింది. నాలుగు జిల్లాలో పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. తెలుగుదేశం పార్టీకి కంచుకోటలుగా చెప్పుకునే నియోజకవర్గాల్లోనే వేల ఓట్ల తేడా ఓటమి పాలయ్యింది. హేమాహేమీల్లాంటి నేతలు చిత్తయిపోయారు. ఏకంగా తెలుగుదేశం పార్టీ కంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 10 శాతం ఓట్లు అధికంగా రావడంతో తెలుగుదేశం పార్టీ పూర్తిగా చిత్తయిపోయింది.

ఓటమిని చిన్నది చేసేందుకు తాపత్రయం

తెలుగుదేశం పార్టీ ఇంతటి దారుణ ఓటమి ఎదుర్కోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఐదేళ్ల అధికారంలో చంద్రబాబు సహా ఆ పార్టీ ప్రజాప్రతినిధులు చేసిన తప్పులు ఎన్నికల్లో ఓటమికి ప్రధాన కారణం. ఎమ్మెల్యేలపై విపరీతమైన వ్యతిరేకత, చంద్రబాబు పెంచి పోషించిన జన్మభూమి కమిటీలపై ప్రజాగ్రహం, రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చంద్రబాబు యూటర్న్ లు తీసుకోవడం, నాలుగున్నరేళ్లు వదిలి చివరి ఆరు నెలలు ప్రజలను పథకాలతో మభ్యపెట్టాలని చూడటం వంటి అనేక కారణాలు తెలుగుదేశం పార్టీ ఓటమికి కారణం. అన్నింటికీ మించి వైఎస్ జగన్ కు ఒక్క అవకాశం ఇవ్వాలని భావన ప్రజల్లో పెద్ద ఎత్తున వ్యక్తం కావడం. అయితే, తెలుగుదేశం పార్టీ ఇంతటి దారుణ ఓటమి సాధించినా ఆ పార్టీకి అనుకూలంగా ఉండే మీడియా మాత్రం తెలుగుదేశం పార్టీ ఓటమిని తక్కువ చేయడానికి తీవ్రంగా చెమటోడ్చుతోంది. ఓటమికి చంద్రబాబు కారణం కాదని చెప్పడానికి ఆ మీడియా చాలా కష్టపడుతోంది.

ఓటమికి కారణాలు ఇవేనట…

చంద్రబాబు బాగా పనిచేశారని, ఆయన పాలన బాగుందని అయితే ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకతే ఓటమికి కారణమని ఆ సెక్షన్ మీడియా చెబుతోంది. అయితే, 10 మంది లేదా 20 మంది, మహా అయితే 30 మంది ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉంటుంది. కానీ, ఈసారి ఎన్నికల్లో ఏకంగా సుమారు 90 మంది ఎమ్మెల్యేలు ఓటమి పాలయ్యారు. అయినా ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందని గుర్తించిన చంద్రబాబు.. ప్రతీ నియోజకవర్గంలో తానే అభ్యర్థినని భావించాలని, తనను చూసే ఓటేయాలని ప్రజలను కోరారు. అయినా ప్రజలు ఓట్లేయలేదు కదా అంటున్నారు వైసీపీ నేతలు. ఇక, టీడీపీ ఓటమికి ఆ పార్టీ అనుకూల మీడియా చెబుతున్న మరో కారణం కూడా ఇంతే విచిత్రంగా ఉంది. 32 నియోజకవర్గాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థు మెజారిటీ కంటే జనసేన పార్టీకి వచ్చిన ఓట్లు అధికం అనేది ఆ వార్తల ఉద్దేశ్యం. అయితే, జనసేన చీల్చింది ఒక్క తెలుగుదేశం పార్టీ ఓట్లే అని చెప్పలేము. ప్రభుత్వ వ్యతిరేక ఓటు కూడా జనసేన చీల్చారు. వాస్తవానికి ప్రభుత్వ వ్యతిరేక ఓటు జనసేన చీల్చాలనేదే టీడీపీ ఆలోచన కూడా. ఇటువంటి వాదనలు, కథనాలు తెరపైకి తీసుకురావడం వెనుక టీడీపీ ఓటమిని చిన్నది చేయడంతో పాటు చంద్రబాబు తప్పేమీ లేదని చూపించాలని ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది.

Tags:    

Similar News